Emmanuel: టాప్ 4.. రావడమే నా జీవితంలో గొప్ప గెలుపు
ABN, Publish Date - Dec 29 , 2025 | 04:04 PM
బిగ్ బాస్ షో నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని టాప్ 4 ఫైనలిస్ట్ ఇమ్మాన్యుల్ అన్నారు. రోజులు తరబడి నటించడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు.
బిగ్ బాస్ షో తన జీవితానికి, కెరీర్‌కు ఎంతో విలువైన అనుభవాన్ని అందించిందని ప్రముఖ నటుడు ఇమ్మాన్యుల్ అన్నారు. ‘జబర్దస్త్’ కార్యక్రమంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన ఆయన, బిగ్ బాస్ వేదికపై కూడా తన ప్రత్యేకమైన శైలితో ఆకట్టుకుని టాప్ 4 ఫైనలిస్ట్‌గా నిలిచారు. ఈ సందర్భంగా ఇమ్మాన్యుల్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.
బిగ్ బాస్ హౌస్‌లో గడిపిన ప్రతి క్షణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పిన ఇమ్మాన్యుల్, అక్కడ తనతో పాటు పాల్గొన్న సహ పోటీదారులతో ఏర్పడిన అనుబంధాలు ఎంతో విలువైనవని తెలిపారు. ముఖ్యంగా సంజనాతో తనకు ఏర్పడిన స్నేహం జీవితాంతం కొనసాగుతుందని, చచ్చే వరకూ సంజన గారికి కొడుకులా ఉంటానని పేర్కొన్నారు.
బిగ్ బాస్‌లో ఉన్నవారంతా నటిస్తారని చాలామంది భావిస్తారని, కానీ గంటల తరబడి, వారాల తరబడి, రోజుల తరబడి ఒకే విధంగా నటించడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. “అంత కాలం నిజాయితీ లేకుండా నటించడం సాధ్యం కాదు. అక్కడ ప్రతి ఒక్కరి నిజమైన స్వభావమే బయటపడుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
తన బిగ్ బాస్ జర్నీలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన ఇమ్మాన్యుల్, ముఖ్యంగా ‘విజనరీ వౌస్’ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బిగ్ బాస్ ద్వారా నేర్చుకున్న అనేక విలువైన పాఠాలను తన కెరీర్‌లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు.
అలాగే బిగ్ బాస్ విజేతగా నిలిచిన కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన ఇమ్మాన్యుల్, తనకు మొదటి స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఏ మాత్రం లేదని స్పష్టంగా చెప్పారు. “టాప్ 4 వరకూ రావడమే నా జీవితంలో గొప్ప గెలుపు” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.