సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mutyala Muggu: 50 వసంతాలైన సినీ వాకిలి ముంగిట చెరిగిపోని 'ముత్యాల ముగ్గు'

ABN, Publish Date - Jul 25 , 2025 | 02:33 PM

శ్రీధర్, సంగీత జంటగా ప్రముఖ దర్శకుడు బాపు తెరకెక్కించిన సినిమా 'ముత్యాల ముగ్గు' ఈ చిత్రం విడుదలై యాభై యేళ్ళు పూర్తియిన సందర్భంగా అలనాటి ముచ్చట్లను గుర్తు చేసుకుందాం.

Mutyala Muggu Movie

'మడిషన్నాక కాసింత కళాపోషణుండాల... ఎంత సేపూ టాప్ స్టార్ల సినిమాలేనా... ఏం సిన్న సినిమాలంటే చులకనా... చిన్నసినిమాలే చింతలు తీర్చేవి... ఇది కాదన్నోళ్ళను 'ముత్యాలముగ్గు' (Mutyala Muggu) కాంట్రాక్టర్ డిక్కీలో కుక్కీయగల్డు... అతనికి ఆ శ్రమ ఇయ్యకుండానే ఇద్దరు పిల్లలు బుద్ధి చెప్పారనుకోండి... ఇంతకూ విషయమేంటంటారా?... ముళ్ళపూడి వెంకటరమణ (Mullapudi Venkata Ramana) రాతకు, బాపు (Bapu) తీతకు ఏ నాడో లంకె కుదిరింది... ఆళ్ళిద్దరూ 'ఉత్తర రామాయణానికి' సోషల్ టచ్చిచ్చి యాభై ఏళ్ళ కిందట 'ముత్యాలముగ్గు' తీశారు... అప్పట్లో 'ముత్యాలముగ్గు' ఎంతలా మురిపించిందో... గుర్తు చేసుకోవలసిందే...'

చిత్రసీమంటేనే చిత్రవిచిత్రాలకు నెలవు. కొన్నిసార్లు భారీ బడ్జెట్ మూవీస్ ను తోసి రాజని, లో-బడ్జెట్ పిక్చర్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటాయి. అంతటితో ఆగకుండా సదరు చిత్రాలు టాప్ స్టార్స్ మూవీస్ రేంజ్ లో వసూళ్ళు కూడా పోగేస్తూంటాయి. అలాంటి విజయాలను చూసిన జనం 'ఔరా...' అంటూ నోరెళ్ళ బెట్టి మరీ ఆ సినిమాలు ఆడే థియేటర్ల వైపు పరుగులు తీస్తూ ఉంటారు. విమర్శకులు తమదైన పంథాలో 'సినిమాకు అసలైన హీరో కథే... ఆ కథ ఇందులో ఉంది కాబట్టే... ఈ చిత్రం ఇంతటి విజయం సాధించింది...' అంటూ రొటీన్ కు భిన్నం కాని మాటలు వల్లె వేస్తూ ఉంటారు. అలాంటి అంశాలకు యాభై ఏళ్ళ క్రితం తావిచ్చిన సినిమానే... బాపు గీసిన 'ముత్యాలముగ్గు' నిలచింది. ఈ ముగ్గు వేసిన తేదీ 1975 జూలై 25... బాపు-రమణ ఇద్దరూ కలసి వేసిన 'ముత్యాలముగ్గు'ను చూట్టానికి జనం పరుగులు తీశారు.


శ్రీరామచిత్ర పతాకంపై యమ్వీయల్ ఈ సినిమాను నిర్మించారు. యమ్వీయల్ పూర్తి పేరు మల్లాది వెంకట లక్ష్మీనరసింహం. ఈ సినిమా ఘనవిజయం సాధించిన తరువాత సాగిన ఓ చర్చాగోష్ఠిలో 'యమ్వీయల్' అంటే 'ముళ్ళపూడి వెంకట (ర)లమణ' అని 'బుడుగు' భాషలో చమత్కరించారు అసలైన యమ్వీయల్.

ఈ సినిమాలో సంగీత (Sangeetha), శ్రీధర్ (Sridhar) నాయికానాయకులు. కాంతారావు (Kantharao), ముక్కామల, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, నూతన్ ప్రసాద్, సూర్యకాంతం, జయమాలిని, హలం, మాడా నటించారు. ఈ మూవీలో తనదైన వాచకంతో ఆకట్టుకున్న రావు గోపాలరావు ధరించిన కాంట్రాక్టర్ పాత్ర ఈ నాటికీ 'కళాపోషణ' తెలిసిన వారి మదిలో చిందులు వేస్తూనే ఉంది. అంతకు ముందు ఎన్ని సినిమాల్లో నటించినా, ఈ చిత్ర ఘనవిజయంతో ఒక్కసారిగా జనం మదిలో నిలచిపోయారు రావు గోపాలరావు. సంగీత పిల్లలుగా నటించిన రాధ- మురళీ కూడా ఆకట్టుకున్నారు. ఆంజనేయుని పాత్రలో తనకు తానే సాటి అనిపించుకున్న అర్జా జనార్దనరావు ఇందులోనూ హనుమంతునిగా కనిపించి మురిపించారు. దేవతామూర్తుల పాత్రలను ప్రధాన పాత్రల ఊహల్లో తిరిగేలా చేయడం బాపు-రమణ 'బుద్ధిమంతుడు'తోనే మొదలెట్టారు. అప్పుడు శ్రీకృష్ణుడు భక్తునితో మాట్లాడితే, 'ముత్యాలముగ్గు'లో ఆంజనేయుడు ఓ చిన్నారికి సదా రక్షగా ఉంటాడు.

ఈ చిత్రం ద్వారా నాయికగా పరిచయమైన సంగీత తరువాతి రోజుల్లో 'బాపు బొమ్మ'గా పేరొందారు. హీరోగా శ్రీధర్ కెరీర్ లో మరపురాని, మరచిపోలేని చిత్రంగా 'ముత్యాల ముగ్గు' నిలచింది. ఈ సినిమాకు కేవీ మహదేవన్ స్వరకల్పన చేశారు. మాండలిన్ పై నేపథ్య సంగీతం సమకూర్చారు సజ్జాద్ హుస్సేన్. ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, గుంటూరు శేషేంద్ర శర్మ పాటలు పలికించారు. ఇందులో గుంటూరు శేషేంద్ర శర్మ 'నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది...' అంటూ సాగే గీతాన్ని రచించారు. కవిగా విశేషఖ్యాతి గాంచిన శేషేంద్ర శర్మ రాసిన ఏకైక సినిమా గీతం ఇదే కావడం విశేషం! 'ఎంతటి రసికుడవో తెలిసెరా...', 'ఏదో ఏదో అన్నది...', 'ముత్యమంతా పసుపు...', 'గోగులు పూచే గోగులు పూచే...' అంటూసాగే పాటలు విశేషంగా అలరించాయి. టైటిల్స్ లో 'శ్రీరామజయరామ...' అంటూ సాగే నేపథ్యగీతం సైతం ఆకట్టుకుంది. ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎన్నికైంది. ఇషాన్ ఆర్యకు ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు లభించింది.

'ముత్యాలముగ్గు'లో ముళ్ళపూడి కలం బలం ప్రదర్శించారు. ఇందులోని డైలాగ్స్ రికార్డులు ఆ రోజుల్లో భలేగా ఆకట్టుకున్నాయి. 'సెగట్రీ... పైనేదో మర్డరు జరిగినట్టు లేదూ... ఆకాసంలో...సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ...', 'ఎప్పుడూ యెదవ బిగినెస్సేనా... ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏంటుంటది?...', 'సెరిత్ర సెరిపేత్తే సెరిగిపోదు సింపేత్తే సిరిగిపోదు...' ఇలాంటి డైలాగులన్నీ రావు గోపాలరావు గళంలో భలేగా రక్తి కట్టాయి.

అమ్మాయి మనసును అద్దంతో పోల్చి, మొగుడనేవాడు రాగానే ఆ అద్దంలో అతని బొమ్మ చిత్రపటంగా మారుతుందని పలికించినవైనం ఆకట్టుకోక మానదు. 'సిఫార్సులతో కాపురాలు చక్కబడవు' వంటి మాటలు మదిని తడతాయి. చెప్పుకుంటూ పోతే బోలెడు... చూస్తేనే ఆ మాటల్లోని మజా తెలుస్తుంది.


టాప్ స్టార్స్ మూవీస్ తోనే 'ముత్యాలముగ్గు' ఢీ!

ఇక 'ముత్యాలముగ్గు' అనేక కేంద్రాలలో అగ్రకథానాయకుల చిత్రాలతో పోటీ పడడం విశేషం! 1975 సంవత్సరం టాప్ ఫైవ్ గ్రాసర్స్ లో మొదటి స్థానం 'జీవనజ్యోతి' ఆక్రమించింది.తరువాతి స్థానంలో 'ముత్యాల ముగ్గు', 'సోగ్గాడు' ఢీ అంటే ఢీ అని నిలిచాయి. మూడో స్థానంలో 'అన్నదమ్ముల అనుబంధం', నాలుగో ప్లేస్ లో 'జేబుదొంగ', ఐదో స్థానంలో 'ఎదురులేని మనిషి' నిలిచాయి. అయితే బిగ్ సెంటర్స్ లో 'ముత్యాల ముగ్గు'దే పైచేయిగా నిలచింది. చిన్న కేంద్రాలలో 'జీవనజ్యోతి' మంచి వసూళ్ళు చూడడంతో నంబర్ వన్ గా నిలచింది. ఇక 'ముత్యాల ముగ్గు' చిత్రం హైదరాబాద్- సుదర్శన్ 70 ఎమ్.ఎమ్., సికిందరాబాద్ - అలంకార్- రెండు సెంటర్స్ లోనూ రోజూ మూడు ఆటలతో డైరెక్ట్ గా నూరు రోజులు చూసింది. స్టార్ హీరోస్ లో యన్టీఆర్, ఏయన్నార్ మాత్రమే అప్పటికీ ఈ రెండు సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ చూశారు. చిన్న సినిమాల్లో ఆ క్రెడిట్ దక్కించుకున్న మొదటి సినిమాగా 'ముత్యాల ముగ్గు' నిలచింది. ఇక హైదరాబాద్ సుదర్శన్ 70 ఎమ్.ఎమ్. థియేటర్ లో 'ముత్యాల ముగ్గు' వసూళ్ళ వర్షం కురిపించింది. అప్పట్లో 35 రోజులకు పైగా 112 షోస్ హౌస్ ఫుల్స్ తో సాగిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. 'ముత్యాల ముగ్గు'కు సమీపంలో అంతకు ముందు 'దసరాబుల్లోడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు' వంటి కలర్ మూవీస్- హైదరాబాద్ లో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ చూశాయి. ఆ సినిమాలు 25 వారాలకు సాధించిన మొత్తాన్ని 'ముత్యాల ముగ్గు' కేవలం 50 రోజుల్లోనే వసూలు చేయడం విశేషం! హైదరాబాద్ లో ఈ సినిమా యాభై రోజులకు రూ.4,30,000 సంపాదించి అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. ఈ విషయాన్ని 'ముత్యాల ముగ్గు' మేకర్స్ సగర్వంగా ప్రకటించుకోవడం గమనార్హం!

12 కేంద్రాలలో డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకున్న 'ముత్యాలముగ్గు' 5 కేంద్రాలలో రజతోత్సవం చూసింది. అందులో హైదరాబాద్ లో 24 వారాలు డైరెక్టుగా ఆడి, షిఫ్ట్ పై సిల్వర్ జూబ్లీ చూసిందీ చిత్రం. తిరుపతి మినీప్రతాప్ లో నేరుగా రజతోత్సవం జరుపుకుంది. విజయవాడ, వైజాగ్, రాజమండ్రిలోనూ షిఫ్ట్ పై సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. తిరుపతి మినీ ప్రతాప్ లో 260 రోజులు రెగ్యులర్ షోస్ తో ప్రదర్శితమై 'ముత్యాల ముగ్గు' ఈ నాటికీ ఆ నగరంలో రికార్డ్ గా నిలచి ఉండడం విశేషం! ఈ సినిమా తరువాత వచ్చిన 'శంకరాభరణం' (1980) చిన్నచిత్రంగా వచ్చి అఖండ విజయం సాధించింది. అయితే ఆ సినిమా సైతం హైదరాబాద్, సికిందరాబాద్ లో ఉదయం ఆటలతోనే శతదినోత్సవం చూసింది. ఇలా పలు కేంద్రాలలో చిన్న సినిమాల విషయంలో 'ముత్యాల ముగ్గు' తనకంటూ కొన్ని రికార్డులను నెలకొల్పింది. యాభై ఏళ్ళ క్రితం 'ముత్యాల ముగ్గు' సాధించిన రికార్డులను ఆ యా కేంద్రాలలోని సినీ ఫ్యాన్స్ ఇప్పటికీ ముచ్చటించుకుంటూ ఉంటారు.

... 'ఇంత సెప్పినా ... ఆ ఏముందిందులో అనుకుంటే తప్పులో కాలేసినట్టే... సెరిత్ర ఇది... సెరిపేస్తే సెరిగిపోదు.. సింపేత్తే సిరిగిపోదు... ఏటంటారూ!?'

Also Read: Rajya Sabha Member: రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్...

Also Read: Kingdom: ఓవైపు చీఫ్ ఆర్కిటెక్ట్.. మ‌రో వైపు కొత్త ఆర్కిటెక్ట్

Updated Date - Jul 25 , 2025 | 02:33 PM