Suresh Babu: ఆ వార్తల్లో వాస్తవం లేదు....
ABN, Publish Date - Nov 22 , 2025 | 03:58 PM
రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్ కు జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారనే వార్త రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో వాస్తవం లేదన్న రామానాయుడు స్టూడియోస్ తాజాగా వివరణ ఇచ్చింది.
గత రెండు రోజులుగా మీడియాలో ఒక వార్త విశేషంగా చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ లోని ప్రతిష్ఠాత్మకమైన అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios), రామానాయుడు స్టూడియోస్ (Ramanaidu Stories) కు జీహెచ్ఎంసీ (GHMC)పన్నుల విషయమై నోటీసులు ఇచ్చిందన్నది దాని సారాంశం. ఈ రెండు సంస్థలు వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులను ఎగవేసినట్టు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజును చెల్లించాలంటూ వారికి జూబ్లీ హిల్స్ సర్కిల్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయమై రామానాయుడు స్టూడియోస్ సంస్థ వివరణ ఇచ్చింది.
రామానాయుడు స్టూడియోస్ (సురేశ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్) జీహెచ్ఎంసీ జారీ చేసిన డిమాండ్ నోటీసుల ప్రకారం ట్రేడ్ లైసెన్స్ ఫీజును క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని తెలిపింది. ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజు విధించే అధికారం జీహెచ్ఎంసీకి ఉందని తాము అంగీకరిస్తున్నామని, చట్టపరమైన అన్ని వ్యవహారాలలో సంబంధిత అధికారులకు ఎప్పుడూ సహకరిస్తున్నామని చెప్పింది. జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం తమ ప్రాపర్టీ టాక్స్ ను గత కొన్నేళ్ళుగా 68, 276 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతానికి చెల్లిస్తున్నామని, ఈ విషయంలో తామెప్పుడూ తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ ఎలాంటి దాటవేతకూ పాల్పడలేదని రామానాయుడు స్టూడియోస్ ఆ లేఖలో పేర్కొంది.
అయితే ఈ యేడాది జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ ఫీజును సంవత్సరానికి రూ. 7,614 నుండి ఒక్కసారిగా రూ. 2,73,104కు పెంచిందని, దానిని కూడా తాము చెల్లించామని తెలిపింది. ఇంత భారీ మొత్తంలో పెరుగుదల అనేది చాలా క్లిష్టమైందని, న్యాయసమ్మతంగా దీనిని పునః సమీక్షించాలని తాము కోరుతున్నామని ఆ లేఖలో పేర్కొంది. దీనిని జీహెచ్ఎంపీ అధికారులు పరిగణనలోకి తీసుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. నిర్మిత ప్రాంతంపై అధికారులకు, తమకు మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదని, అలానే అపార్థాలకూ తావు లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఊహాగానాలు పూర్తిగా అసత్యమైనవని, వాస్తవాలు కాదని రామానాయుడు స్టూడియోస్ సంస్థ తెలిపింది. రామానాయుడు స్టూడియోస్ జీహెచ్ఎంసీ నిబంధనలను పూర్తిగా పాటిస్తుందని, అలానే అధికారులతో పారదర్శకతతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చింది. మరి ఈ వివరణపై జీహెచ్ఎంసీ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read: Nandamuri Balakrishna: అఖండ -2 టిక్కెట్ హైక్ ఉందా... లేదా...
Also Read: Bhatti Vikramarka: ఏయన్నాఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు...