NTR: సిల్వర్ జూబ్లీ మూవీ 'ఆడబ్రతుకు'
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:33 PM
ఎన్టీఆర్, దేవిక జంటగా నటించిన సిల్వర్ జూబ్లీ మూవీ 'ఆడబ్రతుకు' 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1965లో విడుదలై ఈ సినిమా పది కేంద్రాలలో వందరోజులు, రెండు కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది.
నటరత్న యన్టీఆర్, దేవిక జంటగా నటించిన 'ఆడబ్రతుకు' చిత్రం అరవై ఏళ్ళ క్రితం విశేషాదరణ చూరగొంది. యన్టీఆర్ కెరీర్ లో ఓ స్పెషల్ గా నిలచిన 'ఆడబ్రతుకు' మూవీ విశేషాలను గుర్తు చేసుకుందాం.
నటరత్న యన్టీఆర్ కెరీర్ లో మరపురాని సంవత్సరాల్లో 1965 ఒకటి. ఆ యేడాది యన్టీఆర్ నటించిన 12 చిత్రాలు జనం ముందు నిలవగా, వాటిలో 8 చిత్రాలు డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకున్నాయి. మిగిలిన నాలుగు చిత్రాలు సైతం ఎంతగానో అలరించాయి. అలాగే వాటిలో మూడు సినిమాలు రజతోత్సవం చూశాయి. ఆ యేడాది యన్టీఆర్ నటించిన చివరి చిత్రంగా విడుదలైన 'ఆడబ్రతుకు' కూడా సిల్వర్ జూబ్లీ హిట్ కావడం గమనార్హం!. ఈ సినిమా 1965 నవంబర్ 12న విడుదలయింది. జెమినీ పతాకంపై యస్.యస్. వాసన్ నిర్మించిన ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. 1964లో జెమినీ సంస్థ హిందీలో నిర్మించిన 'జిందగీ' ఘనవిజయం సాధించింది. ఆ సినిమా ఆధారంగా 'ఆడబ్రతుకు' రూపొందింది. యన్టీఆర్, దేవిక జోడీగా పలు సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కాయి. వాటిలో 'ఆడబ్రతుకు' ఒకటిగా నిలచింది.
అప్పట్లో యన్టీఆర్, ఏయన్నార్ నటనకు ఘంటసాల గానమే ప్రాణం పోసింది. ఘంటసాల కాకుండా వారికి ఇతరులు పాటలు పాడితే అలరించవు అనే విశ్వాసం ఉండేది. అయితే 'ఆడబ్రతుకు' చిత్ర సంగీత దర్శకులు విశ్వనాథన్ - రామ్మూర్తి ఈ సినిమాలో యన్టీఆర్ తో పాటు, కాంతారావుకు కూడా పి.బి.శ్రీనివాస్ తోనే పాటలు పాడించారు. యన్టీఆర్ కు పి.బి.శ్రీనివాస్ గానం చేసినా సూపర్ హిట్ గా నిలచింది 'ఆడబ్రతుకు'. అందువల్లే యన్టీఆర్ కు 'ఆడబ్రతుకు' ఘనవిజయం ఓ ప్రత్యేకం అంటారు అభిమానులు.
ప్రేమకథల్లో శుభం కార్డుకు ముందు అడ్డుగా నిలిచేవి ఆస్తులు- అంతస్తులు. ఈ చిత్రంలో ధనవంతుని కొడుకైన హీరో, ఓ డాన్సర్ ను పెళ్ళాడడంతో కథ పలు మలుపులు తిరుగుతుంది. ఈ చిత్రంలో యన్టీఆర్ తండ్రిగా యస్వీఆర్ నటించారు. కాంతారావు, రాజనాల, పద్మనాభం, సత్యనారాయణ, ముక్కామల, అల్లు రామలింగయ్య ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి సి.నారాయణరెడ్డి, ఆచార్య ఆత్రేయ పాటలు పలికించారు. పది కేంద్రాలలో శతదినోత్సవం, రెండు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకున్న 'ఆడబ్రతుకు' చిత్రం ఈ నాటికీ బుల్లితెరపై ప్రత్యక్షమై అభిమానులను అలరిస్తూనే ఉంది.
Also Read: Anu Emmanuel: ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లో నా నటనకు.. అబ్బాయిలు క్లాప్స్ కొడుతున్నారు
Also Read: Bhagyashri Borse: భాగ్యంకు.. నవంబర్ పరీక్ష! కలిసొచ్చేనా.. నిలబడేనా...