Andhra Pradesh: అమరావతిని సాహితీ రాజధానిగా మార్చే ఆవకాయ ఫెస్టివల్
ABN, Publish Date - Dec 22 , 2025 | 11:02 PM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, టీమ్ వర్క్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో జనవరి 8 నుండి 10 వరకూ విజయవాడలో ఆవకాయ సినిమా, సంస్కృతి, సాహిత్యోత్సం జరుగబోతోంది. ఈ విశేషాలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.
తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ (Vijayawada) వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ సినిమా, సంస్కృతి, సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) అన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, టీమ్‌వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శ్యామ్ తో కలిసి ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవంపై పలు అంశాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2026 జనవరి 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్, భవాని ఐలాండ్ లలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దార్శనికతలో భాగంగా ఈ ఉత్సవం రూపుదిద్దుకుందన్నారు. కేవలం ఇండోర్ హాల్స్‌కే పరిమితం కాకుండా, బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం దీని ప్రత్యేకతగా మంత్రి పేర్కొన్నారు. తెలుగు కథలు, సినిమాలకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, అమరావతి-విజయవాడ ప్రాంతాన్ని ఒక సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడమే ఈ పండుగ లక్ష్యమని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, స్థానిక కళాకారులకు, కళాభిమానులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. అమరావతిని సాహితీ, కళా రాజధానిగా తయారు చేసే క్రమంలో ఈ కార్యక్రమం తొలిమెట్టుగా భావిస్తున్నామన్నారు.
బహుళ కళారూపాలను బహిరంగ ప్రదేశాలలో, ప్రజా భాగస్వామ్యంతో అనుసంధానించే సమగ్ర సాంస్కృతిక చొరవగా 'ఆవకాయ'ను తీర్చిదిద్దామని పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ (Ajai Jain) అన్నారు. నదీ తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యక్రమం చర్చలు, ప్రదర్శనలు, అభ్యాసాలను అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుందన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు, సమకాలీన సృజనాత్మకతను పెంపొందించడానికి, దీర్ఘకాలిక పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా స్థిరమైన సాంస్కృతిక వ్యవస్థను నిర్మించడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరమన్నారు. జనవరి లో గండి కోట, అరకు, విశాఖ, ఫ్లెమింగో ఉత్సవ్ లను నిర్వహిస్తామని అన్నారు. సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలతో కూడిన బహుముఖ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, సృజనాత్మక బలాన్ని ప్రదర్శించడానికి 'ఆవకాయ' రూపొందించబడిందని ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట అన్నారు.
ఆవకాయ ఉత్సవం ఈ ప్రాంతపు ఆలోచనలు, కథలు, ప్రదర్శనలను ఒకచోట చేర్చే ఒక బహిరంగ సాంస్కృతిక వేదిక అని టీమ్‌వర్క్ ఆర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె. రాయ్ (Sanjay K Rai) పేర్కొన్నారు. ఇది కళాకారులు, ప్రేక్షకుల మధ్య అర్థవంతమైన సంభాషణలకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించే వాతావరణంలో సినిమా, సాహిత్యం, కళలను జరుపుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అన్నారు. ఆవకాయ ఉత్సవాన్ని సాకారం చేయడంలో ఏపీ ప్రభుత్వం మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో భాగంగా తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు జరుగుతాయన్నారు. కవిత్వం, ముషాయిరా (తెలుగు, ఉర్దూ), నృత్యం, సంగీతం, థియేటర్ లపై , తోలుబొమ్మలాట, నృత్యం, సంగీతం, నాటక రంగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. హెరిటేజ్ వాక్ (వారసత్వ యాత్రలు), ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, రుచికరమైన స్థానిక వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు.