Oscar Entry: సక్సెస్ మూవీస్ ను పక్కన పెట్టి 'హోమ్ బౌండ్'కు ఓటు...

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:27 PM

తెలుగు సూపర్ హిట్ చిత్రాలను పక్కన పెట్టి ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఇండియా నుండి 'హోమ్ బౌండ్' సినిమాను ఎంపిక చేసింది. 'పుష్ప-2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, కుబేర, గాంధీతాత చెట్టు' తెలుగు నుండి ఆస్కార్ ఎంట్రీకి పోటీ పడ్డాయి.

Home Bound Movie

ఈసారి భారతదేశం నుండి ఆస్కార్ (Oscar) నామినేషన్ ను 'హోమ్ బౌండ్' (Home Bound) చిత్రం ఎంపికైంది. దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన మొత్తం 24 సినిమాలను పరిశీలించిన సెలక్షన్ కమిటీ త్వరలో జనం ముందుకు రాబోతున్న 'హోమ్ బౌండ్'కు ఓటేసింది. ఈ విషయాన్ని కమిటీ ఛైర్మన్ ఎన్. చంద్ర (N Chandra) తెలిపారు.


ఈసారి ఆస్కార్ కు ఇండియా నుండి నామినేషన్ అర్హత సంపాదించడం కోసం మహా మహా చిత్రాలే పోటీ పడ్డాయి. అందులో తెలుగు సినిమాలు 'పుష్ప -2 (Pushpa -2), సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam), కన్నప్ప (Kannappa), గాంధీతాత చెట్టు, కుబేర (Kubera)' కూడా ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమా గత యేడాది దేశంలోనే అత్యధిక కలెక్షన్స్ ను వసూలు చేసిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ బరిలో రికార్డ్స్ సృష్టించిన ఈ సినిమా సెలక్షన్ కమిటీ పక్కన పెట్టేసింది. అలానే విక్టరీ వెంకటేశ్ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా పొంగల్ బరిలో నిలిచి, ఏకంగా మూడు వందల కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. వినోదాల విందు పంచిన ఈ సినిమాను కూడా వారు లెక్కలోకి తీసుకోలేదు. మంచు విష్ణు నటించిన 'కన్నప్ప', శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'కుబేర' చిత్రాలది అదే పరిస్థితి. అలానే దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి నటించిన 'గాంధీతాత చెట్టు'ను కూడా కమిటీ పట్టించుకోలేదు. ఈ సినిమాలోని నటనకు గానూ సుకృతి ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారాన్ని అందుకోబోతోంది.


దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అనుపమ్ ఖేర్ స్వీయ దర్శకత్వంలో 'తన్వీ: ది గ్రేట్' (Tanvi The Great) మూవీని నిర్మించారు. ఈ సినిమా కూడా బరిలో నిలిచింది కానీ ఆస్కార్ ఎంట్రీని మాత్రం దక్కించుకోలేకపోయింది. దీనితో పాటు హిందీ నుండి అభిషేక్ బచ్చన్ 'ఐ వాంట్ టు టాక్', మిధున్ చక్రవర్తి 'ది బెంగాల్ ఫైల్స్', అక్షయ్ కుమార్ 'కేసరి -2', 'సూపర్ బాయ్స్ ఆఫ్‌ బాలేగావ్', 'హ్యూమన్స్ ఇన్ ద లూప్', 'జుగ్నుమా', పూలే', 'ప్యారే' సినిమాలు పోటీ పడ్డాయి. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జైత్వా నటించిన 'హోమ్ బౌండ్'కు కమిటీ ఓటు వేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 26న విడుదల కాబోతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఇది ప్రదర్శితమైంది. ఈ సినిమాలతో పాటే కన్నడ సినిమా 'వీర చంద్రహాస', ఆరు మరాఠీ చిత్రాలు, ఓ మణిపురి సినిమా, ఒక సైలెంట్ మూవీ కూడా పోటీ పడ్డాయి. మరి ఆస్కార్ నామినేషన్స్ జాబితాలో 'హోమ్ బౌండ్' నిలుస్తుందో లేదో చూడాలి.

Also Read: Mohal Lal: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

Also Read: Actress Hema: మీ అక్కను బాడీ షేమింగ్ చేస్తుంటే ఏం చేస్తున్నావ్ మంచు విష్ణు

Updated Date - Sep 20 , 2025 | 07:43 PM