Kota Srinivasarao: కవి... కోట శ్రీనివాసరావు...
ABN, Publish Date - Jul 13 , 2025 | 07:41 AM
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు లో గొప్ప చమత్కారి ఉన్నాడు. సందర్భానుసారంగా ఆయన నోటి నుండి మాటలు వరదలా పారేవి. అలానే ఆయన గొప్ప భావకుడు కూడా....
కోట శ్రీనివాసరావు గొప్ప హాస్యప్రియుడు. సుతిమెత్తని హాస్యంతో తనతోటి వారిని ఎప్పుడూ అలరిస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఏదైనా కొత్త సినిమా విడుదల కాగానే ఆ పేరును... ఆ మూవీ ఫలితాన్ని జత చేస్తూ చమత్కారంగా తనదైన శైలిలో ఫన్ జనరేట్ చేసేవారు. కోట జడ్జిమెంట్ లో ఉండే నిజాయితీకి అందరూ సాహో అనేవారు. సినిమా రంగంలో ఉంటూ అంత నిక్కచ్చిగా సినిమాల జయాపజయాలను గురించి మాట్లాడుకోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసేది.
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ అందరితో కలిసిపోయే కోట శ్రీనివాసరావు మంచి భావకుడు కూడా. తన మనసులో భావాలకు అప్పుడప్పుడు అక్షర రూపం కల్పించే వారు.
ఆయన రాసిన కవిత ఇది
....
నది అడగదు నావనీ
నీ కులమేనిటనీ?
కడలి అడగదు ఈ నదిని
నీ మతమేమిటని?
కులాలు, మతాలు
కంటిలోని నలుసులేరా!
తీసుకుంటే అంతా సొగసే రా!!
...
అలానే శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' చదివి, శ్రామికులకు జరుగుతున్న అన్యాయానికి స్పందిస్తూ
''గుడ్డు పెట్టేది గుడిసెలోని కోడి
ఆమ్లెట్లు మేసేది మేడ లోని కేడీ
ఏమిటీ అన్యాయమని అడిగితే
గుడిసెలోని కోడికి చావు
మెడలోని కేడీ కి పలావు''
అంటూ మినీ కవిత రాశారు కోట.