Bhairavam OTT: ఆలస్యంగా.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు మల్టీస్టారర్
ABN, Publish Date - Jul 18 , 2025 | 08:00 AM
ఎన్నో అంచనాల మధ్య మే నెలాఖరున థియేటర్లలోకి వచ్చిన మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం ఆలస్యంగా స్ట్రీమింగ్‌కు వచ్చింది.
ఎన్నో అంచనాల మధ్య మే నెలాఖరున థియేటర్లలోకి వచ్చి మిక్స్‌డ్ టాక్‌తో ఫర్వాలేదనిపించిన మల్టీ స్టారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం భైరవం. విజయం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలసి చేసిన ఈ సినిమా టాలీవుడ్‌లో బాగానే హైప్ క్రియేట్ చేసింది. తమిళంలో వచ్చిన గురుడన్ సినిమాను రీమేక్ చేసి తెలుగులో భైరవంగా తీసుకువచ్చారు. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది నాయికలు. గతంలో ‘నాంది’, ‘ఉగ్రం’ సినిమాల తర్వాత విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన సినిమా ఇదే.
కథ.. ఏంటంటే
శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) అనాథ. వరద (నారా రోహిత్) లారీ ట్రాన్స్‌పోర్ట్ అధిపతి. గజపతి వర్మ (మంచు మనోజ్) జమీందారు. ఈ ముగ్గురు దేవీపురంలో నివసిస్తుంటారు. శీను ఇద్దరికి నమ్మిన బంటుగా వారి కుటుంబంలో ఒకరిగా ఉంటాడు. గ్రామ దేవత వారాహీ అమ్మవారి గుడికి గజపతి వర్మ నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) ధర్మకర్త. అయితే ఆ దేవాలయానికి చెందిన భూములపై ఓ మంత్రి (శరత్ లోహితస్య) కన్నేసి నాగరత్నమ్మను చంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో శ్రీను దేవాలయ ధర్మకర్త అవుతాడు. గుడికి చెందిన 75 ఎకరాల భూమి దక్కించుకోవాలంటే శ్రీనుని దాటుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మంత్రి ఎలాంటి పన్నాగాలు పన్నాడు? వరద, గజపతి మధ్య డబ్బు కోసం ఎలాంటి చిచ్చు పెట్టింది? చివరికి ఎవరు గెలిచారు? అన్నదే కథ.
సినిమాలో వరద, గజపతిల మధ్య స్నేహం, ఆపై వైరం మధ్యలో శ్రీను పడే ఇబ్బందులు, ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే యాక్షన్ సీన్స్, బెల్లకొండ శ్రీను ఉగ్రరూపం దాల్చి చేసిన తాండవం ఆసక్తిగా ఉంటాయి. తమిళంలో రా అండ్ రస్టిక్ గా ఉన్న సినిమాను తెలుగులో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మలిచారు. హీరోల క్యారెక్టర్స్ ఎలివేషన్స్ బాగా ప్లాన్ చేశాడు. ముగ్గురు హీరోల్లో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అనే భావన రాకుండా సచూసుకున్నారు. ఇప్పుడీ సినిమా జీ5 తెలుగు (ZEE5 Telugu) ఓటీటీలో తెలుగుతో పాటు హిందీ బాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటి వరకు థియేటర్‌లో చూడని వారు, ఆ ముగ్గురి హీరోల ఫ్యాన్స్ ఈ సినిమాను ఇప్పుడు ఇంటి పట్టునే చూసి ఎంజాయ్ చేయవచ్చు.