Star Movies: సెన్సిబుల్ సినిమాలకు సెన్సార్ చిక్కులు

ABN , Publish Date - Jun 24 , 2025 | 08:06 AM

కేంద్ర సెన్సార్ విభాగం అతి జాగ్రత్త పడుతోంది. ఏ సినిమా కారణంగా ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో, కోర్టుల చుట్టూ ఎక్కడ తిరగాల్సి వస్తుందోనని భయపడుతోంది. దాంతో సెన్సిబుల్ ఇష్యూస్ తీసుకుని సినిమాలు తీస్తున్నవారికి చుక్కలు కనిపిస్తున్నాయి.

ఏ సినిమా ఎప్పుడు? ఎందుకు? ఎలా? సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని సినీజనం వాపోతున్నారు. మితిమీరిన హింస, శృంగారపరమైన చిత్రాలు 'ఎ' సర్టిఫికెట్ తో బయటకు వచ్చేస్తుంటే... సెన్సిటివ్ అండ్ డివోషనల్ మూవీస్ మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ కోసం పడికాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చిత్రం ఏమంటే... మాజీ ఎంపీ సినిమాకు, ప్రస్తుత కేంద్రమంత్రి మూవీకి సైతం సెన్సార్ తిప్పలు తప్పలేదు.


ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు (Mohan Babu) గతంలో రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. అలానే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ (Padmasri) పురస్కారంతోనూ సత్కరించింది. మోహన్ బాబు గతంలో తీసిన కొన్ని సినిమాలు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొన్న దాఖలాలు ఉన్నాయి. ఆయన తాజాగా నిర్మించిన భక్తిరస ప్రధాన చిత్రం 'కన్నప్ప' (Kannappa) సైతం సెన్సార్ ఇబ్బందులను ఎదుర్కొంది. హైదరాబాద్ లో ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి రికమెండ్ చేయడంతో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఈ సినిమా చూడకుండా చేసిన విమర్శలే ఇందుకు కారణమని ఆయన భావించారు. గతంలో ఇదే నేపథ్యంలో వచ్చిన చిత్రాలతో పోల్చితే తమది క్లీన్ మూవీ అని అన్నారు. మొత్తానికీ ఆర్.సి. ఈ సినిమాకు కొన్ని కట్స్ తో క్లియరెన్స్ ఇచ్చింది. దక్షిణాది వారికి కన్నప్ప చరిత్ర తెలుసు కాబట్టి వారు అతని భక్తి తీవ్రతను అర్థం చేసుకుంటారని, కానీ ఉత్తరాది వారు అపార్థం చేసుకుంటారేమోనని సెన్సార్ వారు భయపడినట్టు తెలుస్తోంది. సెన్సార్ అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఎట్టకేలకు 27న జనం ముందుకు వస్తోంది.


కేంద్రమంత్రి సినిమాకూ మోకాలడ్డు!

మాజీ ఎంపీ మోహన్ బాబు పరిస్థితి ఇలా ఉంటే... ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న పార్లమెంట్ మెంబర్ సురేష్ గోపీ (Suresh Gopi) సినిమాది మరో కథ. 66 సంవత్సరాల సురేశ్‌ గోపీకి మలయాళ చిత్రసీమలో యాక్షన్ హీరోగా మంచి పేరుంది. ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి... డక్కామొక్కీలు తీసి ఇప్పుడు బీజేపీ ఎంపీగా గెలవడమే కాకుండా కేంద్ర మంత్రిగా ఉన్నారు. సినిమాల పట్ల విపరీతమైన అభిమానం ఉన్న సురేశ్‌ గోపీ... నటనకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టనని స్పష్టం చేశారు. అయితే ఆయన నటించిన తాజా చిత్రం 'జానకీ వర్సెస్ స్టేట్ ఆఫ్‌ కేరళ' ఇప్పుడు సెన్సార్ చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ నెల 27న విడుదల కావాల్సిన ఈ సినిమాకు పేరు మార్చమని సెన్సార్ సభ్యులు ఆదేశించారట. బలత్కారానికి గురైన ఓ యువతి చేసే పోరాటం నేపథ్యం రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సురేశ్‌ గోపీ లాయర్ గా నటించాడు. 'జానకి' అనే పేరు సీతాదేవికి వర్తిస్తుంది కాబట్టి... సినిమా పేరు మార్చాల్సిందేనని అంటున్నారట. మోహన్ బాబు 'కన్నప్ప'లో ఆయన కొడుకు విష్ణు నటించినట్టుగానే, ఈ సినిమాలోనూ సురేశ్‌ గోపీతో పాటు ఆయన కొడుకు మాధవ్ గోపీ కీలక పాత్రను పోషించాడు. అనుపమా పరమేశ్వరన్ జానకి పాత్రను చేసింది.


జూన్ 20న ఆమిర్ ఖాన్ (Aamir Khan) నటించి, నిర్మించిన 'సితారే జమీన్ పర్' మూవీ విడుదలైంది. అయితే ఈ సినిమా అనుకున్న తేదీన విడుదల అవుతుందా లేదా అని మేకర్స్ చివరి నిమిషం వరకూ టెన్షన్ పడ్డారు. కారణం సెన్సార్ అధికారులు అనుకున్న సమయంలో క్లియరెన్స్ ఇవ్వకపోవడమే. దివ్యాంగుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'సితారే జమీన్ పర్' మూవీలో కొన్ని సన్నివేశాలకు సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. వాటిని తొలగించడానికి లేదా మార్చడానికి ఆమిర్ ఖాన్ అంగీకరించకపోవడంతో చివరి నిమిషం వరకూ సర్టిఫికెట్ ఇవ్వలేదని తెలిసింది. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలని ఆమిర్ అనుకున్నారు. కానీ సెన్సార్ సర్టిఫికెట్ లేట్ కావడంతో ఆయన ఆ ఆలోచన విరమించుకుని హిందీ రిలీజ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందట. చిత్రం ఏమంటే... 'యానిమల్ (Animal), పుష్ప 2 (Pushpa -2), మార్కో (Marco), హిట్ -3 (Hit -3)' వంటి హింసాత్మక చిత్రాలు 'ఎ' సర్టిఫికెట్ తో బయట పడుతుంటే సెన్సిబిలిటీ అంశాలపై తెరకెక్కిన సినిమాలు మాత్రం చిక్కుల్లో పడుతున్నాయని తెలుస్తోంది. ఒకే భాషలో అయితే పెద్దంత సమస్యలేదు కానీ పాన్ ఇండియా పేరుతో వివిధ భాషల్లో సినిమాలు విడుదల అవుతుండటంతో ఎవరి మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయో అని కేంద్ర సెన్సార్ అధికారులు భయపడుతున్నారని అంటున్నారు. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలపై కొందరు కోర్టు కు వెళ్ళడంతోనూ అధికారులు బెదిరిపోతున్నారట. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు, ఎలా లభిస్తుందో చూడాలి.

Also Read: Kannappa: నెమ‌లి ఏది క‌న్న‌ప్ప‌! ఈవెంట్ల‌లో కనిపించ‌ని హీరోయిన్‌

Also Read: Kajol: రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలు.. మాటమార్చిన కాజోల్

Updated Date - Jun 24 , 2025 | 08:06 AM