Mahesh babu: ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు కొత్త కళ.. త్వ‌ర‌లో మహేశ్ బాబు మల్టీప్లెక్స్ ప్రారంభం

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:32 AM

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేశ్ బాబు, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి నిర్మిస్తున్న ఎ.ఎం.బి. క్లాసిక్ సినిమాస్ నిర్మాణం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. 2026 సంక్రాంతికి ఇది ప్రారంభమౌతుందని తెలుస్తోంది.

AMB Classic cinemas

ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) ... ఫిల్మ్ ఎగ్జిబిషన్ రంగంలోకి అడుగుపెట్టి చాలా సంవత్సరాలే అయ్యింది. ఇప్పటికే చిత్ర నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్న మహేశ్ బాబు... ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ (Sunil Narang) తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో 'ఎ.ఎం.బి.' (AMB) మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న హై టెక్నికల్ స్టాండర్డ్స్ దృష్యా సాధారణ ప్రేక్షకులే కాదు... సినిమా జనం సైతం అక్కడే సినిమాను చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే... హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ తో సినిమా వాళ్ళకు ప్రత్యేక అనుబంధం ఉంది.

మహేశ్ బాబు కు అయితే మరీనూ! తన సినిమాలను వీలైనంత వరకూ మొదటి రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎం. ఎం.లో చూడటానికి మహేశ్ ఇష్టపడుతుంటాడు. పైగా ఆ థియేటర్ లో మహేశ్ బాబు సినిమాలు సృష్టించిన రికార్డులను మరే సినిమా హీరో క్రాస్ చేయలేకపోయాడు. అయితే సుదర్శన్ 70 ఎం.ఎం. థియేటర్ ను కొన్నేళ్ళ క్రితం మూసేశారు. అక్కడ ఇప్పుడో షాపింగ్ కాంప్లెక్స్ వెలిసింది. అందులోనే మహేశ్ బాబు, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ కలిసి తమ రెండో మల్టీప్లెక్స్ వెంచర్ 'ఎ.ఎం.బి. క్లాసిక్ సినిమాస్' ను ప్రారంభించారు. 7 స్క్రీన్స్ ఉన్న ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం తుది దశకు చేరుకుంది.

amb


తాజా సమాచారం ప్రకారం ఆర్.టి.సి. క్రాస్ రోడ్ (RTC X Roads) లోని 'ఎ.ఎం.బి. క్లాసిక్ సినిమాస్' సంక్రాంతికి ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ లో వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు అనేకం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలానే మహేశ్ బాబు నటించిన పలు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. అయితే ఈ సంక్రాంతికి మాత్రం మహేశ్ బాబు కొత్త సినిమా ఏదీ రావడం లేదు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాజమౌళి (Rajamouli) సినిమా సైతం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా తెలియదు. ఈ నేపథ్యంలో సంక్రాంతికి మహేశ్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్లు ప్రారంభం కావడం అభిమానులను ఒక్కింత నిరాశకు గురి చేసే అంశమే.

amb

అయితే... ఇప్పుడు రీ-రిలీజ్ హంగామా సాగుతోంది కాబట్టి... మహేశ్ బాబు 'ఎ.ఎం.బి. క్లాసిక్ సినిమాస్'లోని ఏదైనా ఒక స్క్రీన్ ను మహేశ్ బాబు నటించిన పాత సూపర్ హిట్ మూవీతో మొదలు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సినిమా రంగానికి అడ్డాగా చెప్పుకునే ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ లో ప్రతిష్ఠాత్మకమైన సినిమా థియేటర్లు చాలానే ఉన్నాయి. అయితే ఆ చౌరస్తాలో ఇంతవరకూ మల్టీప్లెక్స్ థియేటర్ ను ఎవరూ ప్రారంభించలేదు. అది మహేశ్ బాబు, సునీల్ నారంగ్ దే కావడం విశేషం. గతంలో ఓడియన్ థియేటర్ ను కూలగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నప్పుడు అక్కడ మల్టీప్లెక్స్ వస్తుందనే ప్రచారం జరిగింది. వాటి నిర్మాణం కూడా పూర్తయ్యిందని, త్వరలోనే ఇవీ ప్రారంభమౌతాయని తెలుస్తోంది. మరి నిత్యం కొత్త సినిమాలతో కళకళలాడే ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ ఇకపై మల్టీప్లెక్స్ థియేటర్ లతో సినిమా అభిమానులతో మరింత సందడిగా ఉంటుందేమో చూడాలి.

Also Read: Samantha: వెట్రిమార‌న్ యూనివ‌ర్స్.. శింబు స‌ర‌స‌న‌ స‌మంత‌

Also Read: Mrunal Thakur: ఇదేం ఫొటోషూట్ రా.. బోల్డ్ అవ‌తారంలో మృణాల్

Updated Date - Oct 07 , 2025 | 11:57 AM