Thunderbolts*: ప్రేక్షకులకు ఊహించని షాకిచ్చిన మార్వెల్ స్టూడియోస్

ABN, Publish Date - May 08 , 2025 | 02:02 PM

మార్వెల్ స్టూడియోస్ నుండి తాజాగా 'థండర్ బోల్డ్స్' అనే మూవీ వచ్చింది. అయితే సరిగ్గా విడుదలకు కొద్ది రోజుల ముందు మేకర్స్ అనూహ్యంగా 'న్యూ ఎవెంజర్స్' అంటూ దీని పేరు మార్చేశారు.

మార్వెల్ స్టూడియోస్ (Marvel Studios) నుండి వచ్చే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆ ప్రొడక్షన్ హౌస్ నుండి మూవీ వస్తోందంటే... సమ్ థింగ్ స్పెషల్ గా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందనే నమ్మకం అందరికీ ఉంది. ముఖ్యంగా సూపర్ హీరోస్ సినిమాలు తీయడంలో మార్వెల్ స్టూడియోస్ ను మించి సంస్థ ఈ మధ్య కాలంలో మరేదీ లేదు. అలాంటి సంస్థ నుండి ఇటీవల 'థండర్ బోల్డ్స్' (Thunderbolts*) అనే సినిమా వచ్చింది. కొన్ని నెలలుగా ఈ సంస్థ ఈ సినిమాకోసం ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రచారాన్ని చేస్తూ వస్తోంది. చిత్రంగా సరిగ్గా రిలీజ్ కు ముందు ఈ సినిమా పేరును 'థండర్ బోల్డ్స్' నుండి ఒక్కసారిగా 'ది న్యూ ఎవెంజర్స్' (The New Avengers) అని మార్చేశారు.

నిజానికి 'థండర్ బోల్డ్స్' మేకర్స్ ఆ పేరు చివర ఓ స్టార్ గుర్తును పెట్టి మొదటి నుండి ప్రచారం చేస్తున్నారు. సహజంగా అలాంటి స్టార్ గుర్తు ఒకటి టైటిల్ పక్కన ఉంటే... దానికి సంబంధించిన వివరణ ఏదో ఒకటి ఆ పోస్టర్ మీద ఇస్తారు. కానీ అలాంటి వివరణ ఏదీ మార్వెల్ స్టూడియోస్ ఇవ్వలేదు. మామూలుగా అయితే... ఆ స్టార్ గుర్తు వేసి చాలామంది కండిషన్స్ అప్లయ్ అనే పదాన్ని పెడుతూ ఉంటారు. పేరు పక్కన ఎందుకు స్టార్ గుర్తు పెట్టి ఉంటారనే సందేహం కొందరికి రాకపోలేదు. కానీ వారు దానికి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఏదో కారణం ఉంటుందని ఊహించారు తప్పితే... ఈ పేరును సరిగ్గా రిలీజ్ ముందు తీసేసి... 'న్యూ ఎవెంజర్స్' అని పెడతారని మాత్రం ఊహించలేకపోయారు.


ఇదిలా ఉంటే సినిమా ఒకటి రెండు రోజుల్లో విడుదల కాబోతోందని అనగా... అప్పుడు 'థండర్ బోల్డ్స్' అనే పేరును అన్ని చోట్ల 'న్యూ ఎవెంజర్స్'గా మార్చేశారు. కొన్ని నెలల పాటు ఒక పేరుతో సినిమాను పాపులర్ చేసి... చివరి నిమిషంలో ఇలా మార్చడం ఏమంత గొప్ప ఆలోచన కాదనే విమర్శలే చాలామంది నుండి వచ్చాయి. ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారో కానీ... ఇది సినిమాను కిల్ చేసేదిగా ఉందని మరికొందరు అన్నారు. సినిమా పేరు మార్పును హడావుడిగా టిక్కెటింగ్ వెబ్ సైట్స్ మార్చాల్సి వచ్చింది. గ్రాండ్ గా పబ్లిసిటీ చేసేందుకు ఏర్పాటు చేసిన బిల్ బోర్డ్ మీద కూడా టైటిల్ మార్చి ప్రచారం మొదలు పెట్టారు. బహుశా ఇదే సినిమాకు బోలెడంత పబ్లిసిటీని తెచ్చిపెడుతుందని మార్వెల్ స్టూడియో భావించి ఉండొచ్చు. సినిమా విడుదల వరకూ ఇది ఓకే కానీ ఫైనల్ గా ప్రజలు కోరుకునేది తమకు నచ్చే విధంగా కంటెంట్ ఉండాలి. ఈ విషయంలో 'థండర్ బోల్డ్స్' ఉరఫ్ 'న్యూ ఎవెంజర్స్' జనాలను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఇండియాలో ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రదర్శితమౌతోంది. జేక్ ష్రెయిర్ (Jake Schreier) దర్శకత్వంలో కెవిన్ ఫీజ్ (Kevin Feige) దీనిని నిర్మించారు.

Also Read: YVS Chowdary: ఎన్టీఆర్ మూవీ ఓపెనింగ్ కు సర్వం సిద్థం

Also Read: Breaking: తెల్లారితే థియేట‌ర్ల‌లోకి.. రిలీజ్‌ ఆపేసి ఓటీటీలోకి భారీ చిత్రం! షాక్‌లో ఇండ‌స్ట్రీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 08 , 2025 | 02:02 PM