Venkatesh: శతదినోత్సవం చూసిన 'జయం మనదేరా'
ABN, Publish Date - Oct 07 , 2025 | 04:06 PM
విక్టరీ వెంకటేశ్ హీరోగా రూపొందిన 'జయం మనదేరా' చిత్రం పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. సౌందర్య నాయికగా రూపొందిన ఈ సినిమా అప్పట్లో విజయఢంకా మోగించింది. యన్.శంకర్ డైరెక్షన్ లో 'జయం మనదేరా' ఏ తీరున మురిపించిందో గుర్తు చేసుకుందాం.
'జయం మనదేరా' సినిమాకు ముందు 'ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, కలిసుందాం రా' వంటి చిత్రాలతో ఘనవిజయాలు చూశారు వెంకటేశ్ (Venkatesh). ఆ 'రా' సెంటిమెంట్ తోనే 'జయం మనదేరా' అన్న టైటిల్ తో జనం ముందుకు వచ్చారు. తొలి చిత్రం 'ఎన్ కౌంటర్'తోనే దర్శకునిగా మంచి మార్కులు సంపాదించిన శంకర్ 'జయం మనదేరా'కు డైరెక్టర్. శంకర్ చిత్రాల్లో అట్టడుగు వర్గాల వారి పక్షాన నిలచి పోరాడే కథానాయకుల పాత్రలే ప్రధానంగా ఉండేవి. అదే తీరున 'జయం మనదేరా' కథ కూడా రూపొందింది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన మరింత వన్నె తెచ్చింది. వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas) బాణీల్లో రూపొందిన పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. 2000 సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో 'కలిసుందాం రా'తో బిగ్ హిట్ పట్టేసిన వెంకటేశ్ ఆ యేడాది అక్టోబర్ 7న విడుదలైన 'జయం మనదేరా'తోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
'జయం మనదేరా' చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.రామానాయుడు సమర్పణలో డి.సురేశ్ బాబు నిర్మించారు. అప్పటికే వెంకటేశ్ తో 'ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం, రాజా' వంటి సూపర్ హిట్స్ చూశారు సౌందర్య. వెంకటేశ్- సౌందర్య (Soundarya) జంట 'జయం మనదేరా'లోనూ ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ సినిమాతో వెంకటేశ్, సౌందర్య పెయిర్ మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకోవడం విశేషం.
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రాలకు అప్పట్లో విశేషాదరణ ఉండేది. 'జయం మనదేరా' కూడా అదే తీరున సాగింది. ఇందులో తండ్రీకొడుకులుగా వెంకటేశ్ ద్విపాత్రాభినయం చేయగా, తండ్రికి జోడీగా భానుప్రియ నటించారు. ఈ సినిమాను పరిశీలించి చూస్తే 'బాహుబలి' మొదటి భాగం కథ ఇలాగే ఉంటుంది. యాభై రోజుల దాకా రికార్డ్ స్థాయిలో ప్రదర్శితమైన 'జయం మనదేరా' తరువాత చప్పబడిపోయింది. ఏది ఏమైనా ఆ యేడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచిందీ చిత్రం. ఈ సినిమాతో జయప్రకాశ్ రెడ్డి బెస్ట్ విలన్ గానూ, ఝాన్సీ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గానూ నంది అవార్డులు అందుకున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో అర్జున్ హీరోగా 'మణికంఠ' పేరుతో రీమేక్ చేశారు.
Also Read: Mass Jathara: నాగవంశీ కి 'బాహుబలి' గండం
Also Read: Srikantha Addala: కిరణ్ అబ్బవరం మూవీ డైరెక్టర్ మారిపోయాడా...