Ashwinidutt: 50 ఏళ్ళ వైజయంతీ మూవీస్
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:20 AM
తెలుగు సినిమా టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు నిర్మించిన ఘనత - వైజయంతీ మూవీస్ సొంతం... వైజయంతీ మూవీస్ నిర్మించిన తొలి చిత్రం 'ఎదురులేని మనిషి' విడుదలై డిసెంబర్ 12తో యాభై ఏళ్ళు పూర్తయ్యింది... ఈ సందర్భంగా వైజయంతి చిత్ర ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం...
నటరత్న యన్టీఆర్ (NTR) హీరోగా కె.బాపయ్య దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై తొలి చిత్రంగా 'ఎదురులేని మనిషి' నిర్మించారు సి.అశ్వనీదత్... 1975 డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రానికి హిందీలో దేవానంద్ హీరోగా రూపొందిన 'జానీ మేరా నామ్' ఆధారం... ఈ సినిమాతోనే డైరెక్టర్ కె.బాపయ్య తొలి ఘనవిజయాన్ని అందుకున్నారు... 'ఎదురులేని మనిషి' ఓపెనింగ్స్ గురించి అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు... ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది... సంస్థకు 'వైజయంతీ మూవీస్' అన్న టైటిల్ ను నిర్ణయించింది యన్టీఆరే... నటరత్న ఆశీస్సులతో ఆరంభమైన 'వైజయంతీ మూవీస్' ఈ నాటికీ చిత్ర నిర్మాణంలో కొనసాగుతూనే ఉండడం విశేషం!
శ్రీకృష్ణుడు వైయంతీమాల ధరించి పాంచజన్యం పూరించే యన్టీఆర్ బొమ్మతోనే 'వైజయంతీ మూవీస్' లోగో ఉంటుంది... ఈ సంస్థ యన్టీఆర్-ఏయన్నార్, కృష్ణ-శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్ కళ్యాణ్, జూనియర్ యన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్- ఇలా నాలుగు తరాల స్టార్స్ తో సినిమాలు నిర్మించి అరుదైన చరిత్రను సొంతం చేసుకుంది... జనం మెచ్చే అనేక బ్లాక్ బస్టర్స్ 'వైజయంతీ మూవీస్' సంస్థ నుండి వెలుగు చూశాయి.
ఐదు దశాబ్దాల్లో అనేక అపురూప చిత్రాలను నిర్మించింది వైజయంతీ మూవీస్ సంస్థ... అశ్వనీదత్ వారసత్వాన్ని నిలుపుతూ ఆయన కూతుళ్ళు ముగ్గురూ చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టి చక్కటి సినిమాలు తీశారు... తీస్తున్నారు. అశ్వనీదత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'మహానటి, కల్కి 2898 ఏడి' చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి... వైజయంతీ మూవీస్ నిర్మించిన ఛాంపియన్ ఈ నెల 25 రిలీజ్ కానుంది. ఈ సంస్థ నుండి మరిన్ని మంచి చిత్రాలు తమను అలరిస్తాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు... వారి అభిరుచికి తగ్గ చిత్రాలను అందిస్తూనే అశ్వనీదత్ సాగుతూ ఉండడం విశేషం!