సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

2025 Rewind: అభిమానులను వదిలేసి అనంత లోకాలకు..

ABN, Publish Date - Dec 31 , 2025 | 02:20 PM

2025వ సంవత్సరంలో భారతీయ సినీ ప్రముఖులు పలువురు కన్నుమూశారు. చిత్రసీమపై తమదైన ముద్రవేసిన ధర్మేంద్ర, కృష్ణవేణి, రావు బాలసరస్వతి, కోట శ్రీనివాసరావు, ఏవీయం శరవణన్ వంటి వారు కనుమరుగయ్యారు.

2025 actors demise

ఈ యేడాది భారతీయ సినిమా రంగం ప్రముఖులనే కోల్పోయింది. ముఖ్యంగా తెలుగు సినిమా రంగం సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి, నటులు కోట శ్రీనివాసరావు, రచయిత, దర్శకుడు శివశక్తి దత్తా, తొలితరం నేపథ్య గాయని రావు బాలసరస్వతి వంటి వారిని కోల్పోయింది.

జనవరి

2: నటి, నిర్మాత, దర్శకురాలు అపర్ణ మల్లాది (54) కాన్సర్ తో అమెరికాలో కన్నుమూశారు. ఆమె 'ది అనూస్ ఎక్స్ పెరిమెంట్స్, పెళ్ళికూతురు పార్టీ' చిత్రాలను తెరకెక్కించారు.

8: ప్రముఖ జర్నలిస్ట్, మాజీ ఎం.పీ., నిర్మాత ప్రీతీష్‌ నంది (73) గుండెపోటుతో కన్నుమూశారు. 'చమేలీ, ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా, ఆంఖే' వంటి చిత్రాలు ఆయన నిర్మించారు.

9: సీనియర్ సింగర్, యాక్టర్ పాలియాత్ జయచంద్రన్ (80) క్యాన్సర్ లో కన్నుమూశారు. 1986లో ఆయన ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.

11: గీత రచయిత రామ్ పైడిశెట్టి అనారోగ్యంతో కన్నుమూశాడు.

19: తమిళ చిత్ర నిర్మాత మనో అక్కినేని అనారోగ్యంతో మృతి చెందారు. సుధా కొంగరతో ఆమె 'ద్రోహి' సినిమా నిర్మించారు. 'కిరీటం, 13 బి' చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.

20: సీనియర్ నటుడు విజయ రంగరాజు (68) అనారోగ్యంతో చెన్నయ్ లో కన్నుమూశారు. బాపు 'సీతాకళ్యాణం'తో సినిమా రంగంలోకి వచ్చిన ఆయనకు 'భైరవ ద్వీపం, యజ్ఞం, నేటి భారతం, శ్రీకృష్ణార్జున విజయం' వంటి సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.

24: 'పుదుపేట్టై, తేరీ, విక్రమ్ వేద, బిగిల్' వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన జయశీలన్ అనారోగ్య కారణాలతో చెన్నయ్ లో తుదిశ్వాస విడిచారు.

ఫిబ్రవరి

1: తమిళంలో రజనీకాంత్ తో పాటు పలువురు అగ్ర, యువ కథానాయకులతో సినిమాలను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ నటరాజన్ (70) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

4: సీనియర్ నటీమణి పుష్పలత (87) చెన్నయ్ లో కన్నుమూశారు. 1958లో తమిళ చిత్రసీమలోకి నటిగా అడుగుపెట్టిన ఆమె 'నానుమ్ ఒరు పెణ్'లో నటించిన ఏవీఎం రాజన్ ను వివాహం చేసుకున్నారు. దక్షిణాది భాషా చిత్రాలలో నటించిన నటి పుష్పలత కుమార్తె మహాలక్ష్మీ తెలుగులో 'రెండు జళ్ళ సీత, ఆనంద భైరవి' చిత్రాలలో నాయికగా నటించారు.

7: ప్రభు సోలోమన్ తెరకెక్కించిన 'మైనా' సినిమాతో పరిచయమై దానినే ఇంటిపేరుగా మార్చుకున్న సుబ్రమణియన్ కన్నుమూశారు.

16: తొలితరం నటి, గాయని, నిర్మాత, స్టూడియో అధినేత్రి మేకా కృష్ణవేణి (101) అనారోగ్యంతో కన్నుమూశారు. ఎన్టీఆర్ ను 'మనదేశం'తో నటుడిగా పరిచయం చేసింది ఆమెనే. 1940లో మీర్జాపురం రాజావారిని వివాహం చేసుకున్న ఆమె కుమార్తె అనూరాధా దేవి సైతం నిర్మాతగా తెలుగు సినిమా రంగంలో రాణించారు.

25: దర్శక నిర్మాత సుకుమార్ స్నేహితుడు, 'గం గం గణేశా' చిత్ర నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్ లో కన్నుమూశాడు. ఓ పెళ్ళి వేడుకకు హాజరయ్యేందుకు ఆయన అక్కడకు వెళ్ళాడు. ఓ నైట్ పార్టీలో పాల్గొని ఫ్లాట్ కొచ్చిన తర్వాత ఆయన నిద్రలోనే కన్నుమూశారని తెలిసింది. గతంలో రాడిసన్ హోటల్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారిలో కేదార్ కూడా ఉన్నారు.

28: నటి జయప్రద సోదరుడు రాజబాబు (65) అనారోగ్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన 'రాజమండ్రి రోమియోలు, బోరింగ్ పాప' తదితర చిత్రాలలో నటించారు.

మార్చి

1: తన చావుకు డాన్స్ మాస్టర్ అభిలాష్ కారణమంటూ సెల్ఫీ వీడియో తీసి ఖమ్మంకు చెందిన డాన్సర్ శ్రీకళ్యాణి (32) ఆత్మహత్య చేసుకుంది. ఐదు సంవత్సరాలుగా తనని ప్రేమిస్తున్నానని చెప్పి, ఇప్పుడు వేరే యువతిని అతను పెళ్ళి చేసుకోవాలనుకోవడంతో ఇలా చేసినట్టు ఆమె వీడియోలో పేర్కొంది.

16: ప్రముఖ హాస్యనటి బిందూ ఘోష్‌ (76) అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళంతో పాటు ఆమె పలు తెలుగు, మలయాళ చిత్రాలోల హాస్యపాత్రలు పోషించారు. 'దొంగకాపురం, పెళ్ళి చేసి చూడు, కృష్ణగారి అబ్బాయి, ప్రాణానికి ప్రాణం, చిత్రం భళారే విచిత్రం' తదితర చిత్రాలలో ఆమె నటించారు.

17: ప్రముఖ మలయాళ గీత రచయిత మంకొంబు గోపాలకృష్ణన్ (78) అనారోగ్యంతో కొచ్చిలో కన్నుమూశారు. సుమారు 200 చిత్రాలలో ఆయన 700 లకు పైగా పాటలు రాశారు. తెలుగు, హిందీ చిత్రాల తమిళ వర్షన్స్ కు ఆయనే మాటలు, పాటలు రాసేవారు. రాజమౌళి డబ్బింగ్ సినిమాలకు ఆయనే రచయిత.

25: పవన్ కళ్యాణ్ కు కరాటేలో శిక్షణ ఇచ్చిన షిహాన్ హుసైనీ అనారోగ్యంతో (60) చెన్నయ్ లో కన్నుమూశారు. 1986లో విడుదలైన 'పున్నగై మన్నన్'తో ఆయన నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టారు.

25: ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా కుమారుడు మనోజ్ (48) గుండెపోటుతో కన్నుమూశారు. 1999లో ఆయన 'తాజ్ మహల్' చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా నటించి, 2023లో 'మార్గళి తింగల్' మూవీని డైరెక్ట్ చేశారు. మలయాళ నటి అశ్వతి అలియాస్ నందన ను ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు.

30: సీనియర్ నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం (68) అనారోగ్యంతో కన్నుమూశారు. ఇవీవీ సత్యానారాయణ సోదరి భర్త అయిన బ్రహ్మానందం మిత్రులతో కలిసి 'ఆమె, మనోహరం, నేను, ఓ చినదాన, అల్లుడుగారు వచ్చారు' చిత్రాలు నిర్మించారు.

ఏప్రిల్

2: ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ (65) అనారోగ్యంతో కన్నుమూశారు. 'బ్యాట్ మెన్ ఫర్ ఎవర్, టాప్ గన్, ద డోర్స్' తదితర చిత్రాలలో ఆయన నటించారు.

4: సీనియర్ బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ (87) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో 'ఫ్యాషన్' మూవీతో సినిమా రంగంలోకి వచ్చారు. 'ఓ కౌన్ థీ'తో ఆయనకు గుర్తింపు లభించింది. 1965లో 'షహీద్' మూవీలో భగత్ సింగ్ గా నటించారు. అప్పటి నుండి పలు దేశభక్తి చిత్రాలలో ఆయన నటించారు. పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలు ఆయనకు లభించాయి.

4: ప్రముఖ నటుడు రవికుమార్ (75) క్యాన్సర్ తో కన్నుమూశారు. మలయాళ, తమిళ చిత్రాలలో హీరోగా నటించిన ఆయన పలు సీరియల్స్ కూడా చేశారు. తెలుగులో 'అనుబంధం' సీరియల్ లో నటించారు.

5: ఘంటసాల రెండవ భార్య కుమారుడు రవికుమార్ (72) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన దూరదర్శన్, సన్ టీవీ, జయ టీవీలలో ప్రోగ్రామ్ మేనేజర్ గా వర్క్ చేశారు. బేసికల్ గా ఆయన సౌండ్ రికార్డిస్ట్.

13: కలైపులి ఎస్. థానుతో కలిసి పలు చిత్రాలు నిర్మించిన నటుడు, స్క్రీన్ ప్లే రైటర్ జి. శేఖరన్ కన్నుమూశారు.

15: నటుడు శ్రీరామ్ తో కలిసి పలు విజయవంతమైన చిత్రాలలో నటించిన నటుడు, దర్శకుడు ఎస్.ఎస్. స్టాన్లీ (57) అనారోగ్యంతో కన్నుమూశారు.

24: అమెరికాలో స్థిరపడ్డ అలనాటి నటి విజయభాను (68) ఇండియా వచ్చి చెన్నయ్ లో ఉండగా అనారోగ్యానికి గురై కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు వంద చిత్రాలలో ఆమె నటించారు. రాజబాబు సరసన ఆమె నటించిన చిత్రాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అమెరికాలో ఆమె డాన్స్ స్కూల్ ను నిర్వహిస్తున్నారు.

28: ప్రముఖ మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ ఎన్ కరణ్ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. 1976లో 'లక్ష్మీ విజయం'తో ఆయన సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు. 1988లో 'పిరవి'తో దర్శకుడయ్యారు.


మే

4: 'తేనెటీగ, ప్రేమ అండ్ కో, బొబ్బిలివేట, బడి' వంటి సినిమాలను నిర్మించిన జవ్వాజి వెంకట రామారావు (68) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు.

10: ప్రముఖ తమిళ నటుడు 'సూపర్ గుడ్' సుబ్రమణి (58) క్యాన్సర్ తో తుదిశ్వాస విడిచారు.

14: సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ బి.కె. ఈశ్వర్ (76) కన్నుమూశారు. విజయచిత్ర పత్రికలో పనిచేసిన ఆయన పలు టీవీ సీరియల్స్, చిత్రాలకు కథ, మాటలు, పాటలు రాశారు. తన సినిమా అనుభవాలను పుస్తకంగా తీసుకొచ్చారు.

23: హిందీతో పాటు తెలుగులోనూ పలు చిత్రాలలో విలన్ గా నటించిన ముకుల్ దేవ్ (54) అనారోగ్యంతో కన్నుమూశాడు. 1996లో 'దస్తక్' సినిమాలో సుస్మిత సేన్ తో కలిసి నటించిన ముకుల్ దేవ్, 'కృష్ణ, కేడీ, అదుర్స్, ఏక్ నిరంజన్' తదితర చిత్రాలలో నటించాడు. నటుడు రాహుల్ దేవ్ కు ముకుల్ తమ్ముడు.

25: ప్రముఖ రంగస్థల నటుడు, 'బలగం' ఫేమ్ జీవీ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు.

29: దాదాపు 150 తమిళ చిత్రాలలో నటించిన నటుడు రాజేశ్‌ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన పలు టీవీ సీరియల్స్ లోనూ కీలక పాత్రలు పోషించారు.

జూన్

1: రావన్ కొట్టమ్, మద యానై కొట్టమ్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ సుకుమారన్ (47) కార్డియాక్ అరెస్ట్ తో తుదిశ్వాస విడిచారు.

10: ప్రముఖ దర్శకుడు, నటుడు రవికుమార్ చౌదరి గుండెపోటుతో కన్నమూశారు. ఆకాశ్ హీరోగా నటించిన 'మనసుతో' సినిమాతో రవికుమార్ చౌదరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'యజ్ఞం, ఏం పిల్లో ఏం పిల్లడో, వీరభద్ర, పిల్లా నువ్వులేని జీవితం, ఆటాడిస్తా, తిరగబడరా సామి' చిత్రాలను ఆయన రూపొందించారు.

11: సీనియర్ నిర్మాత, ఎ.ఎ. ఆర్ట్స్ అధినేత కె. మహేంద్ర (79) అనారోగ్యంతో గుంటూరులో కన్నుమూశారు. దర్శకత్వ శాఖలోనూ, ప్రొడక్షన్ మేనేజర్ గానూ పనిచేసిన ఆయన 1977లో 'ప్రేమించి పెళ్ళి చేసుకో' సినిమాతో నిర్మాతగా మారారు. కృష్ణ, చిరంజీవి, శ్రీహరి, రాజశేఖర్ తో సినిమాలు నిర్మించారు. 'పోలీస్' చిత్రంతో శ్రీహరిని ఈయనే హీరోగా పరిచయం చేశారు.

14: సినీ, టీవీ నటుడు అల్లం గోపాలరావు (75) అనారోగ్యంతో కన్నుమూశారు. వీరి కుమారుడు అనిల్ కూడా నటుడే.

14: జానపద గాయని, సీనియర్ నటి కొల్లంగుడి కరుప్పాయి (99) అనారోగ్యంతో కన్నుమూశారు.

21: శక్తి పిక్చర్స్ అధినేత ముత్యాల రమేశ్‌ కన్నుమూశారు. మచిలీపట్నంకు చెందిన ఆయన విజయవాడ నవరంగ్ థియేటర్ మేనేజర్ గా పనిచేశారు. 1977లో శక్తి పిక్చర్స్ పెట్టి వెయ్యికి పైగా సినిమాలను పంపిణీ చేశారు.

22: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మేనేజర్ రఘునాథ బాబు హఠాన్మరణం చెందారు.

27: 'కాంటా లగా' వీడియో ఆల్బమ్ తో పాపులారిటీ పొందిన నటి షఫాలీ జరీవాలా (42) గుండెపోటుతో ముంబైలో కన్నుమూసింది.

జూలై

7: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి, శివశక్తి దత్తా (92) అనారోగ్యంతో కన్నుమూశారు. 1932 అక్టోబర్ 8న ఆయన జన్మించారు. తొలి యత్నంగా ఆయన 'పిల్లన గ్రోవి' చిత్రాన్ని నిర్మించారు. గీత రచయితగా పలు చిత్రాలకు పాటలు రాసిన శివశక్తి దత్తా 'అర్థాంగి, చంద్రహాస్' చిత్రాలను డైరెక్ట్ చేశారు. 'కమలేష్‌' పేరుతో ఆయన చిత్రకారుడిగానూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు.

8: సీనియర్ కో-డైరెక్టర్, 'బ్రహ్మండ' చిత్ర దర్శకుడు సండ్రు నాగేశ్‌ అలియాస్ రాంబాబు (47) గుండెపోటుతో కన్నుమూశారు. దాదాపు 150 సినిమాలకు, 60 టీవీ సీరియల్స్ కు ఆయన వర్క్ చేశారు.

13: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) అనారోగ్యంతో కన్నుమూశారు. రంగస్థలం నుండి చిత్రసీమలోకి అడుగుపెట్టిన కోట ఐదు దశాబ్దాల పాటు నట ప్రస్థానం సాగించారు. తొమ్మది నంది అవార్డులు పొందారు. 1999లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

14: ప్రముఖ నటి బి. సరోజా దేవి (87) అనారోగ్యంతో కన్నమూశారు. తన 13వ యేట ఆమె చిత్రసీమలోకి అడుగుపెట్టారు. వివిధ భాషల్లో దాదాపు 200 చిత్రాలలో నటించారు. కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు పొందారు. కర్నాటక ఎఫ్.డి.సి. ఛైర్మన్ గా, కంఠీరవ స్టూడియో ఛైర్మన్ గా బాధ్యతలను నిర్వర్తించారు.

14: తమిళనాడుకు చెందిన ఫైట్ మాస్టర్ మోహన్ రాజ్ అలియాస్ ఎస్.ఎం. రాజు (52) పా. రంజిత్ మూవీలో ఫైట్ సీక్వెన్స్ చేస్తూ కారు బోల్తా కొట్టి చనిపోయారు. ఇది తమిళనాడులోని నాగపట్నంలో జరిగింది.

18: ప్రముఖ హాస్యనటుడు ఫిష్‌ వెంకట్ సుదీర్ఘ అనారోగ్యం తర్వాత కన్నుమూశారు.

18: తమిళ ఫిల్మ్ మేకర్స్, నటుడు, సినిమాటోగ్రాఫర్ వేలు ప్రభాకరన్ (68) సుదీర్ఘకాల అనారోగ్యం కారణంగా చనిపోయారు.

19: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కరుణానిధి మొదటి భార్య పద్మావతి కుమారుడు ముత్తు (77) కన్నమూశాడు. నటుడిగానూ ఆయన కొన్ని చిత్రాలలో నటించాడు.

20: అమితాబ్ బచ్చన్ తో 'డాన్' చిత్రాన్ని రూపొందించిన చంద్రబారోట్ (86) ముంబైలో కన్నమూశారు. ఆయన రూపొందించిన 'డాన్' మూవీ ఆ తర్వాత వివిధ భాషల్లో రీమేక్ అయ్యింది.

ఆగస్ట్

2: ప్రముఖ హాస్యనటుడు మదన్ బాబ్ (71) కన్నుమూశారు. పలు తమిళ చిత్రాలతో పాటు ఆయన తెలుగులోనూ 'బంగారం' చిత్రంలో నటించారు.

18: బాలీవుడ్ సీనియర్ నటుడు అచ్యుత్ పోత్దార్ (90) గుండె సంబంధిత వ్యాధి కారణంగా థానేలోని ఓ ప్రైవేట్ హస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. 'పరిణీత, దబాంగ్ 2, ఫెరారీకి సవారి, త్రీ ఇడియట్స్'తో సహా 125 చిత్రాలలో ఆయన నటించారు.


సెప్టెంబర్

5: సీనియర్ లిరిసిస్ట్ పూవై సెంగుట్టవన్ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన దాదాపు వెయ్యికి పైగా పాటలను రాశారు.

16: ఆస్కార్ అవార్డ్ గ్రహీత, హాలీవుడ్ నటుడు, దర్శక, నిర్మాత రాబర్ట్ రెడ్ ఫోర్డ్ (89) కన్నుమూశారు. ఆరు దశాబ్దాలపాటు హాలీవుడ్ లో రాణించిన రాబర్ట్ రెడ్ ఫోర్డ 1980లో 'ఆర్డినరీ పీపుల్' చిత్రానికి గానూ బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు.

18: ప్రముఖ కథ, మాటల రచయిత, దర్శకుడు ఆకెళ్ళ (75) కన్నుమూశారు. చిరంజీవి హీరోగా విజయ బాపినీడు తెరకెక్కించిన 'మగమహారాజు'కు ఆయన వర్క్ చేశారు. దాదాపు 80 సినిమాలకు రచన చేసిన ఆకెళ్ళ... నరేశ్‌ హీరోగా 'అయ్యయ్యో బ్రహ్మయ్య' సినిమా డైరెక్ట్ చేశారు.

18: తమిళ హాస్యనటుడు రోబో శంకర్ (46) జాండిస్ కారణంగా చెన్నయ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు.

19: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు జుబిన్ గర్గ్ సింగపూర్ లో ప్రమాదవశాత్తు కన్నుమూశారు. ఆయన పలు హిందీ చిత్రాలకు పాటలు పాడారు.

29: దాసరి నారాయణ రావు శిష్యుడు, పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన గార సత్యం అనారోగ్యంతో కన్నుమూశారు.

అక్టోబర్

2: ప్రముఖ రచయిత పరుచూరి నారాయణా చార్యులు (80) గుంటూరులో కన్నుమూశారు. 'కరుణించిన కనకదుర్గ, శ్వేతనాగు' చిత్రాలకు ఆయన కథలను అందించారు. కన్నడలోనూ అంబరీష్‌ నటించిన 'అరణ్య లల్లా, అభిమన్యు' సినిమాలు లల్లాదేవి కథలతోనే రూపొందాయి.

4: ప్రముఖ దర్శకుడు వి. శాంతారాం మూడో భార్య సంధ్య (93) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ఆమె 'ఝనక్ ఝనక్ పాయల్ బాజే, దో ఆంఖే బారా హాథ్‌, నవరంగ్, పింజర' తదితర చిత్రాలలో నటించారు. శాంతారామ్ తన రెండో భార్య జయశ్రీకి విడాకులు ఇచ్చాక సంధ్యను పెళ్ళి చేసుకున్నారు.

11: ఆస్కార్ విజేత, హాలీవుడ్ నటి డయాన్ కీటన్ (79) కన్నుమూశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆమె నటిగా రాణించారు. 'అనీహాల్' సినిమాకు గానూ ఆమె ఉత్తమనటిగా ఆస్కార్ ను అందుకున్నారు.

15: లలిత సంగీత సామ్రాజ్ఞి , తొలితరం నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవి (97) అనారోగ్యంతో కన్నుమూశారు. 1937లో 'బాలయోగిని' చిత్రంలో ఆమె పేరును బాల సరస్వతీ దేవిగా వేశారు. అదే పేరు స్థిరపడిపోయింది. చివరగా ఆమె 1974లో 'సంఘం చెక్కిన శిల్పాలు' చిత్రంలో పాట పాడారు.

15: మహాభారత్ ధారావాహికలో కర్ణుడి పాత్ర పోషించిన పంకజ్ ధీర్ కన్నుమూశారు. పలు టీవీ షోస్ లో ఆయన పాల్గొన్నారు.

20: ప్రముఖ హిందీ నటుడు అస్రానీ (85) కన్నుమూశారు. దాదాపు 350 చిత్రాలలో ఆయన నటించారు. హిందీ, మరాఠీ భాషల్లో ఆయన ఆరు చిత్రాలను డైరెక్ట్ చేశారు. తన సహ నటి మంజును అస్రాని వివాహం చేసుకున్నాడు.

23: సీనియర్ నటీమణి మనోరమ కుమారుడు, నటుడు భూపతి (70) అనారోగ్యంతో కన్నుమూశాడు.

23: సంగీత దర్శక ద్వయం సుబేష్ - మురళీలో ఒకరైన సుబేష్ (68) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు గాయకుడిగానూ మంచి పేరుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవాకు సుబేశ్‌ తమ్ముడు.

25: ప్రముఖ హాస్య నటుడు, బుల్లితెర పాపులర్ ఆర్టిస్ట్ సతీష్‌ షా (74) కన్నుమూశారు. పలు సినిమాలతో పాటు టీవీ ధారావాహికల్లోనూ సతీష్‌ షా హాస్యాన్ని పండించారు.

నవంబర్

6: ప్రముఖ గాయని, నటి సులక్షణ పండిట్ (71) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. బాల గాయనిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆమె 1975లో 'ఉల్జా' చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1970, 80లలో అగ్ర కథానాయకుల సరసన ఆమె నటించారు.

10: ప్రముఖ గీత రచయిత అందెశ్రీ (64) హఠాన్మరణం చెందారు. పలు చిత్రాలకు పాటలు రాయడంతో పాటు అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించారు.

10: తమిళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అభినయ్ క(44) కాలేయ సంబంధిత అనారోగ్యంతో చెన్నయ్ లో చనిపోయారు.

13: సీనియర్ నటీమణి కామినీ కౌశల్ (98) కన్నుమూశారు. 1946 లో చేతన్ ఆనంద్ తెరకెక్కించిన 'నీచనగర్'తో ఆమె చిత్రసీమలోకి అడుగుపెట్టింది. 1940, 50 లలో పలు చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించింది. చెన్నై ఎక్స్ ప్రెస్, కబీర్ సింగ్, లాల్ సింగ్ చద్దాలలో చివరిగా ఆమె నటించారు.

14: ప్రముఖ తమిళ దర్శకుడు, నిర్మాత, టీవీ షోస్ నిర్వాహకుడు వి. శేఖర్ (73) అనారోగ్యంతో కన్నుమూశారు.

17: రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రాధారవి, నాజర్ తదితరులకు నటనలో శిక్షణ ఇచ్చిన చెన్నయ్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కె.ఎస్. నారాయణ స్వామి (92) కన్నుమూశారు. ఆయన దూరదర్శన్ లోనూ డైరెక్టర్ గా సేవలు అందించారు. రజనీకాంత్ ను కె. బాలచందర్ కు పరిచయం చేసింది కె.ఎస్. గోపాలీనే!

21: రవితేజ హీరోగా 'మనసిచ్చాను' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రమోద్ కుమార్ రైలు యాక్సిడెంట్ లో కన్నుమూశారు.

24: బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర (89) అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ఆరున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 300లకు పైగా చిత్రాలలో ఆయన నటించారు. 1952లో ప్రకాశ్‌ కౌర్ ను వివాహం చేసుకున్న ఆయన తోటి నటి హేమమాలిని 1980లో హేమమాలినీని పెళ్ళి చేసుకున్నారు. అలానే 2004లో రాజస్థాన్ బీకనీర్ పార్లమెంట్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.

26: సీనియర్ నిర్మాత, స్వర్గీయ చలసాని గోపీ కొడుకు, టి. త్రివిక్రమరావు అల్లుడు చలసాని రామ బ్రహ్మం చౌదరి (55) అనారోగ్యంతో కన్నుమూశారు. 'నేను ప్రేమిస్తున్నాను, నేటి గాంధీ, సెల్ఫీరాజా' చిత్రాలను ఆయన నిర్మించారు.

30: ప్రముఖ కన్నడ హాస్య నటుడు ఉమేశ్ బెంగళూరులో కన్నుమూశారు. దాదాపు 350 సినిమాల్లో ఆయన నటించారు.

డిసెంబర్

4: ప్రముఖ నిర్మాత, ఏవీఎం స్టూడియోస్ అధినేత ఎవిఎం శరవణన్ (85) కన్నుమూశారు. ఏవీయం సంస్థ 175 సినిమాలను వివిధ భాషల్లో నిర్మించారు. ఏవీ మెయ్యప్పన్ కుమారుడైన శరవణన్ తండ్రి అడుగుజాడల్లో సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్ర నిర్మాతగా, స్టూడియో అధినేతగా కొనసాగారు.

17: కె.డి. చిత్ర దర్శకుడు కిరణ్‌ కుమార్ బ్రెయిన్ డెడ్ కారణంగా కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహించిన 'కె.జె.క్యూ' సినిమా విడుదల కావాల్సి ఉంది.

20: ప్రముఖ మలయాళ నటుడు, దర్శక నిర్మాత శ్రీనివాసన్ (69) కన్నుమూశారు. నాలుగు దశాబ్దాల పాటు ఆయన రెండు వందల చిత్రాలలో నటించి, మెప్పించారు. పలు చిత్రాలకు రచన చేశారు. 'పడక్కునొక్కి యంత్రం'తో దర్శకుడిగా మారారు. ఈ సినిమాకు కేరళ ప్రభుత్వ అవార్డు కూడా లభించింది. ఈయన కుమారులిద్దరూ నటులే.

29: పలు కన్నడ, తమిళ సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించిన నటి నందిని (26) డిప్రషన్ కు లోనై బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో తెలిపారు.

Updated Date - Dec 31 , 2025 | 03:25 PM