Murali Mohan: మురళీ మోహనా... మజాకా...

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:53 PM

ప్రముఖ నటుడు మురళీమోహన్ 85 సంవత్సరాల వయసులో ఫిట్ నెన్ ఫ్రీక్ గా మారారు. ఆయన వ్యాయామం చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Murali Mohan fitness

ప్రముఖ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త, విద్యాదాత మురళీమోహన్ కు ప్రస్తుతం 85 సంవత్సరాలు. అవకాశం ఇవ్వాలే కానీ ఇప్పటికీ ఆయన సినిమాల్లో నటించడానికి 'సై' అంటారు. ఆ మధ్య ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ఓ సినిమా రూపొందించబోతున్నారని తెలిసి... మురళీమోహన్ ఇంతవరకూ తాను ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటించలేదని, ఆయన ఛాన్స్ ఇస్తే నటిస్తానని బహిరంగంగానే అడిగారు. కొంతమంది మీరు ఛాన్స్ ఇవ్వడమేమిటీ? అని ప్రశ్నిస్తే... జీవితాంతం నటుడుగా కొనసాగాలన్నది నా కోరిక. నా వయసు రీత్యా నేను రిటర్మెంట్ తీసుకున్నానని కొందరు అనుకోవచ్చు. అలాందేమీ లేదు నేను మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నాను. సో... ఛాన్స్ ఇవ్వమని అడగడంలో తప్పేముంది... నేను అడుగుతోంది డబ్బుల కోసం కాదు కదా' అని ఆయన బదులిచ్చారు. మురళీమోహన్ గారి యాక్టివ్ నెస్ చూసి అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి తమ తదుపరి చిత్రంలో తప్పకుండా పాత్ర ఇస్తామని మాట ఇచ్చారు. ప్రస్తుతం వారి కొత్త సినిమా మొదలైంది. అందులో మరి మురళీమోహన్ ఏ పాత్ర చేస్తున్నారో చూడాలి.


ఇదిలా ఉంటే... మురళీమోహన్ ప్రతి రోజూ పదివేల అడుగులు వేయడం అలవాటు చేసుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా... రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఆయన ఆ టాస్క్ ను పూర్తి చేసి కానీ పడుకోరు. ఇది చాలామందికి తెలిసిందే. అయితే చాలామందికి తెలియని మరో బిగ్ టాస్క్ ను కూడా ఆయన అమలు చేస్తున్నారు. అదేమిటంటే... ఈ వయసులోనూ జిమ్ కు వెళ్ళి క్రమ పద్థతిలో ఆయన వ్యాయామం చేస్తారు. వెయిట్స్ వెత్తడంతో పాటు జాయింట్ స్టెబిలిటీ ఎక్సర్ సైజెస్ చేస్తారు. ఈ విషయాన్ని టోనబాలిక్ ఫిట్ నెస్ సెంటర్ ఓ వీడియో ద్వారా తెలియచేసింది. దాని నిర్వాహకులు మురళీమోహన్ ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను జత చేస్తూ, వృద్ధులందరికీ మురళీమోహన్ ఓ చుక్కానిలా నిలిచారని ఉదహరించారు.

తమను కలిసిన చాలామంది 65 సంవత్సరాల వయసులోనూ తాము ప్రతి రోజూ గంటసేపు నడుస్తామని, మనవళ్ళను పార్కుకు తీసుకెళతామని, వారంలో ఐదారు రోజుల పాటు యోగా చేస్తామని చెబుతుంటారని చెప్పారు. కొందరు మహిళలు తాము ఈ వయసులో ఈత కొడుతున్నామని, చెబితే మరికొందరు రోజూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తున్నామని చెప్పేవారని అన్నారు. అయితే... వీటితో పాటు వృద్ధులు తప్పనిసరిగా యాంటీ-ఏజింగ్ పనులు చేయాలని, జాయింట్ స్టెబిలిటీ వర్క్ చేయాలని, కండరాలు, సాఫ్ట్ టిష్యూలను బలోపేతం చేస్తూ, బాడీ బాలన్స్ వర్క్ చేయాలని టోనబాలిక్ ఫిట్ నెస్ సెంటర్ నిపుణులు తెలిపారు. 85 సంవత్సరాల వయసులో మురళీమోహన్ గారు వీటన్నింటినీ చేస్తారని, తన తరం వారికి ఆయన ఈ వర్కౌట్స్ తో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

జిమ్ కు హాజరు కాకుండా ఉండటానికి వంకలు వెతుక్కునేవారు మురళీమోహన్ గారు చేసే వ్యాయామాన్ని చూస్తే స్ఫూర్తి పొందడం ఖాయమని చెబుతూ, వృద్ధులు ఇతరుల కంటే ఎక్కువగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ నేర్చుకోవడం ద్వారా ఎంతో లాభపడతారని అన్నారు. వ్యాయామంపై నమ్మకం, నిరంతర కృషి ఉంటే... వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య అని మురళీమోహన్ నిరూపించారని కొనియాడారు.

Also Read: Akkineni: నాన్న తమిళ చిత్రం... కొడుకు తమిళ డైరెక్టర్ తో చిత్రం...

Also Read: Thursday Tv Movies: గురువారం, Oct 9.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Updated Date - Oct 08 , 2025 | 07:12 PM