Robinhood OTT: ఎట్ట‌కేల‌కు నితిన్ రాబిన్‌హుడ్‌కు మోక్షం! ముందు టీవీ.. త‌ర్వాతే ఓటీటీ! స్ట్రీమింగ్‌ ఎప్ప‌టినుంచి .. ఎందులో అంటే?

ABN, Publish Date - May 03 , 2025 | 04:59 PM

నితిన్ ప‌రాజ‌యాల యాత్రను కంటిన్యూ చేస్తూ మార్చి నెలాఖారున‌ థియేట‌ర‌ల్లోకి వ‌చ్చిన చిత్రం రాబిన్‌హుడ్. సుమారు 40 రోజుల త‌ర్వాత ఇప్పుడు ఓటీటీకి వ‌చ్చేస్తోంది. అయితే ఈ సినిమాను మొద‌ట‌గా టీవీలో వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టెలికాస్ట్ చేసి ఆపై ఓటీటీకి తేనున్నారు.

robbin hood

నితిన్ (Nithiin) ప‌రాజ‌యాల యాత్రను కంటిన్యూ చేస్తూ మార్చి నెలాఖారున‌ థియేట‌ర‌ల్లోకి వ‌చ్చిన చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood ). విడుద‌ల‌కు ముందు క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్‌, కేతిక శ‌ర్మ పాట స్టెప్పుల వివాదం, శ్రీలీల (Sreeleela) కాంబినేష‌న్ వెర‌సి ఆకాశన్నంటిన ప్ర‌చార కార్య‌క్ర‌మాల హాడావుడితో ఈ మ‌ధ్య‌ ఏ చిత్రానికి రాని విధంగా మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా అంతే త్వ‌ర‌గా థియేట‌ర్ల‌ను వీడి నితిన్ లిస్టులో మ‌రో ప‌రాజ‌య చిత్రంగా మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాతో పాటు రిలీజైన‌. త‌ర్వాత విడుద‌లైన చిత్రాలు రెండు , మూడు వారాల్లోనే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఆల‌స్య‌మైంది. సుమారు 40 రోజుల త‌ర్వాత ఇప్పుడు ఓటీటీకి వ‌చ్చేస్తోంది. అయితే ముందుగా ఈ సినిమాను టీవీలో వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టెలికాస్ట్ చేయ‌నుండ‌డం విశేషం.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ఓ అనాథాశ్రమంలో పెరిగిన రామ్‌ (నితిన్‌) ఆ ఆశ్రమానికి ఆదాయ కోసం రాబిన్‌హుడ్ అవ‌తార‌మెత్తుతాడు.ఈక్ర‌మంలో ఉన్న వారిని దోచుకుని కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. కొన్నాళ్ల‌కు పోలీసుల నిఘా పెరగడంతో రిస్క్‌ అని భావించి ఆ పని వ‌దిలేసి జాన్‌ సున్నిపెంట అలియాస్‌ జాన్‌ (రాజేంద్రప్రసాద్‌) కు చెందిన ఇండియాస్‌ నంబర్‌వన్‌ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిలో చేరతాడు. ఆపై అప్పుడే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన నీరా వాసుదేవ్‌ (శ్రీలీల)కు సెక్యురిటీగా వెళ్తాడు రామ్‌. ఆమెను ఓ ముఠా ఫాలో అవుతుంది. అసలు నీరా ఎవరు? ఆమె ఇండియా ఎందుకు వచ్చింది? తనకు ఎదురైన సమస్యలేంటి? గంజాయి మాఫియా సామితో ఆమెకు లింక్‌ ఏంటి? రామ్ ఏం చేశాడు? రాబిన్‌హుడ్‌ కోసం వెతుకుతున్న విక్టర్‌ (షైన్‌ టామ్‌ చాకో)కు దొరికాడా లేదా అన్నది కథ.


ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ కొన్ని హ‌స్య స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీన్లు అల‌రిస్తాయి, పాట‌లు విజువ‌ల్‌గా ఆక‌ట్టుకుంటాయి. జీవీ ప్ర‌కాశ్ (G. V. Prakash Kumar) అందించిన సంగీతం సోసోగా ఉంటుంది. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) సుమారు రూ. 60 కోట్ల వ్యయంతో స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల (Venky Kudumula) ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీని రూపొందించారు. ఇదిలాఉండ‌గా ఈ సినిమాను మే 10 శ‌నివారం రోజున‌ సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా జీ తెలుగు (ZeeTelugu) శాటిలైట్ టీవీలో ప్ర‌సారం చేసి ఆపై జీ5 (ZEE5) ఓటీటీలో స్ట్రీమింగ్ చేయ‌నుండ‌డం గ‌మ‌నార్హం. థియేట‌ర్ల‌లో ఈ సినిమాను మిస్స‌యిన వారు, థియేట‌ర్‌లో ఏం చూస్తాం ఓటీటీలో చూస్తే పోలా అనుకున్న‌ వారు ఈ మండు వేస‌విలో ఇంటి ప‌ట్టునే ఉంటూ కాల‌క్షేపానికి ఈ రాబిన్ హుడ్ చిత్రాన్ని ఓ సారి చూసేయ‌వ‌చ్చు.

Updated Date - May 03 , 2025 | 05:03 PM