The Fantastic Four OTT: రూ.4380 కోట్ల హాలీవుడ్ సినిమా.. ఫ్రీగా ఓటీటీకి వచ్చేసింది!
ABN, Publish Date - Nov 06 , 2025 | 04:46 PM
మూడు నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం ‘ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ మూవీ ఫ్రీగా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.
రెండు నెలల క్రితం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఘనవిజయం సాధించిన చిత్రం ‘ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ (The Fantastic Four: First Steps)’. మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా, లెజెండరీ సూపర్ హీరోల టీమ్ ఫాంటాస్టిక్ ఫోర్‌ను తొలిసారి MCU (Marvel Cinematic Universe)లో పరిచయం చేసింది. మ్యాట్ షక్మాన్ (Matt Shakman) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పెడ్రో పాస్కల్, వెనెస్సా కిర్బీ, ఎబోన్ మోస్-బచ్రాచ్, జోసెఫ్ క్విన్, జూలియా గార్నర్, సారా నైల్స్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. సుమారు 200 మిలియన్ డాలర్ల (దాదాపు ₹1200 కోట్లు) తో తెరకెక్కిన ఈ భారీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా $521 మిలియన్ (సుమారు ₹4380 కోట్లు) వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. అలాంటి ఈ చిత్రం నెల రోజుల క్రితమే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసినప్పటికీ కేవలం రెంట్ పద్దతిలో మాత్రమే ఉండేది. అయితే.. తాజాగా ఈ మూవీ ఫ్రీగా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. సైన్స్ ఫిక్షన్, కుటుంబ అనుబంధాలు, హ్యూమర్, అద్భుతమైన విజువల్స్ కలగలిసి ఈ చిత్రం ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది. కాస్మిక్ రేలకు గురై ప్రత్యేక శక్తులు పొందిన నలుగురు వ్యోమగాములు రీడ్ రిచర్డ్స్, స్యూ స్టోర్మ్, బెన్ గ్రిమ్, జానీ స్టోర్మ్ కలిసి ఫాంటాస్టిక్ ఫోర్ అనే సూపర్ హీరో బృందంగా అవతరిస్తారు. కాలక్రమంలో ప్రజాదరణ పొందిన వీరు, తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. రీడ్ స్యూ దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రకటించగానే, ప్రపంచవ్యాప్తంగా ఆ బిడ్డ గురించి చర్చ మొదలవుతుంది.
అదే సమయంలో విశ్వంలోని గ్రహాలను కబళిస్తూ ముందుకు సాగుతున్న గాలాక్టస్ అనే మహాశక్తి భూమిని లక్ష్యంగా చేసుకుంటుంది. అతని సేవకురాలు సిల్వర్ సర్ఫర్‌ను భూమిపైకి పంపడంతో సరికొత్త సమస్యలు వస్తాయి. రీడ్ చేసిన పరిశోధనల ద్వారా ఈ ప్రమాదం నిజమని తేలడంతో, ఫాంటాస్టిక్ ఫోర్ బృందం అంతరిక్ష యాత్ర చేపట్టి గాలాక్టస్‌ను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ గాలాక్టస్, స్యూ గర్భంలోని శిశువులో అపారమైన కాస్మిక్ శక్తి ఉందని తెలుసుకుంటాడు. ఆ బిడ్డను తనకు అప్పగిస్తే భూమిని విడిచిపెడతానని ప్రతిపాదిస్తాడు. అయితే ఫాంటాస్టిక్ ఫోర్ దీనికి ఒప్పుకోరు. ఈ నిర్ణయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయగా, వీరు తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటి? భూమిని ఎలా కాపాడారు? సిల్వర్ సర్ఫర్ పాత్ర ఏంటి? అనేది రసవత్తరంగా చూపించారు.
ఇప్పుడీ సూపర్ హీరో విజువల్ స్పెక్టాకిల్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదట్లో రెంట్ పద్ధతిలో వచ్చిన ఈ మూవీని ఇప్పుడు అందరూ ఉచితంగా చూడవచ్చు.థియేటర్‌లో మిస్సయిన వారు, సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు తప్పక చూడాల్సిన ఈ చిత్రం, యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ ఫీల్స్ కలయికగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎలాంటి అసభ్య సన్నివేశాలు లేకుండా మొత్తం కుటుంబం కలిసి చూడదగిన మార్వెల్ విజువల్ వండర్ ఈ ది ఫాంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ (The Fantastic Four: First Steps).