Robert Redford: ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్.. ఇక లేరు
ABN, Publish Date - Sep 16 , 2025 | 08:05 PM
విఖ్యాత హాలీవుడ్ నటనిర్మాతదర్శకుడు రాబర్ట్ రెడ్ ఫోర్డ్ (Robert Redford) సెప్టెంబర్ 16న కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు.
Robert Redford: విఖ్యాత హాలీవుడ్ నటనిర్మాతదర్శకుడు రాబర్ట్ రెడ్ ఫోర్డ్ (Robert Redford) సెప్టెంబర్ 16న కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. కొంతకాలంగా వయసురీత్యా అనారోగ్య సమస్యలతో రాబర్ట్ బాధపడుతున్నారు. నటునిగానే కాదు దర్శకునిగానూ తనదైన బాణీ పలికించారు రాబర్ట్ రెడ్ ఫోర్డ్. ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన 'ఆర్డినరీ పీపుల్' (Ordinary People)(1980) ద్వారా బెస్ట్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డును అందుకోవడం విశేషం! ఆయన కీర్తి కిరీటంలో అనేక అవార్డులూ రివార్డులూ రత్నాల్లా వెలుగుతున్నాయి.
చార్లెస్ రాబర్ట్ రెడ్ ఫోర్డ్ జూనియర్ గా 1936 ఆగస్టు 18న కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో జన్మించారు. ఐరిష్, స్కాటిష్, ఇంగ్లిష్ రూట్స్ కలిగిఉన్న రెడ్ ఫోర్డ్ చదువులో అంత గొప్పగా సాగలేదు. 1954లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో చేరారు. యేడాదిన్నర దాటాక తాగుడుకు బానిసయ్యారు రాబర్ట్. దాంతో యూనివర్సిటీ నుండి గెంటేశారు. బ్రూక్లిన్ లో పెయింటింగ్ నేర్చుకున్నారు. తరువాత 'అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్'లో చేరారు. అక్కడే నటనలో శిక్షణ పొందారు. ఆ పై నాటకాలు వేస్తూ సాగిన రెడ్ ఫోర్డ్ టీవీ సీరియల్స్ లోనూ నటించారు. 1960 నాటి 'టాల్ స్టోరీ' (Tall Story) లో తొలిసారి తెరపై తళుక్కుమన్నారు రెడ్ ఫోర్డ్. 'ద వర్ఝినీయన్' (1964)తో నటునిగా మంచి గుర్తింపు లభించింది. 1966లో మార్లన్ బ్రాండో హీరోగా రూపొందిన 'ద ఛేజ్'లో కీలక పాత్ర ధరించారు రెడ్ ఫోర్డ్. జేన్ ఫోండాతో కలసి రెడ్ ఫోర్డ్ నటించిన 'బేర్ ఫుట్ ఇన్ ద పార్క్' (Barefoot in the park)(1967) మంచివిజయం సాధించింది.
1972లో రాబర్ట్ నటించిన 'ద క్యాండిడేట్' (The Candidate) బాక్సాఫీస్ వద్ద మోడరేట్ సక్సెస్ చూసింది. కానీ, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాంతో రెడ్ ఫోర్డ్ క్రేజ్ అమెరికాలో విశేషంగా పెరిగింది. 1976లో డస్టిన్ హాఫ్ మన్ తో కలసి రాబర్ట్ రెడ్ ఫోర్డ్ నటించిన 'ఆల్ ద ప్రెసిడెంట్స్ మెన్' (All the President's Men) ఘనవిజయం సాధించింది. రెడ్ ఫోర్డ్ మూవీస్ లో ఓ మైలురాయిగా ఈ సినిమా నిలచింది. పాల్ న్యూమన్ తో కలసి రెడ్ ఫోర్డ్ నటించిన సినిమాలు ఆకట్టుకున్నాయి. వారిద్దరూ నటించిన "బచ్ క్యాసిడీ అండ్ సన్ డ్యాన్స్ కిడ్' ( Butch Cassidy and the Sundance Kid) (1969), 'ద స్టింగ్' (The Sting) (1973)" చిత్రాలు క్లాసిక్స్ గా నిలిచాయి. రాబర్ట్ రెడ్ ఫోర్డ్ 'ద స్టింగ్'తో బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ నామినేషన్ సంపాదించారు. ఆయన కెరీర్ లో నటునిగా ఆస్కార్ నామినేషన్ పొందిన ఏకైక సందర్భమిదే.
రాబర్ట్ రెడ్ ఫోర్డ్ 1980లో మెగాఫోన్ పట్టారు- ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం 'ఆర్డినరీ పీపుల్' ఉత్తమ దర్శకునిగా ఆస్కార్ అవార్డును సంపాదించి పెట్టింది. ఈ సినిమా బెస్ట్ పిక్చర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డులనూ సొంతం చేసుకుంది. తరువాత "ద మైలగ్రో బీన్ ఫీల్డ్ వార్ (1988), 'ద రివర్ రన్స్ త్రో ఇట్' (1992), 'క్విజ్ షో' (1994), 'ద హార్స్ విష్పరర్' (1998), 'ద లెజెండ్ ఆఫ్ బ్యాగర్ వేన్స్' (2000), 'లయన్స్ ఫర్ ల్యాంబ్స్' (2007), 'ద కాన్సిపిరేటర్' (2010), 'ద కంపెనీ యూ కీప్' (2012), 'క్యాథడ్రాల్స్ ఆఫ్ కల్చర్' (2014)" చిత్రాలనూ స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. వీటిలో కొన్ని సినిమాలను సొంతగా నిర్మించారు.
రాబర్ట్ రెడ్ ఫోర్డ్ 1958లో లోలా వ్యాన్ వ్యాగనెన్ ను వివాహమాడారు. వారికి నలుగురు పిల్లలు. వారిలో డాక్యుమెంటరీ ఫిలిమ్ మేకర్ డేవిడ్ జేమ్స్ రెడ్ ఫోర్డ్ (David James Redford), నటి నిర్మాత అమీ రెడ్ ఫోర్డ్ (Amy Redford) పేరొందారు. రాబర్ట్ తనయుడు జేమ్స్ 2020లో కన్నుమూశారు. అప్పటి నుంచీ రాబర్ట్ కుంగిపోయారు. 2009లో రాబర్ట్ రెండో వివాహం చేసుకున్నారు. ఆయన రెండో భార్య పేరు సిబైల్ జగార్స్. రాబర్ట్ తో చివరగా ఉన్నది సిబైల్ మాత్రమే. రాబర్ట్ మరణ వార్త వినగానే హాలీవుడ్ తీవ్ర విచారంలో మునిగింది.
The Great Pre Wedding Show Teaser: నవ్వులు పూయిస్తున్న తిరువీర్ కొత్త సినిమా టీజర్
Kalyan Shankar: మ్యాడ్ డైరెక్టర్.. ఈసారి భయపెడతాడట