సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kiss scenes: రెండు నిమిషాల కిస్‌ సీన్‌ ఓకే.. 33 సెకన్ల సీన్‌కి నో..

ABN, Publish Date - Jul 26 , 2025 | 05:26 PM

ఒకప్పుడు రెండు నిమిషాల లిప్‌లాక్‌ సీన్‌ను ఏ ఆంక్షలు లేకుండా తెరపై ప్రదర్శించారు. కానీ ఇప్పుడు కేవలం 33 సెకన్ల ముద్దు సన్నివేశం సెన్సార్‌ బోర్డ్‌ కత్తెరకు గురయింది

ఒకప్పుడు రెండు నిమిషాల లిప్‌లాక్‌ సీన్‌ను ఏ ఆంక్షలు లేకుండా తెరపై ప్రదర్శించారు. కానీ ఇప్పుడు కేవలం 33 సెకన్ల ముద్దు సన్నివేశం సెన్సార్‌ బోర్డ్‌ కత్తెరకు గురయింది. ఆ రోజుల్లో లేని సెన్సార్‌ ఆంక్షలు ఇప్పుడెందుకు? అసలేం జరుగుతోంది?

హాలీవుడ్‌లో జేమ్స్‌ గన్‌ తెరకెక్కించిన చిత్రం 'సూపర్‌మేన్‌’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ చిత్రంలో అత్యంత కీలక సన్నివేశంలో ఉన్న 33 సెకన్ల ముద్దు సన్నివేశం ఉంది. ఈ సన్నివేశాన్ని సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు తిరస్కరించారు. కథకు అడ్డంకిగా, హద్దులు మీరి ఆ సన్నివేశం ఉందనే కారణంలో సినిమాలో ఆ సన్నివేశాన్ని తొలగించారు. దీనిపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. గతంలో వచ్చిన చిత్రాలు వాటిలో ఉన్న ముద్దు సన్నివేశాలు ఉదాహరణగా చూపిస్తూ కీలకమైన ఈ కిస్ సీన్ ను తొలగించడానికి కారణాలేంటని సినీజనం ప్రశ్నిస్తున్నారు.


ముద్దులకు హద్దుండాలంటూ సెన్సార్ బోర్డ్ ఏ నాటి నుంచో చెబుతోంది. ఇప్పుడంటే కట్టుబాట్లు సడలి పబ్లిక్ ప్లేసెస్ లోనే యువత ముద్దులాటలాడుతోంది. ఈ సమయంలోనూ హాలీవుడ్ మూవీ 'సూపర్ మేన్' లాంటి సినిమాలో కిస్ సీన్ ను తొలగించడమేంటని ఆశ్చర్యపోతున్నారు. అదేమిటంటే 'సూపర్ మేన్' సినిమాను చిన్నపిల్లలు సైతం వీక్షిస్తారు. కాబట్టి, అందులో ముద్దు సన్నివేశాలు ఉండరాదని సెన్సార్ వారి వాదన.

1933లో వచ్చిన ‘కర్మ’ అనే సినిమాలో దాదాపు రెండు నిమిషాల లిప్‌ లాక్ సీన్ ఉంది. ఆ రోజుల్లో ఆ సీన్ పెద్ద సంచలనం సృష్టించింది. ఇందులో దేవికారాణి, హిమాన్షు రాయ్‌ నటించారు. ఈ కిస్‌ సీన్‌ సినిమాకు ఎంతో కీలకమని దర్శకుడు చెప్పడం వల్ల ఆ రోజుల్లోనే సెన్సార్ ఓకే అంది. పైగా నిజజీవితంలో దేవికారాణి, హిమాన్షు రాయ్ భార్యాభర్తలు. అందువల్ల అప్పటి సెన్సార్ సభ్యులు ఆ సీన్ కు పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. దాదాపు 92 ఏళ్ళ క్రితం కిస్ సీన్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్ 'సూపర్ మేన్'లో 33 సెకన్ల ముద్దు సన్నివేశాన్ని తప్పు బట్టడంపై ఇప్పుడు నెట్టింట మీమ్స్ భలేగా సందడి చేస్తున్నాయి.


1950లలోనే రాజ్ కపూర్ తాను తెరకెక్కించిన 'ఆవారా, శ్రీ 420' చిత్రాల్లో హీరోయిన్ పైట జార్చుకొనే సీన్స్ రూపొందించారు. అందుకు తగ్గ కారణాలు వివరించి సెన్సార్ కత్తెర పడకుండా తన సినిమాలను రిలీజ్ చేసుకున్నారు ఇండియన్ షోమేన్. 1964లో అదే రాజ్ కపూర్ 'సంగం' సినిమాలో హీరోయిన్ వైజయంతీమాలను నీళ్ళలో భలేగా తడిపేశారు. ఆ సీన్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ కు గుర్తుండే ఉంటాయి. ఇక ముద్దు సీన్స్ లో మాత్రం మన భారత్ గౌరవం కాపాడారు రాజ్. అదే సినిమాలో హీరోహీరోయిన్ హనీమూన్ కు విదేశాలకు వెళ్తారు. అక్కడ పబ్లిక్ ప్లేస్ లో భార్యను హీరో కౌగిలించుకోబోతే ఆమె అభ్యంతరం చెబుతుంది. అది చూసిన విదేశీయులు "మీరు ఇండియన్సా..." అని అడుగుతారు. అది సినిమాలో వినోదం పంచడంతో పాటు, భారతీయులంటే ఎంతో పద్ధతిగా ఉంటారన్న విషయం విదేశీయులకు కూడా తెలిసేలా రాజ్ కపూర్ ఆ సీన్ తీశారనీ ప్రశంసించారు. తరువాత అదే రాజ్ కపూర్ తీసిన 'మేరా నామ్ జోకర్'లో ఓ హీరోయిన్ గా నటించిన పద్మిని వక్షసౌందర్యాన్ని యథేచ్చగా ప్రదర్శించారు. అదే సినిమాలో మరో నాయిక సిమీ గేర్వల్ నూ నగ్నంగా కాసేపు చూపించారు. అయినా కత్తెర పడలేదు. కానీ, ముద్దు సన్నివేశాలకు అభ్యంతరాలు చెప్పారట. రాజ్ కపూర్ 1978లో తెరకెక్కించిన 'సత్యం శివం సుందరం'లో హీరోయిన్ ను తడిబట్టల్లో చూపిస్తూ కవ్వించారు. ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలను పోస్టర్లపై ముద్రించడంతో అప్పట్లో వివాదాలు తలెత్తాయి.


తరువాతి రోజుల్లో ముద్దు సన్నివేశాలపై తగిన కారణాలు చూపిస్తే సెన్సార్ తన కత్తెరకు పని తగ్గించడం మొదలెట్టింది. ఈ కోణంలోనే కమల్ హాసన్, ఇమ్రాన్ హష్మి వంటి వారి చిత్రాల్లో ముద్దుల మోత మోగింది. ఒకప్పుడు 'ముద్దు' అన్న మాట కూడా సరైన విధంగా వాడలేదంటూ సెన్సార్ కట్ చేసిన సందర్భాలున్నాయి. 1964లో వచ్చిన తెలుగు చిత్రం 'దాగుడుమూతలు'లో "అడగక ఇచ్చిన మనసే ముద్దు..." అంటూ సాగే సూపర్ హిట్ సాంగ్ ఉంది. అందులో హీరో హీరోయిన్ చివరలో "నువ్వు నేను ముద్దుకు ముద్దు..." అంటూ పాడే పదాలు అశ్లీలం ధ్వనించేలా ఉన్నాయని అప్పటి సెన్సార్ సభ్యులు అభ్యంతరం పెట్టారు. చేసేది లేక ఆ పదాలను తొలగించారు. తరువాతి రోజుల్లో 'ముద్దు'పై పాటలు వచ్చినా ముద్దు పెట్టుకొనే సీన్స్ లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు సినీజనం. 1990 తరువాత నుంచీ ముద్దు సన్నివేశాలకు కూడా తగిన కారణాలు చెబుతూ తెరపై యధేచ్చగా ముద్దుల రచ్చ సాగుతూ వస్తోంది. మన తెలుగులో 'అర్జున్ రెడ్డి', దాని రీమేక్ 'కబీర్ సింగ్'లోనూ ముద్దు సీన్ రంజింప చేసింది. ఉన్నట్టుండి ఇప్పుడు తాజా 'సూపర్ మేన్'లో 33 సెకన్ల ముద్దు సీన్ తొలగించడంతోనే సినీజనానికి, మూవీ బఫ్స్ కు ఆశ్చర్యం కలుగుతోంది. ఆ కిస్సింగ్ సీన్ కట్ చేయడం వల్ల 'సూపర్ మేన్'లో జర్క్ వచ్చినట్టు కనిపిస్తోందని, దానిని బట్టి జనం కిస్సింగ్ సీన్ కట్ అయిందని అర్థం చేసుకుంటున్నారని విమర్శకులు సైతం అంటున్నారు. మరి సెన్సార్ వారు పట్టుబట్టి మరీ ఆ సీన్ కు కత్తెర వేయడం వెనుక కారణాలు ఏమైనా ఉన్నాయేమో అనీ కొందరి అనుమానం. ఏది ఏమైనా ఈ విషయంలో సెన్సార్ బోర్డ్ పై విమర్శలు, మీమ్స్ సందడి చేస్తున్నాయి. ఇవి చూశాక సెన్సార్ బోర్డ్ ఇకపై 'ముద్దు సన్నివేశాల'పై ఏమైనా కొత్త నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.

Updated Date - Jul 26 , 2025 | 07:16 PM