Tharun: పాతికేళ్ళ 'నువ్వే కావాలి'
ABN , Publish Date - Oct 13 , 2025 | 05:04 PM
చిన్న సినిమాగా వచ్చి బిగ్ మూవీస్ కే చెక్ పెట్టి బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోయిన చిత్రం 'నువ్వే కావాలి'. పాతికేళ్ళ క్రితం 'నువ్వే కావాలి' గ్రాండ్ సక్సెస్ ఎందరో రాతలను మార్చేసింది. ఆ విశేషాలను గుర్తు చేసుకుందాం.
'నువ్వే కావాలి' (Nuvve Kavali) - ఈ సినిమా పేరు తలచుకోగానే ఈ నాటికీ ఎందరికో మదిలో ప్రియరాగాలు పలుకుతూ ఉంటాయి. పాతికేళ్ళ క్రితం అంతలా యువతను కట్టిపడేసింది 'నువ్వే కావాలి' సినిమా. 2000 అక్టోబర్ 13వ తేదీన విడుదలైన 'నువ్వే కావాలి' మొదట్లో కొన్ని ప్రింట్స్ తోనే విడుదలయింది. ఓ వారం తరువాత మౌత్ టాక్ తో విశేషాదరణ చూరగొంటు అనేక కేంద్రాలలో 'నువ్వే కావాలి'ని రిలీజ్ చేయగా, జనం బ్రహ్మరథం పట్టారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీ రావు (Ramoji Rao) నిర్మించిన ఈ చిత్రానికి స్రవంతి రవికిశోర్ (Sravanthi Ravikishore) సహ నిర్మాతగా వ్యవహరించారు.. ఈ సినిమాకు కె. విజయభాస్కర్ (K Vijayabhaskar) దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ మాటలు పలికించారు. మళయాళంలో సూపర్ హిట్టయిన 'నిరమ్' (Neeram) ఆధారంగా 'నువ్వే కావాలి' రూపొందింది. ఒరిజినల్ లో కన్నా మిన్నగా తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ద్వారా ఓ నాటి బాలనటుడు తరుణ్ (Tarun) హీరోగా పరిచయం కావడం విశేషం. ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన రిచా పల్లోడ్ (Richa Pallod) కూడా అంతకు ముందు కొన్ని హిందీ చిత్రాల్లో బాలనటిగా అలరించింది.
'నువ్వే కావాలి' కథ విషయానికి వస్తే - చిన్ననాటి నుంచీ ఎంతో అన్యోన్యంగా ఉండే ఓ అమ్మాయి, ఓ అబ్బాయి తమ మధ్య కేవలం స్నేహం ఉందనుకుంటారు. అందులోనే ప్రేమ ఉందని తెలియక ముందే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరుగుతుంది. చివరకు హీరో, హీరోయిన్ ఎలా ఒకటయ్యారన్నదే కథ. ఈ సినిమా కథాంశం సాధారణంగానే అనిపించినా, అందులో యూత్ ను ఆకట్టుకొనే అంశాలను మేళవించిన తీరు ఆకట్టుకుంది. ఈ చిత్రానికి కోటి సంగీతం సమకూర్చగా, భువనచంద్ర, సీతారామశాస్త్రి పాటలు పలికించారు. 'నువ్వే కావాలి' ఆడియో అప్పట్లో విశేషాదరణ పొందింది.
'నువ్వే కావాలి' సినిమా పెట్టుబడి కంటే ఇరవై రెట్లు లాభాలు చూసింది. ఈ చిత్రానికి ముందు వచ్చిన బిగ్ స్టార్స్ రికార్డ్ బ్రేక్ మూవీస్ ను సైతం 'నువ్వే కావాలి' వసూళ్ళ పరంగా అధిగమించడం విశేషం. ఈ చిత్రం 30కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. 15 కు పైగా సెంటర్స్ లో 200 రోజులు ప్రదర్శితమై అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతోనే డైరెక్టర్ విజయ్ భాస్కర్ - రైటర్ త్రివిక్రమ్ కాంబోకు విశేషమైన ఖ్యాతి లభించింది. ఈ సినిమాతో తరుణ్, రిచా ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్నారు. మరో కీలక పాత్రలో కనిపించిన సాయికిరణ్ కూడా మంచి పేరు సంపాదించారు. 2000 సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలచిన 'నువ్వే కావాలి'ని హిందీలో విజయ్ భాస్కర్ డైరెక్షన్ లోనే 'తుఝే మేరీ కసమ్' పేరుతో రీమేక్ చేశారు. ఏది ఏమైనా ఈ నాటికీ 'నువ్వే కావాలి' ని తలచుకొని పులకించిపోయే అభిమానులున్నారు.
Also Read: Keerthy Suresh: జగపతిబాబుకి కీర్తి క్షమాపణ.. ఎందుకంటే..
Also Read: Little Hearts: సాయి మార్తాండ్ తో నితిన్ సినిమా...