Tom Cruise: మే 17న మిషన్ ఇంపాజిబుల్ చివరి భాగం

ABN , Publish Date - May 14 , 2025 | 06:22 PM

మే నెల 17వ తేదీన 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ లో చివరి భాగంగా 'మిషన్ : ఇంపాజిబుల్ - ద ఫైనల్ రెకనింగ్' జనం ముందుకు రానుంది.

ఈ నెల 17వ తేదీన 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ లో చివరి భాగంగా 'మిషన్ : ఇంపాజిబుల్ - ద ఫైనల్ రెకనింగ్' (Mission: Impossible - The Final Reckoning) జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దాదాపు 30 ఏళ్ళుగా 'మిషన్ ఇంపాజిబుల్' హీరో ఎథాన్ హంట్ (Ethan Hunt) పాత్రలో అలరిస్తోన్న టామ్ క్రూయిజ్ (Tom Cruise) తో యూనిట్ మెంబర్స్ తమకున్న అనుబంధాన్ని మననం చేసుకున్నారు. ఈ సందర్బంగా టామ్ లో జనానికి తెలియని చాలా కోణాలు వెలుగు చూశాయి.

'మిషన్: ఇంపాజిబుల్' చిత్రానికి బ్రూస్ గెల్లర్ రాసిన 'మిషన్ - ఇంపాజిబుల్' నవల ఆధారం. ఈ కథతో బ్రియాన్ డి పల్మా డైరెక్షన్ లో మొదటి భాగం షూటింగ్ 1995 మార్చిలో మొదలయింది. అంటే 30 ఏళ్ళలో 'మిషన్ ఇంపాజిబుల్' ఎనిమిది భాగాలుగా తెరకెక్కింది. ప్రతి చిత్రం వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు టామ్ క్రూయిజ్ ను సూపర్ స్టార్ గా నిలిపింది. మొదటి నాలుగు భాగాలకు వరుసగా బ్రియాన్ డి పల్మా, జాన్ వూ, జె.జె. అబ్రామ్స్, బ్రాడ్ బర్డ్ దర్శకత్వం వహించారు. ఆ తరువాత నాలుగో భాగం నుండి చివరి ఎనిమిదో భాగం వరకు క్రిష్టఫర్ మెక్ క్యారీ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ వచ్చారు. మొదటి ఆరు భాగాలు పెట్టుబడికి ఎన్నో రెట్లు పోగేశాయి. కాగా ఏడో భాగంగా వచ్చిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ ఒన్' అన్నిటి కంటే తక్కువ పే చేసింది. 291 మిలియన్ అమెరికన్ డాలర్లతో రూపొందిన ఏడో భాగం 571 మిలియన్ డాలర్లు పోగేసింది. చివరి భాగంగా రూపొందిన 'మిషన్: ఇంపాజిబుల్ - ఫైనల్ రెకనింగ్' చిత్రం ఏకంగా 400 మిలియన్ డాలర్లతో తెరకెక్కింది. అంటే మన కరెన్సీలో రూ. 3415 కోట్లు అన్నమాట! మే 17వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయి వసూళ్ళు కొల్లగొడుతుందో చూడాలని సినీఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో టామ్ క్రూయిజ్ పై యూనిట్ మెంబర్స్ అభినందన జల్లులు కురిపించడం విశేషంగా మారింది.

Also Read: Vijay Antony: మర్డర్ మిస్టరీ - క్రైమ్ థ్రిల్లర్ గా మార్గన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


టామ్ క్రూయిజ్ 62 ఏళ్ళు దాటినా ఇంకా ఫిట్ గా బాడీని మెయింటెయిన్ చేస్తున్నాడు. ఆయనలోని సెన్సాఫ్ హ్యూమర్ ఓ పెద్ద మెడిసిన్ లా పనిచేస్తుందని డైరెక్టర్ క్రిష్టఫర్ అంటున్నారు. సెట్ లో హుషారుగా ఉండడమే కాదు, అందరినీ ఉత్సాహంగా పనిచేసేలా చేయడం టామ్ కు వెన్నతో పెట్టిన విద్యట! ఒకవేళ ఎవరైనా సెట్ లో చీదినా సరే, వారి దగ్గరకు వెళ్ళి 'ఆర్ యూ ఓకే' అంటూ ప్రశ్నించి, ఒకవేళ సరిగా లేకపోతే, వెంటనే డాక్టర్ ని పిలిపించి వైద్యసహాయం అందించేదాకా టామ్ నిద్రపోడనీ యూనిట్ మెంబర్స్ గుర్తు చేసుకుంటున్నారు. టామ్ హీరోనే కాదు, టెక్నీషియన్ గా కూడా ఆయనకు ఎంతో అనుభవం ఉందని చెబుతున్నారు. సీన్ కు సంబంధించిన మూడ్ లైటింగ్, కెమెరా యాంగిల్స్ గురించి డైరెక్టర్ తో పక్కాగా చర్చిస్తాడనీ అంటున్నారు. అలాగే సెట్ రూపకల్పనలోనూ ఓ ఆర్ట్ డైరెక్టర్ లా పనిచేస్తాడనీ తెలిపారు. 'మిషన్: ఇంపాజిబుల్' సిరీస్ కోసం టామ్ రన్నింగ్ లో స్పెషల్ స్టైల్ ను క్రియేట్ చేశాడని, అదే ఫ్రాంచైజ్ కు ఓ సిగ్నేచర్ లాగా పనిచేసిందని టామ్ తో పనిచేసిన నటి బాస్సెట్ చెప్పారు. టామ్ ఇండియన్ మూవీస్ ను చూసి ఎంజాయ్ చేస్తాడని, అలాగే ఆ సినిమాల్లోని డాన్స్ ను లైక్ చేస్తూంటాడనీ బాస్సెట్ అన్నారు. టామ్ ఓ సారి నాన్ స్టాప్ గా డాన్స్ చేయడం తాను చూశానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎక్సర్ సైజ్, డాన్స్ , రన్నింగ్ వల్లే టామ్ ఈ నాటికీ అంత ఫిట్ గా ఉన్నాడనీ మరికొందరు తెలిపారు. ఇంతలా యూనిట్ మెంబర్స్ ను అలరించిన టామ్ క్రూయిజ్ 'మిషన్: ఇంపాజిబుల్' లాస్ట్ మూవీతో ఏ తీరున మురిపిస్తాడో చూడాలి.

Updated Date - May 14 , 2025 | 06:22 PM