సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: తెలుగు చిత్రసీమలో విషాదం

ABN, Publish Date - Sep 29 , 2025 | 01:50 PM

సీనియర్ దర్శకుడు గార సత్యం అనారోగ్యంతో కన్నుమూశారు. కృష్ణ, విజయ నిర్మల రూపొందించిన పలు చిత్రాలకు ఆయన దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆయన మృతికి దర్శకుల సంఘం సంతాపాన్ని తెలిపింది.

Director Gara Satyam No more

పలు తెలుగు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో-డైరెక్టర్ గా పనిచేసిన గార సత్యం (91) (Gara Satyam) సోమవారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. సూపర్ స్టార్ కృష్ణ (Krishna), విజయ నిర్మల (Vijaya Nirmala) చిత్రాలకు అత్యధికంగా వర్క్ చేసిన ఆయన దాదాపు వంద సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చక్కటి కవిత్వం రాసే అలవాటు ఉన్న సత్యం కెరీర్ చెన్నయ్ లో మొదలైంది.


హైదరాబాద్ కు సినిమా రంగం తరలి వచ్చిన తర్వాత గార సత్యం కూడా ఇక్కడకు వచ్చేశారు. ఆయన భార్య నాలుగేళ్ళ క్రితం కన్నుమూశారు. వీరికి పిల్లలు లేరు. బంధువులు ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలా కాలం పాటు బౌద్థ నగర్ లో ఒంటరి జీవితాన్ని గడిపారు. సినిమా రంగానికి దూరమైన తర్వాత కొన్ని టీవీ సీరియల్స్ కథా చర్చల్లో పాల్గొంటూ కాలం గడిపారు. పలు సీరియల్స్ కు స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో సీనియర్ రైటర్ బ్నిం (Bnim) సూచన మేరకు సుమ (Suma), రాజీవ్ కనకాల (Rajeev Kanakala) సహకారంతో గార సత్యం ఈ యేడాది జనవరిలో కూకట్ పల్లి సమీపంలోని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరారు. నాలుగు రోజులుగా ఆరోగ్యం బాగోకపోవడంతో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు వైద్యులకు చూపించారు. వయసుతో ఏర్పడిన శారీరక సమస్యలతో గార సత్యం సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. పంజాగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.


గార సత్యం మృతి పట్ల 'మనం సైతం' వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్‌ (Kadambari Kiran), తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ (Veerasankar), బ్నిం తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. దర్శకుల సంఘం నుండి ప్రతినెలా ఆయనకు పెన్షన్ అందచేసేవారమని వీరశంకర్ తెలిపారు. మనం సైతం సంస్థ ద్వారా ఆయనకు అండగా ఉండే ప్రయత్నం చేశామని, తనను సొంత కొడుకులా ఆయన భావించే వారని కాదంబరి కిరణ్ చెప్పారు.

Updated Date - Sep 29 , 2025 | 02:13 PM