Ram Charan: మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
ABN, Publish Date - Oct 11 , 2025 | 06:46 PM
న్యూఢిల్లీలో జరిగిన తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయవంతమైన సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
భారత్ లో మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఎపిఎల్) న్యూఢిల్లీలో జరిగింది. మొత్తం ఆరు జట్లలో నలభై ఐదు మంది విలువిద్య నిపుణులు పాల్గొన్నారు. భారత్ నుండి 36 మంది పాల్గొనగా, 12 మంది వివిధ దేశాల నుండి వచ్చారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కు రామ్ చరణ్ (Ram Charan) బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడు. ఈ సందర్భంగా విలువిద్యకు భారత దేశ సాంస్కృతికి ఉన్న సంబంధాలను రామ్ చరణ్ వివరించాడు. విశేషం ఏమంటే... రామ్ చరణ్ 'ట్రిపుల్ ఆర్' (RRR) మూవీలోని పతాక సన్నివేశంలో విలువిద్యతోనే ఆంగ్లేయుల మదం అణిచే సన్నివేశంలో నటించాడు.
ఇదిలా ఉంటే... శనివారం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన (Upasana) కలిశారు. 'అనిల్ కామినేని నేతృత్వంలో జరిగిన తొలి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపామ'ని రామ్ చరణ్ అన్నారు. ఆర్చరీ వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా నిలుపుకోవడానికి ప్రధాని ఇచ్చిన మార్గదర్శకత్వం, విలువైన సలహాలు తమకెంతో ఉపయోగపడ్డాయని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ అద్భుతమైన క్రీడలో మరెందరో పాల్గొనాలని తాము కోరుకుంటున్నామని, మాససిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని రామ్ చరణ్ తెలిపాడు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు మోదీతో దిగిన ఫోటోలను వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు వీరికి అభినందనలు తెలుపుతున్నారు.