NTR - Savitri: సావిత్రి అసలైన హీరో యన్టీఆరే...
ABN, Publish Date - Jul 05 , 2025 | 09:49 PM
మహానటి అన్న మాటను ఇంటిపేరుగా మార్చుకున్న ఏకైక తెలుగునటి సావిత్రి. ఆ తరం ప్రేక్షకులే కాదు నవతరం వీక్షకులు సైతం సావిత్రి అభినయాన్ని ఒక్కసారి చూశారంటే ఆమెను 'మహానటి' అనకుండా ఉండలేరు. అంత పేరు సంపాదించిన సావిత్రికి హిట్ పెయిర్ ఎవరు అన్న సంశయం అప్పట్లో చాలామందికి కలిగేది. తమిళనాట ఆమె భర్త జెమినీగణేశన్ ఆమె హిట్ పెయిర్ అని తేల్చేశారు. మరి తెలుగులో ఎవరు...
తెలుగునాట సావిత్రి (Savitri) కి సరైన జోడీ అంటే యన్టీఆర్ (NTR) అని కొందరు, కాదు ఏయన్నార్ (ANR) అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఆమె నటజీవితంలో జెమినీ గణేశన్, ఏయన్నార్ కంటే యన్టీఆర్ తోనే అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వారిద్దరూ కలసి సాంఘిక, జానపద, పౌరాణికాల్లో పలు విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు. అనేక చిత్రాల్లో ప్రేయసీప్రియులుగా నటించారు. అలాగే అన్నాచెల్లెళ్ళుగా మెప్పించారు. వదిన- మరిదిగా అలరించారు. అక్క-తమ్మునిగా ఆకట్టుకున్నారు. అంతెందుకు 'చంద్రహారం'లో యన్టీఆర్ హీరో కాగా, సావిత్రి వ్యాంప్ గా నటించారు. ఇక 'విచిత్ర కుటుంబం'లో అయితే యన్టీఆర్ లాయర్, అంతగా చదువుకోని ఆయన భార్యగా సావిత్రి అలరించారు. 'నిండుదంపతులు'లో అయితే క్వైట్ కాంట్రాస్ట్ యన్టీఆర్ కు చదువురాదు, సావిత్రి అందులో లాయర్ గా నటించారు. ఇలా ఇన్ని విధాలుగా అలరించిన జంట మరొకటి కానరాదు. అంతేకాదు యన్టీఆర్ తో సావిత్రి పౌరాణిక, జానపద, సాంఘికాలో నటించి విజయం సాధించారు. ఆ ఫీట్ మరెవరి చెంతనా ఆమెకు సాధ్యం కాలేదు.
యన్టీఆర్ - సావిత్రి అనుబంధం విషయానికి వస్తే - సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం 1950లో వచ్చిన 'సంసారం'. అందులో సావిత్రికి ఏకంగా ఏయన్నార్ సరసన నాయికగా నటించే చాన్స్ దక్కింది. కానీ, ఆమె కెమెరా ముందు తగని సిగ్గు ప్రదర్శించడంతో ఆ అవకాశం చేజారింది. అందులోనే ఓ పాటలో హీరోయిన్ ఫ్రెండ్స్ లో ఒకరిగా కొన్ని క్షణాల పాటు తెరపై కనిపించింది. ఈ చిత్రంలో ప్రధాన నాయకుడు యన్టీఆర్. ఇక యన్టీఆర్ ను జానపద కథానాయకునిగా నిలిపిన 'పాతాళభైరవి'లో ఓ బిట్ సాంగ్ లో సావిత్రి నర్తించారు. ఆ సినిమా విజయా సంస్థను నిలిపింది. ఈ సినిమా తరువాత యన్టీఆర్ తో విజయా సంస్థ నిర్మించిన సాంఘిక చిత్రం 'పెళ్ళిచేసిచూడు' లో జోగారావుకు జోడీగా నటించారు సావిత్రి. అందులో కొన్ని సన్నివేశాల్లో సావిత్రి కనబరచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక సావిత్రి కెరీర్ లో తొలిసారి ప్రధాన నాయికగా నటించిన చిత్రం 'పల్లెటూరు'. ఇందులో యన్టీఆర్ ఆమెకు జోడీగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ పై 'ప్రియురాలు, శాంతి' వంటి సినిమాల్లో నటించిన సావిత్రికి 'దేవదాసు' లోని పార్వతి పాత్ర మంచి పేరు సంపాదించి పెట్టింది. అసలు 'దేవదాసు'లో ఆమెకు పార్వతి పాత్ర దక్కడానికి 'పెళ్ళిచేసిచూడు'లో ఆమె పోషించిన పాత్రనే కారణమని అందరికీ తెలుసు.
కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయంచేస్తూ విజయా సంస్థ నిర్మించిన 'చంద్రహారం'లో యన్టీఆర్ కథానాయకుడు. అందులో హీరోపై మనసు పడి, అతనిని తన సొంతం చేసుకోవాలని, నాయికకు పలుకష్టాలు కల్పించే చంచలగా నటించారు సావిత్రి. ఆమె కెరీర్ లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన చిత్రమది. యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన 'పరివర్తన' లోనూ ఆమె యన్టీఆర్ సరసన నటించారు. యన్టీఆర్ నెగటివ్ షేడ్స్ తో కనిపించిన తొలి సినిమా కూడా 'పరివర్తన' కావడం విశేషం! ఇక 1955లో విడుదలైన 'మిస్సమ్మ'లో యన్టీఆర్ కు నాయికగా నటించి, స్టార్ డమ్ నూ సొంతం చేసుకున్నారు. అలా యన్టీఆర్ చిత్రాలతోనే సావిత్రి ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు అగ్ర కథానాయిక స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు చెప్పండి సావిత్రికి అసలైన హిట్ పెయిర్ ఎవరో?
1960లో వచ్చిన 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం' థియేటర్లను దేవాలయాలుగా మార్చిందని ఈ నాటికీ ఆ నాటి అభిమానులు చెబుతూనే ఉంటారు. శ్రీనివాసుని పాత్రలో యన్టీఆర్, పద్మావతిగా సావిత్రి అభినయించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. మరో విశేషమేమిటంటే, ఆ సినిమా షూటింగ్ సమయంలో సావిత్రి గర్భవతి. అంతకు ముందు రూపొందిన 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం'లో దర్శకుడు పి.పుల్లయ్య భార్య శాంతకుమారినే పద్మావతిగా నటించారు. ఆ సమయంలో ఆమె కూడా గర్భవతి అట! ఇలా ఒకే పాత్రను పోషించిన శాంతకుమారి, సావిత్రి నిజజీవిత విషయాలూ కాకతాళీయంగా ఒకేలా ఉండడం విశేషం!
యన్టీఆర్, సావిత్రి ఇద్దరూ అభినయంలో సరైనజోడు అనీ ప్రతీతి. ముఖ్యంగా వారి భారీ విగ్రహాలు కూడా జంటగా నటిస్తే చూడముచ్చటగా ఉంటాయని సమకాలీన నటీనటులే అనేవారు. అయితే యన్టీఆర్, సావిత్రి నటిస్తే ఆ పాత్రలే కనిపిస్తాయి కానీ, వారు కనపడరు. వారిద్దరి జోడీని అభిమానించేవారు సైతం ఆ పాత్రల వావివరుసలు అంతగా పట్టించుకొనేవారు కారు. 1962లో విడుదలైన 'రక్తసంబంధం' లో అన్నాచెల్లెళ్ళుగా నటించారు రామారావు, సావిత్రి. ఆ చిత్రానికి ముందు వచ్చిన 'గుండమ్మకథ'లో వారిద్దరూ భార్యాభర్తలుగా అభినయించి అలరించారు. ఇక తరువాత వచ్చిన 'ఆత్మబంధువు'లోనూ యన్టీఆర్ నాయికగా సావిత్రి కనిపించారు. ఈ మూడు చిత్రాలూ రజతోత్సవం జరుపుకోవడం విశేషం. అంటే యన్టీఆర్, సావిత్రి తెరపై తమ పాత్రలుగా కనిపించారే తప్ప, హిట్ పెయిర్ అన్న చట్రంలో ఇరుక్కుపోలేదు. 1965లో కేవలం వారం గ్యాప్ లో యన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన 'నాదీ ఆడజన్మే', 'పాండవవనవాసము' విడుదలయ్యాయి. రెండూ సిల్వర్ జూబ్లీ హిట్స్ కావడం గమనార్హం!
యన్టీఆర్ సొంత చిత్రాలు 'ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం' చిత్రాల్లో ఆయనకు వదినగా నటించి అలరించారు సావిత్రి. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన 'వరకట్నం'లో ఆయనకు అక్క వరుస పాత్రలో మెప్పించారామె. అదే యేడాది యన్టీఆర్ 'విచిత్ర కుటుంబం'లో ఆయన భార్యగానే నటించి ఆకట్టుకున్నారామె.
ఇక 1965 సంవత్సరం దాటిన తరువాత నుంచీ సావిత్రి బాగా బరువు పెరిగారు. దాంతో ఆమెతో అంతకు ముందు పలు చిత్రాలలో నటించి, విజయం సాధించిన నాయకులు సైతం జంటగా నటించడానికి అంతగా ఆసక్తి చూపించేవారు కారు. ఆ సమయంలోనూ యన్టీఆర్ తో పలు చిత్రాలలో నాయికగా నటించారు సావిత్రి. ఇక సావిత్రి దర్శకురాలిగా రూపొందిన చిత్రాలలో మొదటిది 'చిన్నారి పాపలు' (1968) అంతగా అలరించలేకపోయింది. అయినా ఇదే చిత్రాన్ని తన భర్త జెమినీ గణేశన్, వాణిశ్రీ, జానకి ప్రధాన పాత్రలుగా తమిళంలో 'కుళందై ఉల్లమ్' (1969)గా రూపొందించారు. అదీ అంతే సంగతులు అన్నది. తరువాత రామకృష్ణ, చలం ప్రధాన పాత్రలుగా 'చిరంజీవి' (1969) అనే సినిమాకు కూడా సావిత్రి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా ఆకట్టుకోలేక పోయింది. ఆ పై 'మాతృదేవత' కథతో సినిమా తీయాలని ఆశించారు సావిత్రి. ఆ చిత్ర కథను ముందుగా ఏయన్నార్ కు వినిపించగా, ఆ కథపై ఆయనకు అంతగా నమ్మకం కుదరలేదు. దాంతో యన్టీఆర్ దగ్గరకు వెళ్లిన సావిత్రికి మరో మాట లేకుండా ఆయన కాల్ షీట్స్ సర్దుబాటు చేశారు. ఆ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. సావిత్రి డైరెక్షన్ లో వంద రోజులు చూసిన ఏకైక సినిమా 'మాతృదేవత' కావడం గమనార్హం! సావిత్రి తెలుగులో నటించి, అఖండ విజయం సాధించిన 'మూగమనసులు'ను తమిళంలో స్వీయ దర్శకత్వంలో శివాజీ గణేశన్ హీరోగా 'ప్రాప్తం' పేరుతో రూపొందిస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఎన్నో రోజులకు విడుదలయింది. యన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన చివరి చిత్రం 'నిండుదంపతులు'. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలోనే సావిత్రి చివరి సారి నాయికగా నటించారు. ఈ సినిమా తరువాత 'ప్రాప్తం' వచ్చినా అది అంతకు ముందే ఎన్నో రోజులుగా షూటింగ్ జరుపుకొని విడుదలయింది. యన్టీఆర్ 'దేశోద్ధారకులు', 'తీర్పు' చిత్రాలలో కేరెక్టర్ రోల్స్ లో నటించారు సావిత్రి. ఆ తరువాత నుంచీ గుణచిత్ర పాత్రలతోనే సాగారామె. అలా సావిత్రి నటజీవితంలో అనేక కీలక మలుపులన్నీ యన్టీఆర్ సినిమాలతోనే ముడిపడి ఉంది. ముఖ్యంగా ఆమె మెయిన్ హీరోయిన్ గా నటించిన తొలి, చివరి చిత్రాలు యన్టీఆర్ తోనే కావడం మరింత విశేషం!