Cannes2025: అట్ట‌హాసంగా కాన్స్‌ఫెస్టివ‌ల్ ప్రారంభం.. భార‌త్ నుంచి ఆ ఒక్క చిత్ర‌మే

ABN, Publish Date - May 14 , 2025 | 10:49 AM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన 78వ కాన్స్‌2025 (Cannes 2025) చిత్రోత్స‌వ వేడుక మంగ‌ళ‌వారం ఫ్రాన్స్‌లో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది.

cannes

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌సిద్ధి చెందిన 78వ కాన్స్‌ 2025 (Cannes 2025) చిత్రోత్స‌వ వేడుక మంగ‌ళ‌వారం ఫ్రాన్స్‌లో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా హాలీవుడ్ సెల‌బ్రిటీలు సంద‌డి చేశారు. కార్య‌క్ర‌మానికి వివిధ వ‌స్త్ర‌ధార‌ణ‌ల్లో హాజ‌రై ఫెస్టివ‌ల్‌కు కొత్త‌ క‌ళ తీసుకువ‌చ్చారు. అనంత‌రం మ‌రో ప‌క్షం రోజుల్లో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న‌ చార్లీచాప్లిన్ 'గోల్డ్ ర‌ష్' చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. త్వ‌ర‌లో కొన్ని సెల‌క్ట్ చేసిన చిత్రాలు ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ : ది ఫైనల్‌ రెకనింగ్‌’, ‘హయ్యెస్ట్‌ 2 లోయెస్ట్‌’ వంటి వాటిని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ఫెస్టివల్‌ను పుర‌స్క‌రించుకుని లెజండ‌రీ యాక్ట‌ర్‌ రాబర్ట్ డి నీరోకు గౌరవ పామ్ డి’ఓర్ అవార్డును లియోనార్డో డికాప్రియో అందజేశాడు. కాగా ఈ ఉత్స‌వం మ‌రో ప‌ది రోజులు (మే24) వ‌ర‌కు జ‌రుగ‌నుంది.

ఇక మ‌న దేశం నుంచి ఈ ద‌ఫా పామ్ డి’ఓర్ (Palme d'Or) పోటీలో ఏ చిత్రం ప్ర‌ద‌ర్శించేందుకు అర్హత పొంద‌క పోయినప్ప‌టికీ 1970ల‌లో సత్యజిత్‌ రే తెర‌కెక్కించిన‌ ‘అరణ్యేర్‌ దిన్‌ రాత్రి’ (Aranyer Din Ratri) చిత్రాన్ని మే 19న ‘కాన్స్‌ క్లాసిక్‌’ విభాగంలో 4కే వెర్షన్‌లో ప్రదర్శించనున్నారు. సినిమాలో గిరిజన సంతల్‌ అమ్మాయి దులిగా నటించిన సిమీ గరేవాల్ కాన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్ట‌నున్నారు.మ‌రోవైపు ఎప్ప‌టిలానే ఈ సారి కూడా బాలీవుడ్ నుంచి అగ్ర న‌టీమ‌ణులతో పాటు 'లాప‌తా లేడీస్' ఫేమ్‌ నితాన్షి గోయల్ అటెండ్ కానున్నారు. ఇండియా నుంచి తొలిరోజు బాలీవుడ్‌, టాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌతేలా జాదుగ‌ర్ డిజైన్ డ్రెస్సింగ్‌తో హ‌జ‌రై ఆహుతుల‌ను ఆక‌ట్టుకుంది.

ఇదిలాఉంటే 2024లో ఆల్ వి ఇమాజిన్ యాస్ లైట్ (గ్రాండ్ ప్రిక్స్ విజేత) దర్శకురాలు పాయల్ కపాడియా 2025 కాన్స్ పోటీల‌కు హాలీవుడ్ తారలు హాలీ బెర్రీ వంటి తార‌ల‌తో క‌లిసి జ్యూరీ సభ్యురాలిగా ఉన్నారు. ఈ ఫెస్టివల్‌కు ఆలియా భట్, లోరియల్ అంబాసిడర్‌గా కాన్స్ 2025లో తొలిసారి అడుగు పెట్టాల్సి ఉండగా, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ఈ ఓపెనింగ్ సెరిమనీకి హాజరు కాలేదు. తర్వాతి రోజుల్లో వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే ఈ సారి ఫెస్టివ‌ల్‌కు వ‌స్థ‌ధార‌ణ విష‌యంలో క‌ఠిన నిబంధ‌న‌లు విధించ‌డంతో ఎక్క‌డా భారీ డ్రెస్‌లు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - May 14 , 2025 | 03:00 PM