Brahmanandam: హాస్య బ్రహ్మకు సూర్యకాంతం స్మారక పురస్కారం
ABN, Publish Date - Oct 29 , 2025 | 05:49 PM
సూర్యకాంతం శతజయంతి ముగింపు ఉత్సవం హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా కిన్నెర థియేటర్స్ సంస్థ హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు సూర్యకాంతం స్మారక పురస్కారాన్ని అందచేశారు.
ప్రముఖ నటీమణి, స్వర్గీయ సూర్యకాంతం (Suryakantam) శత జయంతి పురస్కారాల ముగింపు ఉత్సవం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో మంగళవారం సాయంత్రం జరిగింది. డాక్టర్ సూర్యకాంతం శతజయంతి కమిటీతో కలిసి కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ఠ అతిథి మురళీమోహన్ (Murali Mohan), గౌరవ అతిథులు రేలంగి నరసింహారావు (Relangi Narasimharao), రోజారమణి (Roja Ramani), తనికెళ్ళ భరణి, ఆత్మీయ అతిథి ఓలేటి పార్వతీశం తదితరులు సూర్యకాంతంతో ఉన్న అనుబంధం గురించి, ఆమె నటనా చాతుర్యం గురించి తెలిపారు. సూర్యకాంతమ్మ గారితో కలిసి రెండు చిత్రాలలో నటించే అవకాశం తనకు కలిగిందని పురస్కార గ్రహీత బ్రహ్మానందం (Brahmanandam) తెలిపారు. సూర్యకాంతం వంటి లెజండరీ యాక్ట్రస్ మెమోరియల్ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. సూర్యకాంతంపై ఎస్.వి. రామారావు రూపొందించిన 'అత్తగారు జిందాబాద్' లఘు చిత్రాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. సూర్యకాంతం కుమారుడు అనంత పద్మనాభమూర్తి, ఆయన కుమారుడు, కుమార్తె కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.