Pavani Rao Boddapati: అవతార్ విజువల్ వెనకున్నది మనమ్మాయే
ABN, Publish Date - Dec 18 , 2025 | 12:58 PM
ప్రపంచంలో ఏ రంగంలో చూసినా భారతీయుల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలు కూడా పురుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా దూసుకెళ్తున్నారు. హాలీవుడ్ ఓ భారతీయ మహిళా దూసుకెళ్తుంది. విజువల్స్ తో వండర్స్ చేస్తోంది. ఆమె ఎవరో చూద్దాం
హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron) సృష్టించిన ‘అవతార్’ సినిమా ఓ అద్భుతం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. పండోర అనే కొత్త గ్రహంలోకి తీసుకెళ్లారు దర్శకుడు. తదుపరి నీటి లోపల విహరించేలా చేశారు. ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ పేరుతో అగ్ని పర్వతాల్లోకి తీసుకెళ్ళబోతున్నారు. జానర్ ఏదైనా ఈ సినిమా జనాల్లోకి బాగా వెళ్ళడానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్. ఈ సినిమాకు వీఎఫ్స్ ఎక్స్ చేసింది ‘వెటా ఎఫ్‌ఎక్స్’ సంస్థ. ఈ టీమ్ లో సీక్వెన్స్ సూపర్‌వైజర్‌గా లీడ్ చేసేది మన దేశ మహిళే. ఆమె పేరు పావనీ రావు బొడ్డపాటి (pavani rao boddapati).
అద్భుతమైన విజువల్స్ తో 'అవతార్' చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఈ వండర్ విజువల్స్ వెనకున్న ఓ సృజన పేరే... పావనీ రావు. అవతార్, అవతార్: ది వే ఆఫ్ వాటర్ చిత్రాలతోపాటు ఈ నెల 19న విడుదల కాబోతున్న ‘అవతార్’ (ఫైర్ అండ్ యాష్) వెటా ఎఫ్‌ఎక్స్ విజువల్స్‌ను దగ్గరుండి పర్యవేక్షించారు పావనిరావు. ఢిల్లీలో పుట్టిపెరిగిన పావని రావు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుంచి బీఆర్క్ పట్టా పొందారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీలో ఎంఎఫ్‌ఏ, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ కోర్సులను పూర్తి చేశారు. ప్రస్తుతం భర్తతో కలిసి న్యూజిలాండ్‌లో ఉంటున్నారు. 2009లో తొలిసారి 'అవతార్' కోసం పనిచేసిన ఈమె.. ఇప్పుడు రాబోతున్న మూడో భాగానికి కూడా పనిచేసింది. అవతార్ తొలి సినిమాకి పని చేసింది తక్కువే అయినా గుర్తింపు మెండుగా వచ్చింది. 2022లో వచ్చిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కోసం దాదాపు 3000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్, అవి కూడా ఎక్కువ భాగం నీటి అడుగున ఉన్నవి పావని టీమ్ సృష్టించారు. ఇప్పుడు అవతార్ 3( 'ఫైర్ అండ్ యాష్') కోసం అగ్ని, బూడిద తదితర వీఎఫ్ఎక్స్ షాట్స్ రూపొందించారు. మరి ఇవి ఎలా ఉండబోతున్నాయనేది మరికొన్నిరోజుల్లో తెలుస్తుంది.
ఆమె ఏమంటున్నారంటే.. ‘నానమ్మ ఉన్నితో బొమ్మలు తయారు చేసేవారు. చిన్నప్పుడు అవి చూసే ఆర్కిటెక్ట్ అవ్వాలనుకున్నా. ఆ తరవాత విజువల్ ఎఫెక్ట్స్ నన్ను ఆకర్షించాయి. దీనికి సంబంధించి డిజిటల్ కోర్సులు పూర్తి చేశా. అయితే వాటిపై పూర్తి అవగాహన వచ్చింది మాత్రం అవతార్ సినిమాకి పని చేసినప్పుడే. ముఖ్యంగా ‘ది వే ఆఫ్ వాటర్’లో దాదాపు 3000 విజువల్ ఎఫెక్ట్స్ షాట్లు తీశాం. ఎక్కువ భాగం నీటి అడుగున తీసినవే. ఇవన్నీ సవాల్ తో కూడుకున్న సన్నివేశాలే. మన లోకాన్ని దాటి ప్రేక్షకులకి కొత్త లోకాన్ని చూపిస్తున్నప్పుడు ముందుగా దాన్ని మనం ఆస్వాదించాలి. అంతే జాగ్రత్తగా చిత్రీకరించాలి. బెస్ట్ అవుట్ ఫుట్ కోసం నా టీం చాలా కష్టపడింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్‌కి గానూ ఏడు అకాడమీ, ఉత్తమ స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్‌కి ఏడు బాఫ్టా అవార్డులనీ అందుకున్నాం. వీటితోపాటు ఎమ్మీ, సైన్స్ అండ్ టెక్నాలజీ పురస్కారాలూ పొందడం గర్వంగా ఉంది’ అని అన్నారు. ‘అవతార్’తోపాటు ‘ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ద లయన్’, ‘ద విచ్ అండ్ ద వార్డ్‌రోబ్’, ‘నైట్ ఎట్ ద మ్యూజియం’, ది ఇన్‌క్రెడిబుల్ హల్క్’, ‘రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’తోపాటు మరికొన్ని సినిమాలకూ పని చేశారు పావని.