Anaconda: కొత్త అనకొండ.. 21 ఏండ్ల తర్వాత వస్తోంది! ట్రైలర్ చూశారా
ABN, Publish Date - Sep 17 , 2025 | 08:15 PM
చాలా రోజుల తర్వాత హాలీవుడ్ నుంచి అనకొండ (Anaconda) చిత్రం ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది.
చాలా రోజుల తర్వాత హాలీవుడ్ నుంచి అనకొండ (Anaconda) చిత్రం ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 4 చిత్రాలు రాగా చివరి చిత్రం 2004లో వచ్చి మంచి విజయం సాధించింది. మధ్యలో మూడు టీవీ ఒరిజినల్ సినిమాలు సైతం వచ్చి అలరించాయి. ఇప్పుడు 21 సంవత్సరాల తర్వాత ఐదవ చిత్రంగా ఈ అనకొండ తెరకెక్కింది. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబర్ 25న థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ను గమనిస్తే.. గత చిత్రాలకు భిన్నంగా ఫుల్ కామెడీని మేళవించి, అనకొండతో థ్రిల్లింగ్ అడ్వంచర్ చేసినట్లు తెలుస్తోంది. కథ విషయానికి వస్తే.. డాగ్ (జాక్ బ్లాక్), గ్రిఫ్ (పాల్ రుడ్) చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వాళ్లకు ఎప్పటికైనా అనకొండ సినిమాను కామెడీ తరహాలో రిమేక్ చేయాలని కలలు కంటుంటారు. అలా మధ్య వయసుకు వచ్చాక వారి కోరికను తీర్చుకునేందుకు నలుగురైదురు, ఇతర షూటింగ్ సామాగ్రితో అమెజాన్ అడవుల్లోకి వెళతారు. అక్కడ మాములు పాములతో షూటింగ్ చేస్తుండగా సడన్‌గా అసలైన భారీ అనకొండ సీన్‌ళోకి ఎంట్రీ ఇస్తుంది. దీంతో వారు అక్కడి నుంచి సర్వెవ్ ఎలా అయ్యారు అనే పాయింట్‌తో కామెడీని రంగరించి సినిమాను రూపొందించారు.
జాక్ బ్లాక్ (Jack Black), పాల్ రూడ్ (Paul Rudd), సెల్టన్ మెల్లో (Selton Mello), డానియేలా మెల్చియర్ (Daniela Melchior), తండివే న్యూటన్ (Thandiwe Newton), స్టీవ్ జాన్ (Steve Zahn ) కీలక పాత్రల్లో నటించగా టామ్ గోర్మికన్ (Tom Gormican) దర్శకత్వం వహించాడు. సోనీ పిక్చర్స్ నిర్మించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది.