Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ పై కె. ఎస్.ఆర్. ఏమన్నారంటే...

ABN , Publish Date - May 15 , 2025 | 06:11 PM

సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు థియేటర్ రెంటల్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలను పర్సంటేజ్ పై ఆడితేనే చిన్న సినిమాలు, థియేటర్లు బతుకుతాయని అన్నారు.

అశ్విన్ బాబు (Ashwinbabu) హీరోగా రూపుదిద్దుకున్న చిత్రం 'వచ్చిన వాడు గౌతమ్' (Vachina Vaadu Goutham). ఈ సినిమా టీజర్ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీనియర్ నిర్మాత కె.ఎస్. రామారావు (K.S. Ramarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ రెంట్స్ కారణంగా సినిమాలు చచ్చిపోతున్నాయని, చిన్న సినిమాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని వాపోయారు. సినిమా ఎంత బాగున్నా... థియేటర్ కు వెళ్ళి చూద్దామనుకునే లోపు రెంట్ చెల్లించలేక సినిమాను ఎత్తేస్తున్నారని అన్నారు. చిన్న సినిమాల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. ఈ సమయంలో సునీల్ నారంగ్, 'దిల్' రాజు, సురేశ్‌ బాబు లాంటి వారు కలిసి ఓ సిండికేట్ గా ఏర్పడి పర్సెంటేజ్ సిస్టమ్ లో సినిమాలను ప్రదర్శిస్తామని ముందుకు రావడం హర్షించదగ్గదని తెలిపారు. వారితో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా చేతులు కలిపితే బాగుంటుందని అన్నారు.


ఎలాగైనా థియేటర్లను నిలబెట్టుకోవాలని, అవి లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేనట్టేనని కె.ఎస్. రామారావు అభిప్రాయపడ్డారు. జనాలు రెండు మూడు వారాలు ఓపిక పడితే... ఓటీటీలో సినిమా వచ్చేస్తుంది కాబట్టి అక్కడ చూడొచ్చని అనుకుంటున్నారని, కానీ అలాంటి కక్కుర్తికి లోను కావద్దని ఆయన కోరారు. ఇంటిల్లిపాది టీవీలో సినిమా చూసేయొచ్చనే ఆలోచన కరెక్ట్ కాదని అన్నారు. వంటగదిలోంచి అటూ ఇటూ తిరుగుతూ సినిమా చూడటం వల్ల ఫీల్ కలగదని, థియేటర్లో తోటి ప్రేక్షకులతో కలిసి చూస్తే కలిగే అనుభూతే వేరని అన్నారు. దయచేసి దానిని మిస్ చేసుకోవద్దని ఆయన ప్రేక్షకులను కోరారు.


ఒకప్పుడు థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడేవని, రికార్డులు సృష్టించేవని కానీ ఇప్పుడు ఆ కళ కనిపించడం లేదని చెప్పారు. ఇవాళ రికార్డులను కూడా కేవలం కలెక్షన్స్ తో కొలుస్తున్నారని, అందులోనూ అబద్ధ ప్రచారమే ఉంటోందని వాపోయారు. థియేటర్లను నిలబెట్టుకోవడానికి ఇటు నిర్మాతలు, పంపిణీదారులతో పాటు ప్రజల కూడా చొరవ చూపించాలని అన్నారు. సినిమా అనేది థియేటర్ల కోసం తీసిందనే విషయాన్ని అందరూ గుర్తించాలని కోరారు. నిర్మాతలంతా సిండికేట్ గా ఏర్పడి సినిమాను బ్రతికించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రముఖులు కూడా ఈ విషయమై ఆలోచన చేయాలని కె.ఎస్. రామారావు చెప్పారు.

Also Read: Marana Mass OTT Review: ఓటీటీకి వ‌చ్చేసిన.. బ‌సిల్ జోసెఫ్ వెరైటీ డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్! ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 15 , 2025 | 06:11 PM