సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhandoraa: శివాజీ వ్యాఖ్య‌లు.. ర‌చ్చ మొద‌లు! రంగంలోకి చిన్మ‌యి, అన‌సూయ‌

ABN, Publish Date - Dec 23 , 2025 | 12:52 PM

దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలపై నిరసన సెగ మొదలైంది. చిన్మయి శ్రీపాద, అనసూయ భరద్వాజ్ వంటి వారు శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Dhandoraa Movie

సీనియర్ నటుడు శివాజీ (Shivaji) 'దండోరా' (Dhandoraa) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్లు డ్రస్ సెన్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా రంగంలో సెగలు రేపుతున్నాయి. నిదానంగా ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి విషయాలలో చురుకుగా స్పందించే గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఠక్కున రియాక్ట్ అయ్యింది.

గతంలో తన మీద చేసిన వ్యాఖ్యలను కూడా చిన్మయి గుర్తు చేస్తూ... 'ఇక్కడ ఆడదిగా పుట్టటం ఒకరకమైన కర్మ. ఆ కర్మను భరించాల్సిందే. తప్పదు. ఇక్కడి ఆడవాళ్లకి ఆల్ ద బెస్ట్ చెప్పడం కూడా ప్రయోజనం లేదు. ప్రారబ్ధ కర్మ. భరించి తీరాల్సిందే అంతే' అంటూ తన బాధను వ్యక్తం చేసింది. అలానే మరో ట్వీట్ లో శివాజీని ఉద్దేశించి, 'ఆయన మూవీ ప్రమోషన్ ఫంక్షన్ లో మాట్లాడిన పదాలు చాలా దారుణంగా, అభ్యంతరకరంగా ఉన్నాయి. ఏ రకంగానూ వాటిని అంగీకరించలేం' అని తెలిపింది. ఆయన తనకు ఇష్టమైన దుస్తులు ధరించవచ్చు, కానీ మహిళల దుస్తుల విషయంలో మాత్రం ఆంక్షలు పెడుతుంటారు. నిజంగా భారతీయ సంస్కృతి పట్ల గౌరవం ఉంటే, ఆయన కూడా ధోవతి ధరించి, నుదుట బొట్టు పెట్టుకోవాలి, అలానే కాళ్ళకు మెట్టెలు ధరించి, వివాహితుడినని చూపించాలి' అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సైతం తన అభిప్రాయాన్ని స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. 'ఇట్స్ మై బాడీ, నాట్ యువర్స్' అంటూ పోస్ట్ చేసింది. ఎక్కడా శివాజీ పేరు మెన్షన్ చేయకపోయినా... ఇది ఆయన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అనే అనుకోవాలి.

ఇదిలా ఉంటే... దర్శకుడు, నటుడు తరుణ్‌ భాస్కర్ సైతం శివాజీ వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఎవరి ఆలోచనలు, ఎవరి భావాలు వారికి ఉంటాయని, 'ఇలానే ఉండాల'ని చెప్పడం సరైనది కాదని అన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరి అభిరుచికి తగ్గట్టుగా, ఎవరికి నచ్చిన వేషధారణలో వారు ఉంటారని ఆయన పరోక్షంగా శివాజీ వ్యాఖ్యలను ఖండించారు.

అయితే కొందరు శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు తీవ్రంగా విమర్శించారు. హీరోయిన్ల దుస్తుల గురించి శివాజీ మాట్లాడటం సరికాదని కొందరు అంటుంటే... అలాంటి వేదికపై ఇలా మాట్లాడటం సరికాదని మరి కొందరు చెబుతున్నారు. చిన్మయి లాంటి వారు శివాజీని విమర్శించే క్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారని మరికొందరు వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. మరో రెండు రోజుల్లో జనం లోకి రాబోతున్న 'దండోరా'కు మంచి పబ్లిసిటీనే ఈ రూపంలో లభిస్తోంది.

Updated Date - Dec 23 , 2025 | 01:12 PM