Tollywood: తెలుగు సినీ దిగ్దర్శకుడు కేవీ రెడ్డి జయంతి

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:23 PM

తెలుగు సినిమాకు తన దర్శకత్వ ప్రతిభతో నగిషీలు చెక్కారు కేవీ రెడ్డి. జూలై 1న కేవీ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా కేవీఆర్ దర్శకత్వశైలిని స్మరించుకుందాం.

నాటకీయ ఫక్కీలో సాగుతున్న తెలుగు సినిమాకు ఓ గ్లామర్ ను, గ్రామర్ నూ తీసుకు వచ్చిన అరుదైన దర్శకుల్లో కేవీ రెడ్డి (KV Reddy) స్టైల్ ప్రత్యేకమైనది. 'జనం కోరేదే మనం తీయాలి' అన్న సూత్రాన్ని అనుసరిస్తూ చిత్రాలను రూపొందించారు కేవీ రెడ్డి. అంతేకాదు నిర్మాతకు ఖర్చును తగ్గించడానికి పలు పథకాలు వేసేవారాయన. అలా అని ఆయన 'లో బడ్జెట్' మూవీస్ తీయలేదు. ఆ రోజుల్లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలనే తెరకెక్కించారాయన. తెలుగువారికి తొలి స్వర్ణోత్సవం చూపిన 'పాతాళభైరవి' (Pathala Bhairavi) ని రూపొందించింది ఆయనే!. 'పాతాళభైరవి' ఘనవిజయంతోనే తెలుగునాట జానపద చిత్రాల తీరు మారిపోయింది.


నవతరం సైతం...

తెలుగునాట పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘికాలు, పీరియాడికల్స్ తీసిన తొలి దర్శకునిగా కేవీ రెడ్డి నిలిచారు. మహాభారతంలోని పురాణ పాత్రలతో రూపొందిన 'మాయాబజార్'కు ఎందరో తెరరూపం కల్పించారు. వాటిలో మేటిగా నిలచింది కేవీ రెడ్డి తెరకెక్కించిన 'మాయాబజార్'. కొన్నేళ్ళ క్రితం ఆల్ ఇండియా లెవెల్ లో జరిగిన ఓ సర్వేలో అందరినీ ఆకర్షించిన చిత్రంగా 'మాయాబజార్' నిలచింది. దీనిని బట్టే నవతరాన్ని సైతం ఆకట్టుకొనేలా ఆ రోజుల్లోనే కేవీ రెడ్డి దర్శకత్వం సాగిందని చెప్పవచ్చు.


భావితరాలకు స్ఫూర్తి...

విజయా సంస్థలో కేవీ రెడ్డి రూపొందించిన 'పాతాళభైరవి, మాయాబజార్, జగదేకవీరుని కథ, సత్య హరిశ్చంద్ర" వంటి చిత్రాలు ఈ తరం వారిని సైతం ఆకర్షిస్తున్నాయి. ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన కేవీ రెడ్డి 1965 తరువాత నుంచీ వరుస ఫ్లాపులు చూశారు.. చివరకు తాను 'పాతాళభైరవి'తో సూపర్ స్టార్ ని చేసిన యన్టీఆర్ నిర్మాణంలో 'శ్రీకృష్ణ సత్య' రూపొందించి సక్సెస్ సాధించారు. యన్టీఆర్ ను అభినయ శ్రీకృష్ణునిగా నిలిపిన కేవీ రెడ్డి ఆయనతోనే రామాయణ, భాగవత, భారత గాథల సమ్మిళితంలో 'శ్రీకృష్ణ సత్య' తీసి జనాన్ని మెప్పించారు. ఇదే కేవీ రెడ్డి తొలి, చివరి కలర్ మూవీ కావడం విశేషం! నిర్మాతకు ముడి ఫిలిమ్ ఆదా చేయడం దగ్గర నుంచీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్ట్ కనిపించేలా సీన్ ను చిత్రీకరించడం దాకా తపించేవారు కేవీ రెడ్డి. అందుకే ఈ నాటికీ ఆయనను స్మరించుకుంటూ ఉంటారు. నవతరం దర్శకులు కేవీ బాటలో పయనిస్తే ఎంత భారీ చిత్రాలు రూపొందించినా అనవసర వ్యయం తగ్గించవచ్చు.

Also Read: Box Office War: ఎన్టీఆర్ - హృతిక్ ఒకవైపు, రజనీ - నాగ్ మరోవైపు. వార్ 2 వర్సెస్ కూలి

Also Read: Maa Boxoffice Collections: కాజోల్ కోసమే సోనాక్షి వెనక్కి వెళ్ళిందా...

Updated Date - Jul 01 , 2025 | 12:23 PM