Mrs Funnybones Returns : మరోసారి పాఠకుల మది దోచిన ట్వింకిల్ ఖన్నా...
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:48 PM
సినిమాలకు సీక్వెల్ ఉన్నట్టే ఇప్పుడు పుస్తకాలకూ సీక్వెల్స్ వస్తున్నాయి. ప్రముఖ నటి ట్వింకిల్ ఖన్నా గతంలో తాను రాసిన 'మిసెస్ ఫన్నీబోన్స్' పుస్తకానికి సీక్వెల్ గా 'మిసెస్ ఫన్నీబోన్స్ రిటర్న్స్' అనే పుస్తకాన్ని వెలువర్చింది.
సినిమా రంగంలోని అందమైన కథానాయికుల్లో మంచి రచయిత్రులు ఉన్నాయి. తమ కుటుంబంలోనూ, జీవితంలో తారసపడిన వ్యక్తులను గురించి వీరు చక్కటి కథనాలను రాస్తుంటారు. కొందరైతే యోగా గురించి పుస్తకాలు రాస్తే, మరికొందరు మాతృత్వపు మధురిమలను తెలియచేస్తూ పుస్తకాలు రాశారు. ఇంకొందరు తమ ట్రావెలింగ్ గురించి, ఇంకొందరు పిల్లల పెంపకం గురించి కూడా వ్యాసాలు రాసి వాటిని పుస్తకాలుగా తీసుకొచ్చారు. అలాంటి వారి జాబితాలోకి ప్రముఖ నటి, అక్షయ్ కుమార్ (Akshay Kumar) భార్య ట్వింకిల్ ఖన్నా (Twinkle Khanna) కూడా చేరుతుంది. ట్వింకిల్ ఖన్నా తెలుగులోనూ వెంకటేశ్ (Venkatesh) సరసన 'శీను' సినిమాలో హీరోయిన్ గా నటించింది.

గతంలో ట్వింకిల్ ఖన్నా 'మిసెస్ ఫన్నీబోన్స్' పేరుతో ఓ సరదా కథలను పుస్తకంగా తీసుకొచ్చింది. సినిమాలకు సీక్వెల్ ఉన్నట్టుగా ఈ పుస్తకానికి కూడా సీక్వెల్ తీసుకు రమ్మని ఆమె అభిమానులు కొంతకాలంగా కోరుతున్నారు. దాంతో గడిచిన కొన్ని సంవత్సరాలలో తన అనుభవాలను మరోసారి హాస్యకథల రూపంలో 'మిసెస్ ఫన్నీబోన్స్ రిటర్న్స్' పేరుతో పుస్తకంగా తీసుకొచ్చింది ట్వింకిల్ ఖన్నా. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ పుస్తకం అమ్మకాలు బ్రహ్మాండంగా సాగుతున్నాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా క్రాస్ వర్డ్ బుక్ స్టోర్స్ తన అవుట్ లెట్స్ లో ట్వింకిల్ ఖన్నా కటౌట్ తో పుస్తకాలను ప్రదర్శనకు పెట్టింది. ఒకప్పటి కథానాయిక అందాల కటౌట్ చూసి ఫిదా అయిపోతున్న అభిమానులు ఇప్పుడు ఆమె పుస్తకాన్ని కొనుగోలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తన కటౌట్ ఉన్న ఫోటోను ట్వింకిల్ ఖన్నానే స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేసి... పుస్తకానికి తగిన పబ్లిసిటీని చేస్తోంది. ఏదేమైనా... అందమైన భామల పుస్తకాలకు ఉండే గిరాకీ మరో లెవెల్!
Also Read: Dharamendra: ధర్మేంద్రకు వినూత్న నివాళి
Also Read: Dil Raju: దిల్ రాజుకు గోల్డెన్ డీల్.. సంక్రాంతి కింగ్ మరోసారి చక్రం తిప్పబోతున్నాడా?