సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Superstar Krishna: నాలుగు పదుల వజ్రాయుధం

ABN, Publish Date - Jul 05 , 2025 | 09:23 PM

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కె. రాఘవేంద్రరావు ఎనిమిది చిత్రాలు తెరకెక్కించారు. అందులో చక్కని విజయాన్ని అందుకున్న సినిమాల్లో వజ్రాయుధం కూడా ఒకటి. ఆ సినిమా విడుదలై నలభై యేళ్ళు పూర్తయ్యింది.

నటశేఖర కృష్ణ (Krishna)తో కె.రాఘవేంద్రరావు (K.Raghavendra Rao) తెరకెక్కించిన చిత్రాలు వారి అభిమానులను అలరించాయనే చెప్పాలి. కృష్ణ- రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'భలే కృష్ణుడు' అంతగా మురిపించలేదు. తరువాత వచ్చిన 'ఘరానాదొంగ' ఆకట్టుకుంది. వారి కలయికలో వచ్చిన మూడో మూవీ 'ఊరికి మొనగాడు' 1981 సంక్రాంతి రేసులో విన్నర్ గా నిలచింది. ఆ తరువాత తమ హీరో కృష్ణ కూడా రాఘవేంద్రరావుతో సాగాలని అభిమానులు ఆశిస్తూ వచ్చారు. ఆ రోజుల్లో నటరత్న యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాలు అఖండ విజయాలు సాధిస్తూ అలరించాయి. కృష్ణకు కూడా రాఘవేంద్రరావు ఆ స్థాయిలో కాకపోయినా, వరుస విజయాలు ఇస్తూ వచ్చారు... అలా రూపొందిన చిత్రాలలో "శక్తి, అగ్నిపర్వతం" ఒకదానిని మించి మరోటి విజయం సాధించాయి. అలాగే రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన మల్టీస్టారర్స్ 'అడవి సింహాలు', 'ఇద్దరు దొంగలు' సైతం ప్రేక్షకులకు కనువిందు చేశాయి. 'అగ్నిపర్వతం' సూపర్ హిట్ తరువాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో కృష్ణ నటించిన 'వజ్రాయుధం'కు మొదటి నుంచీ క్రేజ్ నెలకొంది. ఈ చిత్రాన్ని లక్ష్మీఫిలిమ్స్ డివిజన్ సంస్థ నిర్మించింది. ఇందులో శ్రీదేవి నాయికగా నటించి అలరించారు. 1985 జూలై 5వ తేదీన విడుదలైన 'వజ్రాయుధం' మంచి ఆదరణ చూరగొంది. తన సోదరి కుటుంబానికి జరిగిన అన్యాయానికి హీరో ప్రతీకారం తీర్చుకొనే కథతో 'వజ్రాయుధం' రూపొందింది. ఇందులో రాఘవేంద్రరావు సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, చలపతిరావు వంటివారు నటించారు. వారితో పాటు కాంతారావు, రాజా, నూతన్ ప్రసాద్, పియల్ నారాయణ, అశ్వని, శ్యామలగౌరి, బేబీ సీత కనిపించారు.


తన అభిమాన నటుడు యన్టీఆర్ అంటే రాఘవేంద్రరావుకు ఎంతటి అభిమానమో ఆయన ఇతర హీరోలతో తీసిన సినిమాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. కృష్ణతో ఆయన తెరకెక్కించిన 'శక్తి'లో క్లయిమాక్స్ సీన్ లో 'కొండవీటి సింహం' పతాక సన్నివేశంలో యన్టీఆర్ ను చూపించి మురిపించారు దర్శకేంద్రుడు. అలాగే 'వజ్రాయుధం'లో హీరో సోదరి బిడ్డకు చిన్నతనంలోనే భగవద్గీతలోని శ్లోకాలు కంఠతా వచ్చేందుకు టీవీలో 'శ్రీకృష్ణావతారం'లో యన్టీఆర్ విశ్వరూపం కారణమని చూపించి ప్రేక్షకులను రంజింప చేశారు. ఈ సినిమాలోని పాటలన్నీ ఒక ఎత్తు కాగా, "ఆ బుగ్గమీద గోరుగిచ్చుడు..." అంటూ సాగే గీతం విశేషాదరణ చూరగొంది. ఆ పాటలో పక్షులు, సంగీతసాధనాలను ఉపయోగించి హీరోయిన్ శ్రీదేవి అందానికి మరింత వన్నెలు అద్దారు దర్శకేంద్రుడు. ఈ చిత్రానికి వేటూరి పాటలు, చక్రవర్తి సంగీతం పెద్ద ఎస్సెట్. 'వజ్రాయుధం' సినిమా కృష్ణ అభిమానులను భలేగా మురిపించింది.

Updated Date - Jul 05 , 2025 | 09:27 PM