SV Rangarao: మరపురాని భక్త ప్రహ్లాద
ABN, Publish Date - Jul 11 , 2025 | 05:09 PM
భక్త ప్రహ్లాద పేరుతో తెలుగులో పలు చిత్రాలు వచ్చాయి. అయితే ఎస్వీ రంగారావు, అంజలీదేవి, రోజా రమణి ప్రధాన పాత్రలు పోషించిన 'భక్త ప్రహ్లాద'కు ఓ ప్రత్యేకత ఉంది.
ఇక్కడ మనం చూస్తున్న ఛాయాచిత్రం 1967 జనవరి 12న విడుదలైన ఏవీయమ్ వారి రంగుల చిత్రం 'భక్త ప్రహ్లాద' (Bhakta Prahlada) లోనిది. ఇందులో నారదునిగా దర్శనమిస్తున్నవారు గానగంధర్వ మంగళంపల్లి బాలమురళీకృష్ణ (Mangalampalli BalaMurali Krishna), హిరణ్య కశ్యప పాత్రలో కనిపిస్తున్నది విశ్వనటచక్రవర్తి యస్.వి.రంగారావు (SV Ranga Rao), లీలావతిగా అంజలీదేవి (Anjali Devi), ఆమె కౌగిలించుకున్న ప్రహ్లాదునిగా రోజారమణి (Roja Ramani) ఉన్నారు. ఈ ఒక్క ఫొటో మనల్ని తెలుగు సినిమా టాకీ ఆరంభం దాకా తీసుకుపోతుంది. ఎందుకంటే మన తెలుగువారి తొలి శబ్దచిత్రంగా 'భక్త ప్రహ్లాద' నిలచింది. కాబట్టి అందాకా వెళ్ళాల్సిందే. ఆ పై 'భక్త ప్రహ్లాద' కథాంశం మరికొన్ని సార్లు తెరకెక్కి అలరించింది.
'భక్త ప్రహ్లాద' టైటిల్ తో 1932 తరువాత పదేళ్ళకు 1942లో మరో 'భక్త ప్రహ్లాద' వెలుగు చూసింది. మొదటి 'భక్త ప్రహ్లాద'లో మునిపల్లె సుబ్బయ్య హిరణ్యకశ్యప పాత్రలో కనిపించగా, లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ఇక ప్రహ్లాద పాత్రలో సింధూరి కృష్ణారావు అభినయించారు. 1942లో జనం ముందు నిలచిన 'భక్త ప్రహ్లాద'ను చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో శోభనాచల పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ఆ యేడాది జనవరి 30న జనం ముందు నిలచింది. ఇందులో హిరణ్య కశ్యపునిగా వేమూరి గగ్గయ్య, ప్రహ్లాదునిగా నారాయణ రావు, లీలావతిగా రాజేశ్వరి నటించారు. అంతకు ముందు వచ్చిన 'భక్త ప్రహ్లాద'తో పోలిస్తే ఇందులో కొంత టెక్నాలజీ మెరుగ్గా కనిపించింది. అంతకు మించి నాటకఫక్కీ నుండి పక్క అడుగు వేసిన జాడలు లేవు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలోనే పాతికేళ్ళకు ఏవీయమ్ సంస్థ రంగుల్లో 'భక్త ప్రహ్లాద'ను తెరకెక్కించింది. ఈ సారి అన్నివర్గాల వారిని ఆకట్టుకొనే ప్రయత్నంగా చిత్రపు నారాయణమూర్తి కూడా పలు కమర్షియల్ హంగులు అద్దారు. ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం పెద్ద ఆకర్షణ. ఇందులోని పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. ఇక రంగుల్లో రూపొందిన చిత్రం కావడంతో అందునా పౌరాణికం అయినందువల్ల రంగురంగుల దుస్తులు కనువిందు చేశాయి. నృత్యగీతాల్లో నర్తకీమణులుగా అలరించిన ఎల్. విజయలక్ష్మి, గీతాంజలి, విజయలలిత, వెన్నిరాడై నిర్మల ధరించిన దుస్తులు అప్పట్లో భలేగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఘనవిజయం సాధించి అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు చూసింది.
ఇందులో హిరణ్యకశ్యప పాత్ర పోషించిన యస్వీఆర్ ముందు అదురూ బెదురూ లేకుండా నటించిన బేబీ రోజారమణి నటన ఎంతగానో ఆకట్టుకుంది. 'భక్త ప్రహ్లాద' చిత్రాన్ని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమా చూసిన రాధాకృష్ణన్, ప్రహ్లాద పాత్ర పోషించిన రోజారమణిని ప్రత్యేకంగా అభినందించడం విశేషం!
'భక్త ప్రహ్లాద'లో హిరణ్య కశ్యపునిగా నటించిన యస్వీఆర్ అంతకు ముందు 1958లో విడుదలైన 'చెంచులక్ష్మి'లోనూ అదే పాత్రను పోషించి మెప్పించారు. 'చెంచులక్ష్మి'లో లీలావతిగా పుష్పవల్లి నటించగా, ఆమె సొంత కొడుకు బాబ్జీ ప్రహ్లాద పాత్రలో మెప్పించారు. ఆ చిత్రానికి కూడా సాలూరు రాజేశ్వరరావు సంగీతం పెద్ద ఆకర్షణ. ఆ సినిమా ద్వారానే గాయనిగా పి.సుశీల విశేషమైన ప్రాచుర్యం సంపాదించారు. ఇందులోని పాటలు ఈ నాటికీ పలు దేవాలయాల్లో సుప్రభాత వేళ ప్రతిధ్వనిస్తూనే ఉండడం విశేషం! 'చెంచులక్ష్మి', రంగుల 'భక్త ప్రహ్లాద' చిత్రాల్లో సీనియర్ సముద్రాల రాసిన భక్తి గీతాలే విశేషాదరణ చూరగొన్నాయి. 1932 నాటి 'భక్త ప్రహ్లాద' చందాల కేశవదాసు సాహిత్యంతో సాగింది. ఇక 'భక్త ప్రహ్లాద' గాథతో తెరకెక్కిన అన్ని చిత్రాలలోనూ పోతన పద్యాలనే వినియోగించుకున్నారు.