Tollywood: నటుడు సాయిచంద్ అన్నయ్య కన్నుమూత
ABN, Publish Date - Oct 01 , 2025 | 05:50 PM
ప్రముఖ రచయిత, దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ రెండో కుమారుడు రామ్ గోపాల్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన పెద కర్మ అక్టోబర్ 1న హైదరాబాద్ లో జరిగింది.
ప్రముఖ రచయిత, దర్శకులు స్వర్గీయ త్రిపురనేని గోపీచంద్ (Tripuraneni Gopichand) రెండవ కుమారుడు రామ్ గోపాల్ (Ramgopal) (73) పెద్ద కర్మ హైదరాబాద్ లో అక్టోబర్ 1న జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు ఈ కార్యక్రమానికి హాజరై రామ్ గోపాల్ కు నివాళులు అర్పించారు. త్రిపురనేని గోపీచంద్ పెద్ద కుమారుడు రమేశ్ కాగా రెండవ కుమారుడు రామ్ గోపాల్. మూడవ కుమారుడు సాయిచంద్ (Saichand). ఆయన సినీ ప్రయాణం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సాయిచంద్ పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు.
తన సోదరుడు రామ్ గోపాల్ గురించి సాయిచంద్ చెబుతూ, 'అన్నయ్య చాలా తెలివైనవాడు. మొదటి నుండి లోతైన భావాలు ఉన్నవాడు. అందరితో పెద్దంత కలిసే వాడు కాదు. 1974 ప్రాంతంలో చెన్నయ్ లోని అడయార్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో ఎడిటింగ్ కోర్స్ చేశాడు. ఆ తర్వాత సంజీవి (Sanjeevi) గారి దగ్గర కొన్ని సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు. అయితే చెన్నయ్ వాతావరణం నచ్చకపోవడంతో తిరిగి హైదరాబాద్ వచ్చేశారు. నారాయణగూడలోని సొంత ఇంట్లోనే ఉండేవాడు. హైదరాబాద్ వచ్చాక కొంతకాలం దూరదర్శన్ లో ఫ్రీలాన్స్ ఎడిటర్ గా వర్క్ చేశాడు. అలానే దర్శక మిత్రుల కోరిక మేరకు కొన్ని సినిమాలలో సరదాగా నటించాడు. కొన్ని సీరియల్స్ లోనూ యాక్ట్ చేశాడు. అయితే ఎప్పుడూ నటనను సీరియస్ గా తీసుకోలేదు. సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం పక్క ప్లాట్ లో వాళ్ళు అన్నయ్య తలుపు తీయకపోవడంతో కిటికి తెరిచి చూసే సరికీ మంచం మీద విగతజీవిగా ఉండటాన్ని గమనించారు. గుండెపోటుతో మరణించారని తెలిసింది. అదే రోజు అంత్యక్రియలు పూర్తి చేశాం. బుధవారం జరిగిన పెద్ద కర్మకు మా కుటుంబ సన్నిహితులు త్రిపురనేని చిట్టి, అనిల్ అట్లూరి తదితరులు హాజరయ్యారు. అన్నయ్యకు ఎడిటింగ్, నటనతో పాటు రచనలోనూ మంచి ప్రవేశం ఉంది. అది నాన్నగారి నుండి అబ్బిందని అనుకోవాలి. కొన్ని కథలు, గల్పికలు రాశాడు. అవి జ్యోతి మాసపత్రికలో ప్రచురితమయ్యాయి' అని తెలిపారు.
త్రిపురనేని రామ్ గోపాల్ మృతి వార్త ఆలస్యంగా తెలియడంతో సాహితీ మిత్రులు, సినిమా రంగానికి చెందిన వారు విషాదానికి లోనయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని తలుచుకున్నారు.