Sitaare Zameen Par: ఓటీటీ కాదు.. యూట్యూబ్‌లో అమీర్ ఖాన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్! కానీ
ABN , Publish Date - Jul 30 , 2025 | 08:35 AM
మిస్టర్ ఫర్‌పెక్ట్ అమీర్‌ఖాన్ ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు.
గత నెల జూన్ 20న థియేటర్లో విడుదలై ఇప్పటికీ మంచి ప్రేక్షకాధరణతో నడుస్తోన్న బాలీవుడ్ చిత్రం సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par). లాల్ సింగ్ చడ్డా వంటి డిజిస్టర్ తర్వాత మిస్టర్ ఫర్‌పెక్ట్ అమీర్‌ఖాన్ (Aamir Khan) కాస్త సమయం తీసుకుని ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించడమే గాక అపర్ణా పురోహిత్, రవి భాగ్చండ్కా, బి.శ్రీనివాసరావుతో కలసి నిర్మించారు. జెనీలియా ఓ కీలక పాత్ర చేసింది. 2018లో స్పానిష్‌లో వచ్చిన స్పోర్ట్స్ కామెడీ చిత్రం'ఛాంపియన్స్ ఆధారంగా చేసుకుని హిందీలో ఈ సినిమాను తెరకెక్కించగా ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించాడు. సుమారు రూ.70 నుంచి 90 కోట్ల బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపంచింది. దాదాపు రూ.300 కోట్లు రాబట్టింది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.
కథ విషయానికి వస్తే.. బాస్కెట్ బాల్ కోచ్ గుల్షన్ అరోరాకు కోపం ఎక్కువ. మాట పడడు. అప్పటిక్పపుడే కోపంతో ఎదుటి వారెంతటివారైనా గొడవకు దిగుతుంటాడు లేకుంటే చేయి చేసకుంటుంటాడు. అయితే.. ఓ సారి తన సీనియర్‌ను కొట్టడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. ఈ క్రమంలో మద్యం తాగి మత్తులో తన బండితో డ్యూటీలో ఉన్న పోలీస్ బండినే ఢీ కొంటాడు. ఆపై కోర్టు వరకు ఇష్యూ వెళ్లడంతో మూడు నెలలు 'స్పెషల్లీ ఏబుల్డ్' అడల్ట్స్ కు బాస్కెట్ బాల్ నేర్పించమని జడ్జి శిక్షగా విధిస్తారు. దాంతో ఇక ఏం చేయలేక గుల్షన్ అయిష్టంగానే ట్రైనింగ్ ఇవ్వడానికి వెళతాడు. తమపై జాలి చూపిస్తే సహించని ఆ ప్రత్యేక కోవకు చెందిన వాళ్ళతో హీరో ఎహీరో తన భార్యకు ఎందుకు దూరంగా ఉన్నాడు, చివరకు ఏమైందనే పాయింట్‌తో సినిమా కామెడీగా సాగిపోతూ ఓ ఎమోషనల్ నోట్‌తో ముగుస్తుంది.
అయితే.. 18 ఏండ్ల క్రితం వచ్చిన తారే జమీన్ పర్ సినిమాలానే ఇదీ ఆకట్టుకుంటుందని అంచనాలు పెట్టుకుని ఈ చిత్రాన్ని చూస్తే నిరుత్సాహా పడక తప్పదు. గతంలో ఇలాంటి తరహా సినిమాలు చూసి ఉండడం, ముందు ఏం జరగబోతుందో తెలిసి పోవడం ఇత్యాది కారణాల వళ్ల మనకు ఎక్కడా ఈ మూవీ ఎక్కినట్లు అనిపంచదు. కానీ నిజమైన స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్లతో సినిమాను తీసిన విధానం, రియల్ నటుల లాగా వారి నటన ఆకట్టుకుంటుంది. కాకపోతే ఫ్రీ క్లైమాక్స్‌లో హీరో తల్లి పాత్ర కాస్త అసహానం తెప్పిస్తుంది. అది మినహా సినిమా ఫరవాలేదనిపస్తుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో రిలీజ్ చేయకుండా యూట్యూబ్ (YouTube channel )లో రిలీజ్ చేస్తూ కొత్త సాంప్రదాయానికి నడుం బిగించాడు అమీర్ ఖాన్. అగష్టు 1 నుంచి అమీర్ ఖాన్ టాకీస్ (Aamir Khan Talkies) అనే యూట్యూబ్ ఛానల్‌లో హిందితో తో పాటుగా తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవనుంది. అయితే యూట్యూబ్‌లో వచ్చింది కదా ఫ్రీ గా చూడొచ్చనుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రేక్షకులు ఎవరైనా ఈ సినిమాను చూడాలనుకుంటే రూ. 100 చెల్లించి చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓ పది, పదిహేను రోజుల్లో ఓటీటీల్లోకి తీసుకు రానున్నారు.