Jayanthi Janaki Vanisree: ఆ ముగ్గురు... నటీమణులు...

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:24 PM

షావుకారు జానకి, జయంతి, వాణిశ్రీ... ఈ ముగ్గురు నటీమణులు నటరత్న యన్టీఆర్ సినిమాలతోనే పరిచయం కావడం విశేషం!

NTR Heroines

ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురూ ఎవరికి వారు తమదైన బాణీ పలికిస్తూ చిత్రసీమలో అలరించిన వారే! ఎడమ నుండి తొలుత జయంతి (Jayanthi), వాణిశ్రీ (Vanisree), షావుకారు జానకి (Shavukaru Janaki) ఓ వేడుకలో ఇలా కెమెరా కంటికి చిక్కారు. ముగ్గురూ తెలుగువారే! అయితే షావుకారు జానకి మాతృభాష తెలుగులో కన్నా మిన్నగా తమిళభాషలో నాయికగా అలరించారు. తరువాత కేరెక్టర్ రోల్స్ లో మెప్పిస్తూ సాగారు. ఇక వాణిశ్రీ బిట్ రోల్స్ లో కనిపించి, హాస్యనటిగా మెప్పించి, ఆ పై నాయికగా మురిపించారు. వాణిశ్రీ చూసిన స్టార్ డమ్ తెలుగునాట మరో నాయిక చూడలేదంటే అతిశయోక్తి కాదు. జయంతి తెలుగులో కన్నా మిన్నగా కన్నడ చిత్రసీమలో రాణించారు. కన్నడ నాట ఓ సమయంలో జయంతి రాజ్యమేలారు. మద్రాసులో దక్షిణాది నాలుగు భాషల సినిమారంగాలు కొలువైన సమయంలో తరచూ అందరూ కలుసుకొనేవారు. అలా ఈ ముగ్గురూ ఓ వేడుకలో కనిపించిన దృశ్యమిది.


మరో విశేషమేంటంటే- ఈ ముగ్గురు నటీమణులు నటరత్న యన్టీఆర్ (NTR) సినిమాలతోనే పరిచయం కావడం విశేషం! యన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'షావుకారు'లో జానకి కథానాయిక. ఆ సినిమాతోనే ఆమె షావుకారు జానకిగా సుప్రసిద్ధులయ్యారు. ఇక కమలకుమారిగా ఉన్న జయంతి యన్టీఆర్ 'జగదేకవీరుని కథ'తోనే మంచి గుర్తింపు సంపాదించారు. యన్టీఆర్ 'భీష్మ' సినిమాలోనే వాణిశ్రీ తొలిసారి తెరపై తళుక్కుమన్నారు. తరువాతి రోజుల్లో వీరందరూ ఎంతమంది స్టార్ హీరోస్ తో నటించినా తమ గురువుగా యన్టీఆర్ నే చెప్పుకొనేవారు.


ఇక ముగ్గురు ముక్కుసూటి మనుషులే ! ఆ లక్షణం వీరికి ఓ ఆభరణంగా నిలచింది. వీరిలో ప్రస్తుతం జయంతి లేరు. ఇక జానకి 90 ఏళ్ళకు పై వయసుతో ఉన్నారు. వాణిశ్రీ కూడా సినిమారంగానికి దూరంగానే ఉంటున్నారు. ఏది ఏమైనా ముగ్గురు నటీమణులు తమదైన బాణీ పలికించి తెలుగువారి మదిలో సుస్థిరస్థానం సంపాదించిన వారే!

Also Read: Idly Kadai: తెలుగులో 'ఇడ్లీ కొట్టు'గా ధనుష్ సినిమా

Also Read: Allu Kanakaratnamma: అరవింద్ కు ప్రధాని లేఖ...

Updated Date - Sep 04 , 2025 | 01:24 PM