సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jio Hot Star: సౌత్‌ను టార్గెట్ చేసిన జియో హాట్‌స్టార్‌! కంటెంట్‌పై.. రూ. 12 వేల కోట్లు

ABN, Publish Date - Dec 10 , 2025 | 11:15 AM

జియో హాట్ స్టార్ సంస్థ రాబోయే ఐదు సంవత్సరాలలో దక్షిణ భారతదేశంలో రూ. 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది. దీనికి సంబంధించి తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, నాగార్జున, మోహన్ లాల్ పాల్గొన్నారు.

Jio HotStar

జియో హాట్ స్టార్ (Jio Hot Star) తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించబోతోంది. రాబోయే ఐదు సంవత్సరాలలో దక్షిణ భారతదేశంలో దాదాపు పన్నెండు వేల కోట్లను వెచ్చించి, కంటెంట్ ను సృష్టించబోతోంది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల కు ఎం.ఓ.యు.ను చేసుకుంది. చెన్నయ్ లో సినిమా రంగ ప్రముఖులు పలువురు హాజరైన ఈ కార్యక్రమంలో తమిళనాడులో ఉప ముఖ్యమంత్రి, నటుడు, నిర్మాత, పంపిణీ దారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా జియో హాట్ స్టార్ సౌత్ అన్ బౌండ్ ఈవెంట్ ప్రారంభమైంది.


ఈ సందర్భంగా జియో హాట్ స్టార్ ఎవిఓడీ బిజినెస్ అండ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుశాంత్ శ్రీరామ్ మాట్లాడుతూ, నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో రాబోయే ఐదేళ్ళలో తమ సంస్థ పన్నెండు వేల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతోందని ప్రకటించారు. దీనికి ముందు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.ఎం. స్టాలిన్ కు ఈ వివరాల ప్రతాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ, 'జియో హాట్ స్టార్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడులో యంగ్ క్రియేటివ్ పీపుల్ కు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, కొత్త ఉద్యోగాలు వస్తాయ'ని అన్నారు. జియో హాట్ స్టార్ సంస్థ ఫిల్మ్ మేకర్స్, రైటర్స్, ఎడిటర్స్, డిజిటల్ స్టోరీ టెల్లర్స్ ను ప్రోత్సహించేందుకు వర్క్ షాప్స్ ను నిర్వహిస్తుందని, దీని ద్వారా ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా పదిహేను వేలమందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. జియో హాట్ స్టార్ 'బ్లాక్ బస్టర్ సౌత్ లైనప్' పేరుతో 25 న్యూ టైటిల్స్ ను ప్రకటించింది. దీనిని ఉదయనిధి స్టాలిన్ ఆవిష్కరించారు.


సంస్కృతి, సంప్రదాయాలకు చెన్నయ్ నెలవుగా ఉండేదని, గతంలో తెలుగు, మలయాళ చిత్రాలను సైతం ఇక్కడే చిత్రీకరించేవారని ఉదయనిధి గుర్తు చేశారు. అన్నా దొరై, కరుణానిధి వంటి మహానుభావులు తమిళ సినిమాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, రాజకీయాలలోనూ, జీవితంలోనూ కళ శక్తివంతమైన పాత్రను పోషిస్తుందని, కళ స్వేచ్ఛను అందిస్తే సినిమాలు మనిషిలో వికాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. సినిమాలకు ఓటీటీ ప్రత్యామ్నాయం కాదని, దానికి కొనసాగింపని ఉదయనిధి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఎం.పి. స్వామినాథన్ తో పాటు ఎం.ఎన్.ఎం. అధ్యక్షులు, ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యులు కమల్ హాసన్ (Kamal Haasan), నాగార్జున (Nagarjuna), మోహన్ లాల్ (Mohanlal) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:42 AM