Steven Spielberg: 50 ఏళ్ళ జాస్

ABN , Publish Date - Jun 20 , 2025 | 05:34 PM

ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ సృష్టించిన అద్భుతం 'జాస్'. ఆ సినిమా విడుదలై నేటికి యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. 65 రోజుల్లో తీయాల్సిన ఆ సినిమాను 157 రోజులకు కంప్లీట్ చేశారు స్పీల్ బర్గ్. అయితే ఐదు పదులు దాటినా ఇప్పటికీ ఈ సినిమాను జనాలు తలుచుకుంటూనే ఉన్నారు.

యావత్ ప్రపంచాన్నీ 'జాస్' సినిమాతో తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ స్టీవెన్ స్పీల్ బర్గ్. జూన్ 20తో 'జాస్' సినిమా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం.

అంతకు ముందు కొన్ని షార్ట్ మూవీస్, మరికొన్ని టీవీ ఫిలిమ్స్ తీసిన స్టీవెన్ స్పీల్ బర్గ్ (Steven Spielberg) తొలిసారి 'ద సుగర్ లాండ్ ఎక్స్ ప్రెస్'తో థియేటర్లలోకి వచ్చారు స్టీవెన్ స్పీల్ బర్గ్. ఆ సినిమా పెద్దగా అలరించలేదు. ఆ తరువాత స్టీవెన్ స్పీల్ బర్గ్ రూపొందించిన 'జాస్' (Jaws) సినిమా అనూహ్య విజయం సాధించింది. 1975 జూన్ 20వ తేదీన 'జాస్' జనం ముందు నిలచింది. పీటర్ బెంచ్లే రాసిన 'జాస్' నవల ఆధారంగా 'జాస్' తెరకెక్కింది.. నవల మొత్తం కాకుండా తన సినిమాకు పనికి వచ్చే మేరకు కథను తీసుకున్నారు స్టీవెన్ స్పీల్ బర్గ్. 'జాస్' సినిమాకు ఆ నవలా రచయిత పీటర్ బెంచ్లేతోనే స్క్రీన్ ప్లే రాయించారు స్పీల్ బర్గ్. ఆయనకు కార్ల్ గొట్టేబ్ కూడా సహకరించారు. అలా రూపొందిన 'జాస్' స్పీల్ బర్గ్ ఊహించలేనంత విజయం సాధించింది.


అందరూ విహారయాత్రలు చేసే ఓ బీచ్ పరిసరాల్లో షార్క్ తిరుగుతోందని తెలుస్తుంది. మొదట్లో ఎవరూ నమ్మరు. అయితే షార్క్ మనుషులను కూడా ఎరలా నోట్లో వేసుకుపోతూ ఉంటుంది. దాంతో భయభ్రాంతులవుతారు. జాస్ ఉంది - దానిని ఎలా ఎదుర్కోవాలన్న ఆసక్తితోనే కథ సాగుతుంది. చివరలో షార్క్ ను అంతమొందించే ప్రయత్నమే ఈ చిత్రకథ. దీనిని స్పీల్ బర్గ్ తెరకెక్కించిన విధానం విశేషంగా ఆకట్టుకుంది. ఆరంభంలో అమెరికా, బ్రిటన్ దేశాల్లో విడుదలైన 'జాస్' మౌత్ టాక్ తోనే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయఢంకా మోగించింది. మన దేశంలోనూ పలు ప్రధాన కేంద్రాలలో జైత్రయాత్ర చేసింది 'జాస్'.


'జాస్' సినిమా అప్పట్లో 9 మిలియన్ డాలర్లతో తెరకెక్కింది. అంటే తొంభై లక్షల అమెరికన్ డాలర్లు. యాభై ఏళ్ళ క్రితం మన కరెన్సీలో ఏడున్నర కోట్ల రూపాయలు. అప్పట్లో డాలర్ విలువ 8.39 రూపాయలే ఉండేది. అయితే 'జాస్' బాక్సాఫీస్ వద్ద 476 మిలియన్ డాలర్లు పోగేసింది. అంటే పెట్టిన పెట్టుబడి మీద 52 రెట్లు వసూళ్ళు చూసిందన్న మాట. అప్పట్లో ఈ స్థాయి సక్సెస్ చూసిన సినిమా లేదు. తరువాత రెండేళ్ళకు 'స్టార్ వార్స్' మూవీ 'జాస్'ను కలెక్షన్స్ లో బీట్ చేసింది. 'జాస్' సినిమా ఘనవిజయానికి స్పీల్ బర్గ్ డైరెక్షన్, బిల్ బట్లర్ కెమెరా పనితనం, వెర్నా ఫీల్డ్స్ ఎడిటింగ్, సినిమా టెంపోను నడిపించిన జాన్ విలియమ్స్ మ్యూజిక్ కారణమని చెప్పక తప్పదు. ఈ నాటికీ 'జాస్' సినిమా వస్తోందంటే చాలు ఆ నాటి అభిమానులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. 'జాస్' వచ్చిన మూడేళ్ళకు 1978లో 'జాస్ 2' జనం ముందు నిలచింది. ఈ చిత్రానికి జీన్నాట్ ష్వార్క్ దర్శకత్వం వహించారు. అయితే ఆ సినిమా ఈ స్థాయి సక్సెస్ ను చూడలేదు.

Also Read: Kannappa Event: ఇంతకీ ప్రభాస్‌ వస్తాడా.. లేదా.. ఫ్యాన్స్‌ వెయిటింగ్‌

Also Read: Surya: డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా టైటిల్ ప్రకటన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 20 , 2025 | 05:34 PM