Kamal Haasan: భిన్నత్వంలో ఏకత్వంకు కమల్ హాసన్ జై...
ABN , Publish Date - May 12 , 2025 | 06:52 PM
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆపరేషన్ సిందూర్ పై తన మనసులో మాట తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రాంతీయ, భాషా, సైద్ధాంతిక బేధాలను పక్కన పెట్టి శక్తివంతమైన భారత్ కోసం కృషి చేయాలని అన్నారు.
ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కేవలం సినిమా వ్యక్తి కాదు. అతనో రాజకీయ నాయకుడు కూడా. తనకంటూ కొన్ని సిద్ధాంతాలను పెట్టుకుని, రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ప్రజల ముందుకు వచ్చారు. అయితే ఆశించిన స్థాయిలో వారి నుండి స్పందన లభించకపోవడంతో గత పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు (Tamilnadu) లోని డీఎంకే (DMK) పార్టీకి మద్దత్తు ప్రకటించారు. నిజం చెప్పాలంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, మోదీకి ఆయన కంటిలో నలుసు. మోదీ (Modi) ని విమర్శించే ఆ సందర్భాన్ని ఆయన వదులుకోరు. గడిచిన పదేళ్ళలలో మోదీపై తన ఆగ్రహాన్ని, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను నిర్మొహమాటంగా ఏకీపారేశారు.
సోమవారం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి కమల్ హాసన్ ప్రస్తావిస్తూ, చాలా హుందాగా తన మనసులో భావాలను తెలియచేశారు. శాంతి పట్ల గౌరవంతోనూ, ధైర్యసాహసాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ భారతీయులు మెలగాలనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. భారతదేశాన్ని రక్షించడం కోసం ప్రాణాలు ఒడ్డిన వీర జవాన్లకు కమల్ హాసన్ జోహార్లు అర్పించారు. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలైన జమ్ము - కాశ్మీర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని పౌరులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను కమల్ హాసన్ కొనియాడారు. ప్రాంతం, భాష, సిద్ధాంత వైరుధ్యాలను పక్కన పెట్టి ఇప్పుడు అంతా దేశం కోసం ఒక్కటిగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది విజయోత్సవం జరుపుకునే సమయం కాదని దేశ పునర్ నిర్మాణం దిశగా కృషి చేయాల్సిన సమయమని అన్నారు.
తమిళనాట రాజకీయాలు గత కొంతకాలంగా చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీని అడ్డుకోవడం కోసం ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంటూ ఓ రకమైన వేర్పాటు వాదాన్ని రేకెత్తించడానికి అక్కడి ప్రాంతీయ పార్టీలు గట్టిగా కృషి చేస్తున్నాయి. హిందీని తమ మీద రుద్దుతున్నారని, దానిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని, అవసరం అయితే పోరాటం చేస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భావజాలాలకు, భాషలకు, ప్రాంతీయతకు దూరంగా దేశంలోని అందరూ ఒక్కటిగా నిలబడాలని కమల్ హాసన్ చేసిన సూచన చాలామందికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది.
కమల్ హాసన్ తో మణిరత్నం తెరకెక్కించిన 'థగ్ లైఫ్' చిత్రం జాతీయ స్థాయిలో జూన్ 5న విడుదల కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల ఈ సినిమా ఆడియో వేడుకను కమల్ హాసన్ వాయిదా వేశారు. సోమవారం రాత్రి ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్న తరుణంలో కమల్ హాసన్ ఈ రకంగా జాతీయ వాదాన్ని సమర్థిస్తూ పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
Also Read: Mood Of Thammudu: ‘తమ్ముడు’ సినిమా ఆసక్తి రేకెత్తించేలా వీడియో
Also Read: Pawan Kalyan -OG: ‘ఓజీ’ మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి