Bhagyashri Borse: భాగ్యంకు.. నవంబర్‌ పరీక్ష! క‌లిసొచ్చేనా.. నిల‌బ‌డేనా

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:36 AM

‘కాంత’ చిత్రంలో కుమారి పాత్ర చేయడం నా అదృష్టం. ఇది నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమ‌ని కథానాయిక భాగ్యశ్రీ బోర్సే అన్నారు.

Bhagyashri Borse

‘కాంత’ (Kaantha)చిత్రంలో కుమారి పాత్ర చేయడం నా అదృష్టం. ఇది నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన చిత్రం. రెగ్యులర్‌ హీరోయిన్‌ తరహాలో కాకుండా ఇందులో నటనా ప్రాధాన్యమైన పాత్ర దక్కింది’ అని కథానాయిక భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) అన్నారు.

దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా నటించిన చిత్రమిది. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌తో కలసి రానా నిర్మించారు. ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను భాగ్యశ్రీ బోర్సే మీడియాతో పంచుకున్నారు.

కెరీర్‌ ఆరంభంలోనే నాకు కుమారి లాంటి మంచి పాత్ర దొరికినందుకు ఆనందంగా ఉంది.‘కాంత’ చిత్రంలో నటిగా నాకు సవాల్‌ విసిరే పాత్రను పోషించాను. 1960ల నాటి నేపథ్యం కావడంతో నా పాత్ర కోసం చాలా సన్నద్ధమవ్వాల్సి వచ్చింది. చాలా కష్టమనిపించింది. శ్రీదేవి, సావిత్రి నటించిన పాత సినిమాలు చూశాను. వారి నటన స్ఫూర్తిగా కుమారి పాత్రను నాదైన శైలిలో ఆవిష్కరించేందుకు ప్రయత్నించాను.

నేను ఇండస్ట్రీలోకి వచ్చాక తొలిసారి విన్న కథ ఇదే. అయితే చిత్రీకరణలో జాప్యం వల్ల నేను నటించిన ఇతర చిత్రాలు ముందు విడుదలయ్యాయి. దుల్కర్‌ సల్మాన్‌, రానాతో నటించడం మరింత ఆనందాన్నిచ్చింద‌ని, దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దిన విధానం అద్భుతంగా ఉంటుంద‌న్నారు.

ఇదిలాఉంటే .. ఈ భామ ఎన‌ర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేనితో క‌ల‌సి న‌టించిన ఆంధ్రా కింగ్ తాలుఖా సినిమా సైతం ఈ నెల‌లోనే థియేట‌ర్లకు రానుంది. దీంతో రెండు చిత్రాలు ఒకే నెల‌లో వారాల వ్య‌వ‌ధిలోనే ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌స్తుండ‌డంతో భాగ్య శ్రీతో పాటు ఫ్యాన్స్ సినిమాల‌పై మంచి అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇప్ప‌టికే ఈ ముద్దుగుమ్మ న‌టించిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌, కింగ్‌డ‌మ్ సినిమాలు అంత‌గా విజ‌యం సాధించ‌క పోవ‌డంతో ఇప్పుడు ఈ రెండు చిత్రాలు భాగ్యంకు నవంబర్‌ పరీక్షగా మారింద‌న‌డంలో సందేహం లేదు.

Updated Date - Nov 12 , 2025 | 11:37 AM