Maareesan: ఓటీటీకి.. వచ్చేసిన అదిరిపోయే రోడ్ థ్రిల్లర్! ఎందులో అంటే
ABN, Publish Date - Aug 22 , 2025 | 11:58 AM
ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు ఫహాద్ ఫాజిల్.
మలయాళ స్టార్ హీరో, పుష్పలో విలన్ భన్వర్ సింగ్ శేఖావత్‌గా గుర్తింపు పొందిన ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన మరో వినూత్న చిత్రం మారీసన్ (Mareesan).స్టార్ కమెడియన్ వడివేలు (Vadivelu) కీలక పాత్రలో కనిపించారు. సుదీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ–థ్రిల్లర్ జూలై 25న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది. ఇప్పుడు నెల తిరగకముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదిలాఉంటే చాలా విరామం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ (Super Good Films) బ్యానర్ పై ఆర్.బీ. చౌదరీ (RB Choudary) ఈ సినిమాను నిర్మించడం విశేషం.
కథ విషయానికి వస్తే.. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు దయాలన్ అనే దొంగ. ఓ రోజు వయసు మళ్లిన వేలాయిధం అనే వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి వెళ్లడానికి సిద్దమై రోడ్డుపై నిల్చుంటాడు. అతనికి అల్జీమర్స్ అనే వ్యాధి ఉండడంతో ఏది ఎక్కువ సేపు గుర్తు ఉంచుకోలేడు. సరిగ్గా అదే సమయంలో వేలాయుధం వద్ద భారీగా డబ్బు ఉందని సంగతి తెలుసుకున్న దయాలన్ అతనికి మాయ మాటలు చెప్పి తన బండిపై తీసుకెళతానని నమ్మించి బండిపై ఆ ఊరికి ప్రయాణం అవుతారు. ఆ ప్రయాణంలో వారిరువురి మధ్య ఎదురయ్యే మలుపులు, సంఘటనలే కథకు అయువు పట్టులా ఉంటుంది. చివరకు దయాలన్ ఆ డబ్బు తస్కరించగలిగాడా లేదా, వేలాయిధం ఎలాంటి టర్న్ తీసుకున్నాడు అనే ఆసక్తికరమైన థ్రిల్టింగ్ అంశాలతో సినిమా సాగుతుంది.
గతంలో ఈ ఇద్దరు మామన్నన్ అనే తమిళ సినిమాలో కలిసి కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అక్కడ ఫహాద్ విలన్‌గా, వడివేలు హీరో స్టాలిన్ తండ్రిగా నటించారు. ఆ సినిమా లోని వారి సన్నివేశాలు మంచి ప్రశంసలు పొందాయి. ఇప్పుడు మారీసన్ సినిమాతో మళ్లీ ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద కనిపించడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడి చిత్ర విజయానికి దోహదం చేశాయి. ఇప్పుడు ఈ మూవీ ఈ రోజు (ఆగస్టు 22) నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix OTT) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర అన్ని ప్రధాన భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారికి ఈ చిత్రం బెస్ట్ ఛాయిస్.