Digital Media Federation: డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ గా సుమ
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:11 AM
భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో డి.ఎం.ఎఫ్. డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు విశ్వ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ, యూట్యూబర్ వంశీ కూరపాటి, డిజిటల్ పాపరాజ్జీ మానవ్ మంగ్లానీ అవార్డులు అందుకున్నారు.
హైదరాబాద్‌లోని హెచ్ఐసిసి కన్వెన్షన్ సెంటర్‌లో డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కంటెంట్ క్రియేటర్స్, సినిమా, మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో పాటు కొందరు విశిష్ట ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సినిమాటికా ఎక్స్‌పోతో కలిసి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ (DMF) నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం దేశ డిజిటల్ భవిష్యత్తు రూపురేఖలు మార్చబోయే ఎందరో టాలెంటెడ్ క్రియేటర్స్ ను ఒక చోటకు చేర్చింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా, తెలంగాణ ప్రభుత్వ ఐ అండ్ పి.ఆర్. విభాగం ప్రత్యేక కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఐ.ఎ.ఎస్. పాల్గొని విజేతలకు అవార్డులను ప్రదానం చేసి అనంతరం ప్రసంగింస్తూ 'డిజిటల్ క్రియేటర్స్ అంటే కేవలం వినోదం మాత్రమే అందించేవారు కాదు. వారు విద్యావేత్తలు, ఆలోచింప చేయగల ప్రభావంతులు. అవార్డు గ్రహీతలందరినీ అభినందిస్తున్నాను. మన సంస్కృతి, ఆర్థిక వ్యవస్థలో వారి పాత్రను గుర్తించడానికి ఈ జాతీయ కార్యక్రమానికి నాయకత్వం వహించినందుకు భారత్ డి.ఎం.ఎఫ్.కి అభినందనలు తెలియజేస్తున్నాను' అని అన్నారు.
డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025 ప్రదానం
సినిమా బిజినెస్, బాక్సాఫీస్ విశ్లేషణ, ఇండస్ట్రీ ఎక్సక్లూసివ్ న్యూస్ అందిస్తున్నందుకు గాను బాలీవుడ్ ప్రముఖులు తరణ్ ఆదర్శ్ డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ - ఫిల్మ్ జర్నలిజం అవార్డు అందజేశారు. తెలుగు సినిమా వేదికపై బుల్లితెరపై ప్రేక్షకులను తన యాంకరింగ్ తో ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న తెలుగు యాంకర్ సుమ కనకాలకు డిజిటల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ - ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ 'ఈ అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషకరం. ఈ అవార్డు నాకు ఏంతో స్పెషల్. డిజిటల్ పరంగా మనం ఏంతో అభివృద్ధి చెందవచ్చు, కానీ ప్రేక్షకులతో సంబంధం స్థిరంగా ఉంటుంది' అని వ్యాఖ్యానించారు. డిజిటల్ యుగంలో సెలబ్రిటీ ఫోటో జర్నలిజాన్ని పునర్నిర్వచించినందుకు భారతదేశపు ప్రముఖ బాలీవుడ్ పాపరాజో మానవ్ మంగ్లానీ డిజిటల్ ఐకాన్ - విజువల్ ఇన్‌ఫ్లుయెన్స్ అవార్డును అందుకున్నారు. ఆ సంతోషాన్ని పంచుకుంటూ 'ఇది నాకు మాత్రమే కాదు, డిజిటల్ పాపరాజ్జీ కమ్యూనిటీకి దక్కిన గౌరవం. మేం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రేక్షకులకు అనుగుణంగా కంటెంట్ రూపొందిస్తూనే ఉన్నాం' అని మానవ్ పేర్కొన్నారు. రా టాక్స్ వంశీ కూరపాటి.. పాడ్‌కాస్టింగ్ లో సంచలనం సృష్టించి ఎందరో ప్రముఖుల ఇన్నర్ వాయిస్ ను ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు గాను 'డిజిటల్ ఐకాన్ - పాడ్‌కాస్టింగ్ & యూత్ వాయిస్ అవార్డు' వంశీ కూరపాటి అందుకున్నారు. 'ఈ అవార్డు తమ స్థానిక భాషను, ఎమోషన్స్ ను ప్రజలతో కనెక్ట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతి క్రియేటర్ కు చెందుతుంది. వచ్చేది అంతా డిజిటల్ యుగం' అని వంశీ కూరపాటి భావోద్వేగానికి గురయ్యారు.
ఈ కార్యక్రమానికి భారత్ డిజిటల్ మీడియా ఫెడరేషన్ వ్యవస్థాపకుడు విశ్వ సీఎం నేతృత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ 'ఇది ప్రారంభం మాత్రమే. భారత్ డిఎంఎఫ్ ముఖ్య ఉద్దేశం అన్ని రాష్ట్రాలు, భాషలు, ప్లాట్‌ఫారమ్‌లలో భారతదేశ డిజిటల్ సృష్టికర్తలను ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకురావడం. అవార్డుల నుండి సృష్టికర్త సంక్షేమం వరకు భారతదేశపు మొట్టమొదటి క్రియేటర్ జోన్ ను స్టార్ట్ చేయడం కోసం మేం నేషన్ ఫస్ట్ క్రియేటర్ ఎకోసిస్టమ్ ను బిల్డ్ చేస్తున్నాం' అని అన్నారు. ప్రముఖ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా సంస్థలు, టెక్ భాగస్వాములు హాజరైన ఈ వేడుక, భారత్ డిఎంఎఫ్ జాతీయ అధ్యాయాలకు సంబంధించిన రోడ్ మ్యాప్, ప్రపంచ వేదికలతో సహకారం, నెక్ట్స్ జనరేషన్ క్రియేటర్స్ కోసం సంక్షేమం, శిక్షణ కార్యక్రమాలతో ఘనంగా ముగిసింది.
Also Read: Ilaiyaraaja: కుమార్తె పేరుతో.. ఇళయరాజా కొత్త ‘ఆర్కెస్ట్రా’
Also Read: Prakashraj Comments: నేషనల్ అవార్డులపై ప్రకాశ్‌రాజ్ కీలక వ్యాఖ్యలు..