Tollywood: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మహాధర్నా
ABN , Publish Date - Nov 19 , 2025 | 04:35 PM
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీని నిరసిస్తూ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మహా ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమం ఛాంబర్ ప్రెసిడెంట్ ప్రతాని రామకృష్ణ గౌడ్ నేతృత్వంలో జరిగింది.
తెలంగాణ ఫిలింఛాంబర్ (Telangana Film Chamber) ఆధ్వర్యంలో డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యుఎఫ్ఓ, పీఎక్స్ డీ అధిక యూజర్ ఛార్జీలు, సినిమా థియేటర్స్ లో తినుబండారాల రేట్స్, సినిమా పైరసీకి వ్యతిరేకంగా తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయం దగ్గర మహాధర్నాను నిర్వహించారు. టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ (Prathani Ramakrishna Goud) సారథ్యంలో జరిగిన ఈ మహాధర్నాలో నిర్మాతలు సాయి వెంకట్ (Sai Venkat), గురురాజ్, డీఎస్ రెడ్డి, రవి, నటుడు, హీరో సన్నీ, దర్శకుడు సిరాజ్ తో పాటు పలువురు దర్శక నిర్మాతలు, ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'సినిమాను థియేటర్స్ లో ప్రదర్శించే డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ క్యూబ్, యూఎఫ్ వో, పీఎక్స్ డీ తెలుగు నిర్మాతల నుంచి వారానికి పది వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కో సినిమా రిలీజ్ కు కనీసం పది లక్షల రూపాయలు భారాన్ని నిర్మాతలు మోయాల్సివస్తోంది. మల్టీప్లెక్స్ లో అయితే వారానికి 15 వేల రూపాయలు నిర్మాత చెల్లించాలి. ఇదే పక్క రాష్ట్రాల్లో 2,500 నుంచి 3 వేల రూపాయలు మాత్రమే ఛార్జీలు ఉన్నాయి. మన దగ్గర మాత్రం ఇంత అధిక ధరలు ఎందుకు చెల్లించాలి. ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఈ డిజిటల్ ప్రొవైడింగ్ కంపెనీల్లో పార్టనర్స్ గా ఉంటూ తెలుగు చిత్ర పరిశ్రమను లూటీ చేస్తున్నారు. థియేటర్స్ వాళ్ల కంట్రోల్ లోనే ఉన్నాయి. థియేటర్స్ లో వందల రూపాయలు తినుబండారాలకే ఖర్చువుతోంది. టికెట్ రేట్లు భారీగా ఉంటున్నాయి. దీంతో సామాన్య ప్రేక్షకుడు చిన్న సినిమాను థియేటర్స్ లో చూసేందుకు రావడం లేదు. ఏడాదిలో రిలీజయ్యే 250 చిత్రాల్లో 200 చిన్న చిత్రాలే ఉంటున్నాయి. అలాంటి చిన్న సినిమా ఈ రోజున బతికే పరిస్థితి లేదు. నేను నిర్మాతగా దాదాపు 50 సినిమాలు నిర్మించాను. అప్పట్లో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి' అని అన్నారు.

నిర్మాత సాయివెంకట్ మాట్లాడుతూ, 'డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ మాఫియాలా తయారయ్యారు. ఇక్కడి ప్రొడ్యూసర్స్ కొందరు ఆ కంపెనీలతో కుమ్మక్కై చిన్న నిర్మాతలను దోపిడీ చేస్తున్నారు. నేను 'జయహో రామానుజా' అనే సినిమాను నిర్మించి రిలీజ్ కోసం ప్రయత్నిస్తున్నాను. 400 థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేయాలంటే 50 లక్షల రూపాయలు ఈ కంటెంట్ ప్రొవైడర్స్ కే పెట్టాల్సివస్తోంది' అని వాపోయారు. నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ, 'నేను ముమైత్ ఖాన్ తో 'మంగతాయారు టిఫిన్ సెంటర్' అనే సినిమా చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చారు. అలాంటిది ఇటీవల నేను కోట్లాది రూపాయలతో కొన్ని సినిమాలు నిర్మిస్తే రూపాయి తిరిగి రాలేదు. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చిన్న నిర్మాతలు ఉన్నారు. చిన్న నిర్మాతలు అనేక రకాల దోపిడీలకు గురవుతున్నారు. కంటెంట్ ప్రొవైడర్స్ రేట్స్, టికెట్ రేట్స్, తినుబండారాల రేట్స్ తగ్గించాలి. లేకుంటే ఇండస్ట్రీలో వేళ్ల మీద లెక్కపెట్టే ఆ కొద్ది మంది నిర్మాతలు మాత్రమే ఉంటారు. చిన్న నిర్మాతలెవరూ ఉండరు. ఏడాదిలో నెలకో సినిమా కూడా రిలీజ్ కాదు. థియేటర్స్ మూసుకునే పరిస్థితి వస్తుంది' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత డి.ఎస్. రడ్డి, నటుడు, దర్శకుడు సిరాజ్ కూడా చిన్న నిర్మాతల కష్టాలను గురించి వివరించారు.
Also Read: Hyper Aadhi: హీరోల మీద ట్రోల్స్.. ఇచ్చిపడేసిన హైపర్ ఆది
Also Read: Tollywood: ఈ వారం కూడా చిన్న సినిమాలదే సందడి