Chinmyi Sripada: జానీ మాస్టర్ పై మరోసారి చిన్మయి కన్నెర్ర....
ABN, Publish Date - Nov 11 , 2025 | 05:03 PM
సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మరోసారి జానీ మాస్టర్ పై ధ్వజమెత్తింది. కోర్టు నుండి ఆయనకు క్లీన్ చిట్ గనుక వస్తే అలాంటి వ్యక్తులను కీర్తించే వారు ఎక్కువైపోతారని, అదే దారిలో నడుస్తు వారి ఆగడాలకు అంతు ఉండదని ఆమె వాపోయింది.
ఇటీవల విడుదలైన 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend) సినిమాను ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) డైరెక్ట్ చేశాడు. కొంతకాలంగా చిన్మయి సినిమా రంగంలో మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న వారిపై సమరం జరుపుతోంది. ఎంత పెద్ద వారైనా, తన తోటి కళాకారులైనా చిన్మయి ఉపేక్షించడం లేదు. అలాంటి వారికి సహకరించినా, ప్రోత్సహించినా ప్రభుత్వాలను కూడా చిన్మయి టార్గెట్ చేసి ఎండగడుతూ వస్తోంది. యేడాది క్రితం డాన్స్ మాసర్ట్ జానీపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా చిన్మయి తన వాదన గట్టిగా వినిపించింది. అతన్ని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం జరగాలని తేల్చి చెప్పింది.
ఇదిలా ఉంటే... రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ విడుదల కాగానే దానిని చూసిన చాలా మంది ఈ సినిమా రూపకల్పన వెనుక రాహుల్ పై చిన్మయి ప్రభావం చాలా ఉందని వ్యాఖ్యానించారు. అమాయకురాలైన ఓ అమ్మాయి ట్రాక్సిక్ లవర్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడింది, ఆ తర్వాత అతని కబంధ హస్తాల నుండి ఆమె ఎలా బయటపడింది అనేది 'ది గర్ల్ ఫ్రెండ్'లోని ప్రధానాంశం కావడంతో... ఇలాంటి మహిళలకు దన్నుగా నిలిచే చిన్మయి పాత్ర ఈ ఫిల్మ్ మేకింగ్ లో తెర చాటున బాగానే ఉండి ఉంటుందని ఊహించారు.
ఈ సినిమా విడుదలకు ముందు, నవంబర్ 2న మరోసారి జానీ మాస్టర్ గురించి తన అభిప్రాయాలను చిన్మయి వెలిబుచ్చింది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని, జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ వంటి వాళ్ళకు సినిమా రంగంలో అవకాశం ఇవ్వడం కరెక్ట్ కాదని తెలిపింది. అయితే... ఇప్పుడు మరోసారి జానీ మాస్టర్ ను టార్గెట్ చేస్తూ చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జానీ మాస్టర్ కేసు కాస్తంత క్లిష్టమైందని పేర్కొంది. సెక్సువల్ గా హెరాస్ చేయడమే కాకుండా అతి ఇద్దరి సమ్మతితో జరిగిన అంశమంటూ కొందరు దీనిని సమర్థించడాన్ని చిన్మయి తప్పుపట్టింది. ఓ మైనర్ బాలికను మేజర్ అయిన వ్యక్తి లోబరుచుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో మేజర్ దే తప్పు అని ఆమె తెలిపింది. పైగా బాధితురాలు తనకు సహకరించని సందర్భంలో బెదిరించి లొంగదీసుకోవాలనుకోవడం మరింత దారుణమని చిన్మయి అభిప్రాయపడింది. జానీ మాస్టర్ కు చిత్రసీమలో ఉన్న పలుకుబడి కారణం సహజంగానే బాధితురాలికి న్యాయం జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయని తెలిపింది.
జానీ మాస్టర్ గురించి తాను మాట్లాడిన ప్రతిసారీ ఆయన భార్య తనకు కాల్ చేసి అలా మాట్లాడవద్దని వారిస్తుండేదని, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని చెబుతుండేదని చిన్మయి శ్రీపాద చెప్పింది. ఒకసారి వానికి అనుకూలంగా తీర్పు వచ్చినట్లైతే ఇక అవార్డుల మీద అవార్డులు రావడం ఖాయమని, అతన్ని విమర్శించిన వారంతా అతని నిర్ధోషిత్వాన్ని గురించి గొప్పగా మాట్లాడతారని ఆమె అన్నారు. అయితే... మైనర్ బాలికలతో శృంగారంలో పాల్గొనడం థ్రిల్ గా ఫీలయ్యే మహానుభావులకు ఈ అంశం ఉపకరిస్తుందని ఆమె తెలిపారు. ఒకవేళ కోర్ట్ తీర్పు వారికి అనుకూలంగా వస్తే... ఆ భారీ స్థాయిలో వారు విజయోత్సవం జరుపుకోవచ్చు. మరిన్ని అవకాశాలు అందుకోవచ్చు. నా కోరిక మాత్రం ఒక్కటే ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆమె కూడా ఖచ్చితంగా ఈ రంగంలో రాణించాలని, తనను అవమానించిన వారికి తన విజయంతో పరోక్షంగా బుద్ధి చెప్పాలి అని చిన్మయి ఆకాంక్షించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్, చిన్మయి జంటను కొందరు పనికట్టుకుని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆమె పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరోసారి జానీ మాస్టర్ మీద చిన్మయి ఈ రకంగా విరుచుకుపడటంతో ఏటు వైపుకు దారితీస్తుందో చూడాలి.