Devika & Danny: కోవై సరళ వచ్చేస్తోంది...

ABN , Publish Date - May 07 , 2025 | 11:39 AM

వెండితెరపై వినోదాల జల్లు కురిపించిన కోవై సరళ చాలా కాలం తర్వాత తెలుగువారి ముందుకు ఓ వెబ్ సీరిస్ తో రాబోతోంది. శివ కందుకూరి, రీతువర్మ జంటగా నటిస్తున్న ఈ వెబ్ సీరిస్ లో కోవై సరళ నటిస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు కోవై సరళ (Kovai Sarala) ఇచ్చిన వినోదాన్ని నిన్నటి తరానికి మరే నటి ఇవ్వలేదన్నది వాస్తవం. ముఖ్యంగా బ్రహ్మానందం (Brahmanandam), కోవై సరళ అందించి కామెడీని ఎవ్వరూ అంతతేలికగా మర్చిపోలేరు. తనదైన బాణీలో సంభాషణలు పలుకుతూ... డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు కోవై సరళ అందరినీ మెప్పించింది. అయితే కారణాలు ఏవైనా ఆమె కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది. తమిళంలో కూడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. అలా తెలుగులో డబ్ అయ్యి వచ్చిన సినిమాలను మాత్రమే తెలుగువాళ్ళు చూసి ఆనందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోవై సరళ ఓ స్ట్రయిట్ తెలుగు వెబ్ సీరిస్ లో నటిస్తుండటం అందరినీ ఆనందానికి గురిచేస్తోంది. అదే 'దేవిక అండ్ డానీ' (Devika & Danny).


శివ కందుకూరి (Shiva Kandukuri), రీతూవర్మ జంటగా నటిస్తున్న ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే వచ్చింది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి (Raj Kandukuri) నిర్మించిన 'పెళ్ళిచూపులు' (Pellichupulu) సినిమాతో రీతూవర్మకు హీరోయిన్ గా మంచి గుర్తింపు, విజయం లభించాయి. ఇప్పుడీ వెబ్ సీరిస్ లో హీరోగా రాజ్ కందుకూరి తనయుడు శివ నటిస్తున్నాడు. రీతూవర్మకు ఇదే మొదటి వెబ్ సీరిస్. 'శ్రీకారం' (Sreekaram) ఫేమ్ బి. కిశోర్ ఈ వెబ్ సీరిస్ ను డైరెక్ట్ చేశాడు. అతనితోపాటు ఇందులో సూర్య వశిష్ఠ, సుబ్బరాజు, మౌనికా రెడ్డి, సోనియా సింగ్, చాగంటి సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జయ్ క్రిష్ దీనికి మ్యూజిక్ అందించాడు. త్వరలో ఈ వెబ్ సీరిస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి కోవై సరళ కామెడీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలుగువారికి ఆమె ఎలాంటి వినోదాన్ని ఈ వెబ్ సీరిస్ తో పండిస్తుందో చూడాలి.

Also Read: Highest 2 Lowest Teaser: ది గ్రేట్‌ అకిరా కురోసావా సినిమా రిమేక్.. హ‌య్య‌స్ట్ 2 లోయ‌స్ట్ టీజ‌ర్ వ‌చ్చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 07 , 2025 | 11:39 AM