Revolver Rita: కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా ఓటీటీకి.. వచ్చేసింది! ఫుల్ ఫన్ రైడ్
ABN, Publish Date - Dec 26 , 2025 | 06:50 AM
గత నెల చివరలో థియేటర్లకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం రివాల్వర్ రీటా.
గత నెల చివరలో థియేటర్లకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం రివాల్వర్ రీటా (Revolver Rita). కీర్తి సురేశ్ (Keerthi Suresh) లీడ్ రోల్‌లో నటించగా రాధిక (Radhika Sharath Kumar), సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్‌స్లే , జాన్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రైమ్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి చంద్రు (JK. Chandru) దర్శకత్వం వహించాడు. నవంబర్ 28న ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ఈ చిత్రం ప్రచార లోపం, విడుదలలో జాప్యం వళ్ల జనాలకు చేరువ కాలేక పోయింది. ఇప్పుడీ ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. సినిమా అసాంతం పాండిచ్చేరి నేపథ్యంలోనే సాగుతుంది. ఏపీ నుంచి అక్కడికి వెళ్లిన జయ సింహారెడ్డి అనే వ్యక్తిని అక్కడి డాన్ పాండ్యన్ నరికేస్తాడు. దీంతో తన అన్నను చంపిన పాండ్యన్‌ను ఎలాగైనా చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు తమ్ముడు రెడ్డి. ఈ క్రమంలో పదిహేనేళ్లు గడిచి పోతాయి. ఆ సమయంలో పాండ్యన్ స్థానంలో అతని కుమారుడు బాబీ ఫీల్డ్‌లోకి వస్తాడు. అయితే చాలాకాలంగా పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న రెడ్డి ఓ ఫ్లాన్ వేసి పాండ్యన్‌ను అంతం చేయాలని చూస్తాడు. కానీ శత్రువుల చేతిలో కాకుండా సరిగ్గా ఆ సమయంలోనే రీటా, చెల్లమ్మ అనే తల్లీ కూతుర్లు ఉంటున్న ఇంటికి వెళ్లిన పాంగ్యన్ అక్కడ అనుకోకుండా జరిగిన గొడవలో ప్రాణాలు కోల్పోతాడు.
దీంతో.. పాండిచ్చేరికే పెద్ద డాన్ అయిన పాండ్యన్ శవాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. ఈ నేపథ్యంలో తండ్రి మరణం విషయం తెలుసుకున్న బాబీ రంగంలోకి దిగడం, ఆ వెంటే రెడ్డి, పోలీసులు వెంటపడుతుంటారు. ఈ క్రమంలో వారి నుంచి రీటా ఆమె తల్లి ఎలా తప్పించుకున్నారు, వారిని ఎలా ఎదుర్కోగలిగారనేదే కథ. సినిమా స్టార్ట్ అయింది మొదలు చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంటిల్లిపాదికి మంచి వినోదం అందిస్తుంది. ప్రతీ పాత్ర నవ్వులు పూయిస్తూనే అంతర్లీనంగా చేజ్ సాగుతూ రక్తి కట్టిస్తుంది. ఇప్పుడీ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంటిల్లిపాది కలిసి సినిమా చూసేయవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేవు.