Film Industry: దర్శక నిర్మాత గిరిబాబు భార్య మృతి
ABN , Publish Date - Jul 11 , 2025 | 09:03 AM
రంగనాథ్ ను 'చందన' సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసిన దర్శక నిర్మాత బండారు గిరిబాబు భార్య సత్యవతి అనారోగ్యంతో కన్నుమూశారు.
తెలుగు, కన్నడ చిత్రాల దర్శకుడు, నిర్మాత బండారు గిరిబాబు (Giribabu) సతీమణి సత్యవతి వృద్ధాప్య సమస్యలతో జులై 5వ తేదీ కన్నుమూశారు. ఈ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నటుడు రంగనాథ్ (Ranganath) ను 'చందన' (Chandana) సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసింది గిరిబాబే! ఆయన 1994లో కన్నుమూశారు. గిరిబాబు, సత్యవతి దంపతుల పెద్ద కుమార్తె కూడా కన్నడలో పలు టీవీ సీరియల్స్ ను, యాడ్ ఫిల్మ్స్ ను తీశారు. ఆవిడ పదేళ్ళ క్రితం చనిపోయారు.
అరకులోయ అందాలను మొట్టమొదట సినిమాలలో ఎక్స్ ప్లోర్ చేసింది గిరిబాబే. ఆయన తెలుగులో 'జీవితం, రత్తాలు రాంబాబు, చందన' చిత్రాలను తీశారు. అలానే 'బొమ్మరిల్లు, నాలుగు స్తంబాలాట' సినిమాలను అప్పట్లో కన్నడలో రీ-మేక్ చేశారు. మరో మూడు సినిమాలను, 'పరివార' సీరియల్ ను కన్నడలో టీవీ కోసం తీశారు. గిరిబాబు రూపొందించిన అన్ని సినిమాలకు డాక్టర్ సి. నారాయణరెడ్డి సాహిత్యాన్ని, రమేశ్ నాయుడు సంగీతాన్ని సమకూర్చడం విశేషం. కొంతకాలం ఆయన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ లో సభ్యులుగానూ ఉన్నారు. గిరిబాబు, సత్యవతి దంపతులకు కుమారుడు సత్యదేవ్, ఇద్దరు కుమార్తెలు అపర్ణ, శ్రీచందన ఉన్నారు. స్వర్గీయ గిరిబాబు పెద్ద మనవడు బండారు భరత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మూడు చిత్రాలలో హీరోగా నటించి, సక్సెస్ కోసం కృషి చేస్తున్నాడు.
Also Read: Superman Review: సూపర్ మ్యాన్ ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ
Also Read: The 100 Review:మొగలి రేకులు సాగర్ నటించిన ది 100 మెప్పించిందా..