Raghavan Studio: సరికొత్త టెక్నాలజీతో రికార్డింగ్ థియేటర్
ABN, Publish Date - Jul 26 , 2025 | 03:23 PM
ఇవాళ హైదరాబాద్ లో రికార్డింగ్ థియేటర్లు తామరతంపర్ల మాదిరి విస్తరించాయి. అయితే ఇవన్నీ పంజాగుట్ట, అమీర్ పేట, కృష్ణనగర్, ఫిల్మ్ నగర్ వైపే ఎక్కువ ఉన్నాయి. దాంతో సిటీకి అటుపక్కగా అంబర్ పేట లో రాఘవన్ రికార్డింగ్ స్టూడియో ఒకటి ప్రారంభమైంది.
ఆర్కెస్ట్రా ఫీల్డ్ లో దాదాపు పాతికేళ్ళ అనుభవం ఉన్న రాఘవన్ (Raghavan) పదిహేను సంవత్సరాల క్రితం స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా రేలంగి నుండి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ కింగ్ కోఠీ మ్యూజిక్ కాలేజీలో శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ఆ అనుభవంతో కొన్ని పాటలను స్వరపర్చడంతో పాటు కొన్ని గీతాలను రాశారు కూడా. సంగీత రంగంలో ఉన్న అనుబంధంతో రాఘవన్ తాజాగా 'రాఘవన్ స్టూడియో మల్టీఫంక్షనల్' (Raghavan Studio Multifuncional) పేరుతో అంబర్ పేట్ లో ఓ రికార్డింగ్ స్టూడియోను ప్రారంభించారు.
శుక్రవారం జరిగిన రాఘవన్ స్టూడియో ప్రారంభోత్సవంలో సంగమం ఫౌండేషన్ సంజయ్ కిశోర్ (Sanjay Kishore), సంగీత కళాశాల అధ్యాపకురాలు లావణ్య లత (Lavanya Latha), భీమవరం సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు చక్రవర్తి, ప్రముఖ బిల్డర్, పొలిటీషియన్ వేణు గోపాల్ తదితరులు హాజరై రాఘవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన స్టూడియోలో ఉన్న ఫెసిలిటీస్ గురించి రాఘవన్ మాట్లాడుతూ, 'డబ్బింగ్, రికార్డింగ్ తో పాటు డాన్స్ ప్రాక్టీస్ కు ఆస్కారం ఉండేలా స్టూడియోను నిర్మించామ'ని చెప్పారు. ఇందులో ఉన్న ఆడిటోరియంలో బర్త్ డే పార్టీస్ జరుపుకునే ఆస్కారం ఉందన్నారు. ఈవెంట్స్, స్టాండప్ కామెడీ షోస్ కూడా ఇందులో చేసుకోవచ్చని తెలిపారు.