Laalo: ఇదెక్కడి.. ఊచకోతరా మామ! యాభై లక్షల సినిమా.. 100 కోట్లు కొల్లగొట్టింది
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:16 PM
గుజరాతీ సినిమా 'లాలో: కృష్ణ సదా సహాయతే' వంద కోట్ల క్లబ్ లో చేరింది. కేవలం యాభై లక్షలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా గుజరాతీ భాషా చిత్రాలలో అత్యధిక వసూళ్ళు చేసిన సినిమాగా నిలిచింది.
గుజరాతీ చిత్రసీమ చాలా చిన్నది. అక్కడి సినిమాలు సైతం తక్కువ బడ్జెట్ తోనే రూపుదిద్దుకుంటాయి. విశేషం ఏమంటే... పరిమితమైన బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలే అక్కడ అప్పుడప్పుడూ అద్భుతాలు సృష్టిస్తుంటాయి. తెలుగులోనూ కొన్ని గుజరాతీ సినిమాలు రీమేక్ అయిన సందర్భాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే... కేవలం యాభై లక్షలతో నిర్మితమైన ఓ గుజరాతీ సినిమా ఇప్పుడు వంద కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. గుజరాతీ భాషలో వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా పేరు 'లాలో: కృష్ణ సదా సహాయతే' (Laalo – Krishna Sada Sahaayate) !
రిక్షాపుల్లర్ లాలో కథ ఇది. తేలికగా డబ్బు సంపాదించాలనే కోరికతో అడ్డదారులు తొక్కిన లాలో ఓ ఫామ్ హౌస్ లో బందీ అవుతాడు. అక్కడ నుండి బయటపడలేక నానా తిప్పలు పడతాడు. ఆ సమయంలో అతనికి జ్ఞానోదయం అవుతుంది. అతను సేవించిన కృష్ణ పరమాత్మ సాయంతో రిక్షాపుల్లర్ ఎలా ఆ ఫామ్ హౌస్ నుండి బయటపడి తన కుటుంబాన్ని చేరకున్నాడన్నదే ఈ చిత్ర కథ.

దర్శకుడు అంకిత్ సఖియా (Ankit Sakhiya) ఈ సినిమాను కేవలం యాభై లక్షలలో నిర్మించాడు. మొదటి వారం యావరేజ్ టాక్ సంపాదించుకున్న 'లాలో: కృష్ణ సదా సహాయతే' మూవీ ఆ తర్వాత మౌత్ టాక్ కారణంగా కలెక్షన్స్ పెంచుకుంది. అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా వారం వారం ఆదరణ పెంచుకుంటూ యాభై రోజుల దగ్గరకు వచ్చే సరికీ వంద కోట్ల గ్రాస్ ను దాటేసింది.
డిసెంబర్ 5 నుండి ఈ సినిమాను విదేశాలలో ప్రదర్శించబోతున్నారు. కథాబలం ఉన్న చిన్న సినిమాలు సైతం ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొడతాయనడానికి 'లాలో: కృష్ణ సదా సహాయతే' ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రీవా రచ్ (Reeva Rachh), సృహద్ గోస్వామి (Shruhad Goswami), కరణ్ జోషి (Karna Joshi) తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read: King Buddha: హాలీవుడ్ టెక్నీషియన్స్ తో సత్యారెడ్డి ప్రీ షూటింగ్ ట్రిప్